ఢిల్లీలోని ఈ స్ట్రీట్‌ఫుడ్స్‌ను ఎప్పుడైనా తిన్నారా?
స్ట్రీట్ ఫుడ్ అనగానే చాలామందికి నోరూరించే చాట్, వెరైటీ ఐస్ క్రీమ్స్, విభిన్న రకాల ఆహారపదార్ధాలు వెంటనే గుర్తొస్తాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ దేశ రాజధాని ఢిల్లీను సందర్శించే వారి సంఖ్య ఎంతో అధికంగా ఉంటుంది. వీరిలో ఎక్కువ శాతం దేశ, విదేశీ టూరిస్టులు అధికంగా ఉంటారు. ఢిల్లీ ప్రముఖ ప్రదేశాలతో పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా ఇక్కడి రుచికరమైన ఆహార పదార్ధాలతో ఎంతోమంది పర్యాటకులకు నోరూరిస్తుంది. మీరు మంచి ఆహార ప్రియులైతే ఢిల్లీలోని ఈ స్ట్రీట్ ఫుడ్స్ మీకు సాదర ఆహ్వనం పలుకుతున్నాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. మరెందుకాలస్యం ఆ స్ట్రీట్ ఫుడ్స్ ఏమిటి ? అవి ఎక్కడ లభిస్తాయో? అనే వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే పదండి..

సమోస జిలేబీ
సమోసా, జిలేబీ కాంబినేషన్ పేరు చెప్పగానే చాలామందికి నోరూరుతుంటుంది. ఎందుకంటే భారతదేశంలోని ఆహారప్రియులెందరికో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇది. ఈ కాంబినేషన్‌ను ఉదయం పూట అల్పాహారంగా ఢిల్లీలో చాలా మంది తీసుకుంటారు. ఈ రుచికరమైన వంటకాలు వెంటనే ఆకలి తీరుస్తాయి. రోజులో ఏ వేళలో అయినా ఇవి అందుబాటులో ఉంటాయి. ఇంకా దేశంలోని చాలా ప్రదేశాల్లో ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా వీటిని తీసుకుంటారు. వేడిగా ఉండే సమోసా, తియ్యగా ఉండే జిలేబీ రుచులు బెస్ట్ స్నాక్ అని చెప్పవచ్చు. ఢిల్లీలోని చాలా దుకాణాలు ఎప్పుడూ రద్దీతో కిటకిటలాడుతుంటాయి.

ఆలూ చాట్
ఢిల్లీలోనే కాదు దేశంలోని ప్రతిచోటా లభించే ఈ వంటకం పర్యాటకులను ఎంతోమందికి నచ్చే వంటకం కూడా. ప్రతి చోటా లభించే ఆలూ చాట్ ను ఇష్టపడని వారు ఉండరు. ఇక, ఢీల్లీ వంటి రద్దీ నగరాల్లో సాయంత్రం వేళ దీన్ని స్నాక్‌గా తీసుకునేందుకు చాలామంది టూరిస్టులు, ప్రజలు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక్కడ దొరికే విధంగా ఆలూ చాట్ రుచి మరెక్కడా లభించదు. ఇక, ఈ వర్షాకాలంలో వేడి వేడి ఆలూచాట్‌ను ఓ పట్టు పట్టేయాల్సిందే..

గోల్ గప్పా
భారతదేశంలో వయసు సంబంధం లేకుండా అత్యధిక శాతం మంది ఇష్టపడే స్ట్రీట్‌ఫుడ్ గోల్ గప్పా లేదా పానీ పూరీ. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికి పానిపూరీ పేరు చెప్పగానే నోరూరిపోతుంటుంది. ఇక, ఢిల్లీలాంటి ప్రాంతాల్లో ఇక దీని రద్దీ మాములుగా ఉండదు. ఢిల్లీ ప్రాంతంలో వీటిని ప్రత్యేకంగా గోల్ గప్పాస్ అంటారు. నగరంలో ప్రతి రద్దీ ప్రదేశంలోనూ వీటి స్టాల్స్ మనకు తారసపడతాయి. సి.ఆర్.పార్క్ మార్కెట్ వద్ద బెంగాలీ శైలి గోల్ గప్పాలు లభిస్తాయి. వీటిని పుచ్కా అని కూడా పిలుస్తారు. చాందినీ చౌక్ వద్ద మరో రకమైన గోల్‌గప్పా రుచి దొరుకుతుంది. ఒక్కో స్టాల్ దగ్గర ఒక్కో రుచితో పర్యాటకులను నోరూరిస్తుంటుంది.

టిక్కీ చాట్
ఢిల్లీలోని దాదాపు అన్ని చిన్న, పెద్ద మార్కెట్ ల వద్ద రోడ్డు ప్రక్కల చాట్ స్టాల్స్ తప్పకుండా కనిపిస్తాయి. ఇక్కడ బంగాళాదుంపలను ముక్కలుగా చేసి నూనెలో వేయించి కట్లెట్ లను తయారు చేస్తారు. వీటిని టిక్కీలని కూడా పిలుస్తారు. కొత్తిమీర చట్నీతో కలిపి వీటిని రుచికరంగా అందిస్తారు. ఎక్కువగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టంతో తింటుంటారు. వర్షాకాలంలో సాయంత్ర పూట వేడి వేడి టిక్కి చాట్‌ను కొత్తిమీర చట్నితో ఓ పట్టు పట్టాల్సిందే..



Click it and Unblock the Notifications












