మత సామరస్యానికి ప్రతీక భారతదేశం. ప్రాంతాలు, జీవనశైలి ఆధారంగా మన దేశంలో మత సాంప్రదాయాల్లోనూ అనేక మార్పలు చూస్తూ ఉంటాం. సాధారణంగా పీర్ల పండగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహిస్తారు. ముస్లింలు నిర్వహించే ఈ పీర్ల పండగను శ్రీకాకుళం జిల్లాలోని ఓ పల్లెలో హిందువులు కొన్నేళ్లుగా సంప్రదాయంగా నిర్వహిస్తూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఇక్కడ వీరి మధ్య కనిపించే సోదరభావం ఎంతో స్పూర్తివంతంగా అనిపిస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం కూర్మనాథపురం గ్రామంలో ఈ సీజన్ వచ్చిందంటే చాలు పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ గ్రామంలోని హిందువులు మత సామరస్యానికి ప్రతీకగా కొన్నేళ్ల నుంచి సంప్రదాయం ప్రకారం పీర్ల పండగను నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు జరిగే వేడుకలు ఈ జూలై 7న ప్రారంభమవ్వగా 17వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఈ సందర్భంగా హిందూముస్లిం కుంటుబాలు సోదరభావంతో స్నేహపూర్వకంగా మెదులుతారు. పదిరోజులు సాగే ఈ పండగలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతారు. తిరువీధి నిర్వహించే సమయంలో మహిళలు ముర్రాటలతో పీర్ల వెంట నడుస్తూ తమ విశ్వాసాన్ని చాటుకుంటారు.

చారిత్రక నేపథ్యం ఉన్నట్లు..
ఈ ఆచారినికి చారిత్రక నేపథ్యం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతుంటారు. సుమారు 150 సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు పెద్దలు వివరిస్తున్నారు. గతంలో 50 ముస్లిం కుటుంబాల వరకూ ఉండేవట. అయితే, ఆర్థిక ఇబ్బందులు కారణంగా చాలా కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.
అలా వారు గ్రామం వదిలి వెళ్లినప్పటికీ వారి సంప్రదాయాలను మాత్రం గ్రామస్తులు విడిచిపెట్టలేదు. పీర్ల పండగను ఏటా ఘనంగా నిర్వహిస్తూ.. వారిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన షేక్ యాకూబ్ మందిరంలో కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉంటారు. గ్రామస్తులు ఆపద సమయంలో పీర్లను తలుచుకుంటామని చెబుతుంటారు. ఉత్సవాల సమయంలో మొక్కులు చెల్లిస్తూ.. 11 రోజుల పాటు గ్రామం పండగ వాతావరణంతో సందడిగా కనిపిస్తుంది.

పీర్లతో అగ్ని గుండంపై నడిచే..
పండగలో భాగంగా మందిరంలో హిందువులు అరటిగెలలు నైవేద్యంగా అందిస్తారు. అంతేకాదు, బిందెల్లో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. ఉత్సవాల రోజుల్లో రాత్రి వేళ పీర్లను ఘనంగా ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు (జూలై 13న) రాత్రి గ్రామంలో సర్కాస్ ఏర్పాట్లు చేస్తున్నారు. పీర్లతో అగ్ని గుండంపై నడిచే క్రతువు ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇదే క్రతువు 16న మరోసారి నిర్వహిస్తారు. ఈ పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఇక్కడికి వచ్చి పీర్లను దర్శించుకుంటారు.
చివరి రోజు (జూలై 17న) పీర్లను దగ్గరలోని వంశధార కాలువలో నిమజ్జనం చేయడంతో పండగ ముగుస్తుంది. ఈ సందర్భంగా చుట్టపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఉత్సవాలను తిలకిస్తూ ఉంటారు. అలాగే, ఉత్సవాల్లో చివరిరోజు నిర్వహించే అన్నసంతర్పణకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి, ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఇంతకంటే, మతసామరస్యానికి ప్రతీక ఏముంటుంది చెప్పండి!



Click it and Unblock the Notifications













