కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన మాసం. ఇందులో సోమవారం అనేది చాలా పవిత్రమైనది. ఆ రోజున శివుడిని భక్తితో పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. కార్తీక మాసంలో శివాలయాలన్ని భోలేనాథుని శివనామస్మరణతో మారుమొగుతాయి. ఈశ్వరునికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో ఒక్కసారైన శివాలయాన్ని సందర్శించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. అందుకే ఈ మాసంలో ఎక్కడచూసినా శివాలయాలు కిక్కిరిసిపోతూంటాయి. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రసిద్దిచెందిన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం పదండి.

కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి..
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిచెందింది కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కీసరగుట్ట ఆలయం భగవంతుడు శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లాలోని ఒక గట్టుపై వెలసింది. కీసరగుట్ట ఆలయం రంగారెడ్డి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్తీక మాసం, కార్తీకపౌర్ణమి, శివరాత్రి పర్వదినాన ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయం ప్రాంగణంలో స్వయంగా శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. రావణుడిని సంహరించిన తర్వాత ప్రాయశ్చితం చేసుకునేందుకు రాముడు ఇలా చేశాడని ఇక్కడివారు చెబుతుంటారు. చెబుతారు. కీసర గుట్ట ఆలయంలో శివయ్యను, తన సతీమణిని భవానీ, శివదుర్గ పేర్లతో కొలవడం ఆనవాయితీ.

జోగుళాంబ - గద్వాల నవ బ్రహ్మ ఆలయం...
కోటి లింగాలు కొలువైన దక్షిణ కాశిగా పేరుగాంచిన అలంపురం క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం, అలంపురం) నాలుగు శక్తిపీఠాలుండగా వెలసిన ఈ ఆలయాలు, విభజన అనంతరం అలంపురం జోగుళాంబ ఏకైక శక్తిపీఠంగా తెలంగాణలో ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయం రాజధానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గద్వాల జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. తుంగభద్రా నది తీరంలో అలంపూర్ పుణ్యక్షేత్రం వెలిసింది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు రోడ్డు మార్గంతోపాటు రైలుమార్గం కూడా అందుబాటులో ఉంటుంది.

రామప్ప దేవాలయం, వరంగల్
రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో వెలసింది. ఇది హైదరాబాద్‌కి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు రుద్రేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడి శిల్ప సంపద ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయాన్ని తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది యునెస్కో. ఈ ఆలయంలోని మహాశివుని దర్శనకే నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభం అయింది. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టిందని చరిత్ర చెబుతోంది.
ఛాయ సోమేశ్వర స్వామి, నల్గొండ
ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం నల్లగొండ జిల్లాలో వెలసింది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 102 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన పురాతన చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఈ ఆలయం గురించి పెద్దగా ఎవరికి తెలీదు. ఈ ఆలయాన్ని ఇక్ష్వాకు వంశస్తులు 11, 12వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రధాన ఆలయంలోని శివలింగంపై రోజంతా ఎప్పటికీ నీడ ఉంటుందని, అందుకే ఈ ఆలయానికి ఛాయ సోమేశ్వరుడనే పేరును పెట్టారని ఇక్కడివారంతా నమ్ముతారు.



Click it and Unblock the Notifications













