దట్టంగా వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తూ.. పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక్కడి బొగత జలపాతపు అందాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వాలిపోతున్నారు. పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉరకలువేసే బొగత జలపాతపు నీటి నురగలు సైతం చూసేందుకు ఓ సరికొత్త అనుభూతిని చేరువ చేస్తాయంటే అతిసయోక్తి కాదు. మరెందుకు ఆలస్యం పరవళ్లుతొక్కుతోన్న బొగత జలపాతపు అందాలను చూసేద్దాం రండి!
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న బొగత జలపాతాన్ని చేరుకునేందుకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతం భద్రాచలం నుంచి సరిగ్గా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రా నుంచి వచ్చే పర్యాటకులు భద్రాచలం మీదుగా వచ్చేందుకు అవకాశం ఉంది. బొగతకు సొంత వాహనాల్లో రావాలనుకునేవారు భద్రాచలంలో బొగత మార్గం స్వాగతం పలుకుతున్నట్లు తారసపడుతుంది.
అలాగే, తెలంగాణలోని ములుగు నుంచి ఈ ప్రాంతానికి సుమారు 90 కిలోమీటర్ల వరకూ దూరం ఉంటుంది. ములుగు నుంచి ఇక్కడకు బస్సుతోపాటు ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వరంగల్ నుంచి 140 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 329 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇటీవల ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో బొగత జలపాతానికి వరద ప్రవాహం భారీ ఎత్తున పెరిగింది. దీంతోపాటు నిర్మల్ జిల్లాలోని కుంటాల జలపాతం ప్రవాహం కూడా ఉరకలెత్తుతూ ఆకర్షిస్తోంది.

ఆ క్షణాలను మాటల్లో వర్ణించలేం..
చుట్టూ దట్టమైన అడవిలో జలపాతం సవ్వడులు పర్యాటకుల వీనుల విందు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్ వచ్చిందంటే చాలు బొగత జలపాతం సరికొత్త అందాలతో చూపరులను కట్టిపడేస్తూ.. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతపు నీటి అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. దిగువకు చేరిన నీటిలో కేరింతలు కొడుతూ చాలామంది ఔత్సాహికులు సరదాగా గడిపుతూ సందడి చేస్తుంటారు.
పరవళ్లుతొక్కుతోన్న జలపాతాలను వీక్షించేందుకు జనం ఉవ్విళ్లూరుతున్నారు. పర్యాటకులు జలపాతాలలో స్విమ్మింగ్ చేస్తూ.. ఇక్కడి మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో కాస్త ఆలస్యంగా జలపాతల కళ సంతరించుకుందని స్థానికులు చెబుతున్నారు.

క్యూ కడుతోన్న పర్యాటకులు..
చుట్టూ పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండకోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయలతో ఆహ్వానం పలికే నిండైన జలపాతం బొగతను చూసేందుకు వీకెండ్ సమయాల్లో కుటుంబసమేతంగా సందర్శకులు ఇక్కడ క్యూ కడుతున్నారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల నుంచి వారాంతాల్లో సందర్శకులు పెద్దఎత్తున ఇక్కడికి తరలివస్తుంటారని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఇక్కడికి వచ్చే సరైన సధుపాయాలు కల్పిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి!



Click it and Unblock the Notifications













