నోయిడా సమీపంలోని ఈ అందమైన లోయలను చూశారా..
వర్షాకాలంలో అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఓవైపు చిరుజల్లులు కురుస్తుంటే మరోవైపు పచ్చని ప్రకృతి రమణీయతలో పారవశ్యం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇక జలపాతాల వద్ద పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. అయితే వానాకాలంలో జలపాతాలు, పచ్చని ప్రకృతి రమణీయత, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కేవలం జలపాతాలే కాకుండా లోయలను కూడా ఈ సీజన్‌లో సందర్శించొచ్చు. అయితే వాటి కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నోయిడా సమీపంలోని ఈ లోయలను మాత్రం ఈ సీజన్‌లో చూసి తీరాల్సిందే..

నౌకుచియాటల్
నౌకుచియాటల్ ఉత్తరాఖండ్‌లోని ఒక సుందరమైన లేక్ గ్రామం. ఈ అందమైన హిల్ స్టేషన్ హిమాలయాల చుట్టూ ఉంది. ఇక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతం కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఎంతో అనువైనది. దీనిని తొమ్మిది మూలల సరస్సు అని కూడా అంటారు. ఇక్కడ నౌకుచియాటల్ సరస్సు, సత్తాల్ సరస్సు, రాణిఖెట్, భీమ్‌తాల్ సరస్సు వంటి అందమైన ప్రదేశాలను కూడా ఆస్వాదించవచ్చు. ఈ హిల్ స్టేషన్ నోయిడా నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి చేరుకోవాలంటే సుమారు ఆరునుంచి ఏడు గంటల సమయం పడుతుంది. రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. సంవత్సరం పొడవునా అద్భుతమైన వాతావరణంతో ఈ సుందరమైన సరస్సు పర్యాటకులను ఎంతగానో మంత్రముగ్థులను చేస్తుంది.

రామ్‌ఘర్
నౌకుచియాటల్ సమీపంలో రామ్‌ఘర్ ప్రసిద్ధ హిల్ స్టేషన్. నౌకుచియాటల్‌ను సందర్శించాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ స్థలాన్ని కూడా జాబితాలో చేర్చుకోవచ్చు. ఇక్కడ మలుపులు తిరిగే రోడ్లు ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. ఇక్కడి పర్వతాల చల్లని గాలి, అందమైన లోయలు, ప్రశాంతతమైన వాతావరణం పర్యాటకులను మైమరింపజేస్తుంది. నగర హాడావిడి నుండి దూరంగా ఉన్న ఈ హిల్ స్టేషన్‌లో కుటుంబంతో కాసేపు సరదాగా గడపొచ్చు.
రేవల్సార్
ఈ అందమైన, ప్రశాంతమైన హిల్ స్టేషన్ మండి జిల్లాలో ఉంది. అంతే కాదు, ఈ హిల్ స్టేషన్ అనేక విధాలుగా సిక్కు, హిందూ మరియు బౌద్ధ మతాల ప్రజలకు విశ్వాస కేంద్రంగా కూడా ఉంది. రేవల్సార్ హిల్ స్టేషన్ భారతీయ సాంస్కృతిక సౌందర్యం, సహజ దృశ్యాల కలయిక అని చెప్పుకోవచ్చు. నోయిడా నుండి దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హిల్ స్టేషన్. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు తొమ్మిది నుండి పది గంటల సమయం పడతుంది.

పర్వానూ
పర్వానూ హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనుకునేవారికి ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఇక్కడి సహజ దృశ్యాలు, దట్టమైన అడవుల మధ్య తిరిగే అనుభవం యాత్రను మరింత ఆహ్లదపరుస్తుంది. నోయిడా నుండి 346 కిలోమీటర్ల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంది. రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు ఆరు నుండి ఏడు గంటల సమయం పడుతుంది.
కౌసని
ఈ రణగొణధ్వనుల నుండి కాస్త ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడపాలనుకునేవారికి ఈ ప్రదేశం ఉత్తమ ఎంపిక. ఈ ప్రదేశం కుమావోన్ ప్రాంతంలోని అల్మోరా నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడపొచ్చు. ఇక్కడ సందర్శించడానికి నందా దేవి, పంచచూలి శిఖరం, త్రిశూల్ వంటి పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి.



Click it and Unblock the Notifications












