తొలకరి చినుకుల పలకరింపుతో ప్రకృతి అందాల సందడి మొదలైంది. పచ్చదనం కమ్మేసిన చిగురుటాకులు పర్యాటకానికి ఆహ్వానం పలుకుతున్న సమయమిది. కొండ కోనల్లో వాగులు, వంకలు పొంగుపొర్లుతూ జలపాతాల సవ్వడులు వినసొంపుగా సందడి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త అందాలను ఆవలింపజేసుకునే అరకు పర్యాటకానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఆంధ్రా ఊటీకి కూతవేటు దూరం ఉన్న చాపరాయి జలపాతపు విశేషాలు తొలకరి పలకరింపు వేళ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే! మరెందుకు ఆలస్యం.. చాపరాయి జలపాలపు విశేషాలు చూసేద్దామా?!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వన్ డే అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. అయితే, ఈ టూర్ ప్యాక్ జాబితాలో డుంబ్రిగూడ చాపరాయి జలపాతం సందర్శన లేకపోవడం ఒకింత నిరాశకలిగిస్తోందనే చెప్పాలి. ఈ కారణంగా చాలామంది ప్రకృతి ప్రేమికులు అరకు నుంచి తమ సొంత వాహనాలు లేదా టాక్సీల్లో చాపరాయి జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. ఈ ప్రాంతం అరకు లోయ నుంచి పాడేరు వెళ్లే మార్గంలో 15 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే వస్తుంది.
అరకు నుంచి చాపరాయికి రోడ్డు అందుబాటులో ఉండడంతో అరకు లోయ వరకు రైలు లేదా బస్సులో వచ్చి, అక్కడి నుంచి జలపాతానికి చేరుకోవచ్చు. వైజాగ్ నుంచి అరకు లోయకు చేరుకోవడానికి కిరండోల్ ప్యాసింజర్ రైలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. అయితే, వంపులు తిరుగుతూ సాగే రైలు ప్రయాణం మాత్రం జీవితంలో మర్చిపోలేని అనుభూతులను చేరువ చేస్తుంది.

సినీ నిర్మాతలు ఇష్టపడే ప్రాంతం..
ఇక చాపరాయి జలపాతాల విషయాని వస్తే.. ఈ ప్రాంతం ఓ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అరకు లోయలో ఉన్న అనేక జలపాతాల్లో ఇదొకటి. అయినప్పటికీ విశాలమైన కొండల గుండా ప్రవహించే ఇక్కడి అందమైన ప్రవాహం చాపరాయి జలపాతాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. జలపాతాల చుట్టూ ఉన్న ప్రాంతం పిక్నిక్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కొండ రాళ్లపై ఏటవాలుగా జలపాతాలు చూడానికి ఎంతో అందంగా ఉంటుంది. వారాంతాల్లో చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.
ఈ జలపాతం తెలుగు సినిమా నిర్మాతలు ఇష్టపడే ప్రదేశాలలో ఒకటిగా చెబుతారు. సహజ శిలల గుండా ప్రవహించే నీటి అందాలను ఆస్వాదించేందుకు చాలా అద్భుతంగా ఉంటాయి. నీటి ప్రవాహం ఎక్కువగా లేనప్పుడు పర్యాటకులు జలపాతం వద్ద స్నానం చేయడానికి సాధ్యపడుతుంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ జలపాతంలోకి దిగడం చాలా ప్రమాదకరం.

వారికి ఇది సరైన గమ్యస్థానం..
ఈ సీజన్‌లో పర్యాటకులు అరకు నుంచి సొంత వాహనాలు లేదా టాక్సీ తీసుకొని చాపరాయి జలపాతాన్ని చేరుకోవచ్చు. చాపరాయి నీటి జలపాతాలు, అటవీ ప్రాంతాలతో సందర్శకులను మంత్రముగ్దులను చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మానసిక ప్రశాంతత కోరుకునేవారికి ఇది సరైన గమ్యస్థానే చెప్పాలి. అరకు లోయను సందర్శించేందుకు వచ్చేవారు చాపరాయి జలపాతంలో అడుగుపెట్టకుండా వెళితే ఆ టూర్ అసంపూర్తిగా ముగిసిట్లే. ప్రకృతితో మమేకమయ్యేందుకు ఈ ప్రాంతం ఆహ్వానం పలుకుతుంది. మరెందుకు ఆలస్యం ఈ తొలకరి వేళ కుటుంబసమేతంగా చాపరాయి అందాలను చూసేందుకు మీరూ బయలుదేరండి.



Click it and Unblock the Notifications













