శనీశ్వరుడు ... ఈ స్వామిని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత పుణ్యం లభిస్తుంది అంటారు. మన భారతదేశంలో శనీశ్వరుడు ఆలయాలు బహు అరుదు. అలాంటి అరుదుల్లో ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని పావగడ లో ఉన్నది. ఇక్కడున్న శనీశ్వరుడు దేవాలయం ప్రసిద్ధి చెందినది. తుముకూరు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో శనీశ్వర స్వామి, శీతల అమ్మవారు కొలువై ఉన్నారు.
చరిత్ర
హొయసులు, మొఘలులు, మైసూర్ రాజులు .. ఇలా ఎందరో ఈ ఊరిని పాలించారు. 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు సంభవించింది. ఆ కరువు గట్టెక్కేందుకై సమీపాన అరణ్యంలో ఉన్న సిద్ధులు, మునుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు ప్రజలు. అప్పుడు వారు ఒక నల్లరాతిని తీసుకొని, శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. అందులో అమ్మవారిని ఆవాహనం చేసి భూమి పై ప్రతిష్టించారు.
భూమిని కాపాడే ఆ తల్లి చల్లని చూపుల ఫలితంగా ఆ ఊర్లో వర్షాలు బాగా పడ్డాయి, తద్వారా ప్రజలు బాగుపడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏ ఊరిలో కరువు వచ్చినా అమ్మవారి యంత్రాన్ని పూజించడం మొదలుపెట్టారు. వర్షాల కోసం వరుణ యాగాలను,యజ్ఞాలను జరిపిస్తుంటారు.
కొన్ని ఏళ్ల క్రితం అమ్మవారి విగ్రహం పక్కన శనీశ్వరుడు విగ్రహాన్ని ప్రతిష్టించాలని కొంతమంది భక్తులు అనుకుంటారు. అదే పనిని ఆచరణలో పెట్టి సఫలీకృతులవుతారు. ఈ స్వామిని ప్రతిష్టించాక అమ్మవారి దేవాలయం కాస్త శనీశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందినది.

దేవతా విగ్రహాలు
అన్ని ఆలయాల వలె కాకుండా ఈ ఆలయం భిన్నంగా ఉంటుంది. అతిపెద్దగా ఉండి, వృత్తాకార ఆకారంలో ఉంటుంది. ఆలయంలోని ఒక పెద్ద మండపంపై శీతలాదేవి ఆలయం ఉన్నది. దాని చుట్టూ రంగురంగుల దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి.
చిత్రకృప : Gokul Venugopal

గణపతి విగ్రహం
ఆలయంలోనికి ప్రవేశించగానే ఎడమవైపు గణపతి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని మొదట దర్శించాకే భక్తులు అమ్మవారిని, శనీశ్వరుణ్ణి మరియు ఇతర దేవతలను దర్శిస్తారు.
చిత్రకృప : Durgeshdubey

పిల్లలు లేనివారు
గణపతి దేవునికి కుడివైపున అశ్వర్థ చెట్టు మనకు దర్శనమిస్తుంది. అక్కడే అమ్మవారి మహాబీజాక్షర యంత్రం కనిపిస్తుంది. పిల్లలు లేనివారు అమ్మవారికి రంగురంగుల గాజులు సమర్పిస్తారు. శీతలాదేవిని పూజించిన భక్తులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.
చిత్రకృప : Manjunath Reddy

శనీశ్వరుడు
అమ్మవారి ఆలయం వెనక శనీశ్వరుని ప్రత్యేక సన్నిధి కలదు. ఈ సన్నిధిలో నవగ్రహాల మధ్య కవచం ధరించి ఉన్న శనీశ్వరుణ్ణి గమనించవచ్చు. పూజలు, అభిషేకాలు, వ్రతాలు స్వామి వారికి జరిపిస్తారు.
చిత్రకృప : Kunguma Rajeshwari Subramanian

పూజలు
పెళ్లి కాలేనివారు, సంతానం లేని వారు, వ్యాపారంలో వృద్ధి చెందాలనుకొనేవారు ఈ స్వామిని కొలుస్తారు. పెళ్లి జరగటానికి మాంగళ్య పూజ, వ్యాపారంలో వృద్ధి చెందటానికి ప్రాకార పూజ జరిపిస్తారు.
చిత్రకృప : Sadasiv Swain

కళాత్మకంగా
పూజావిధానం కాస్త వైవిధ్యంగా ఉంటుంది. పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడే లభిస్తాయి. ఎత్తైన గోపురాలు, శిల్పకళా తోరణాలు లేకున్నా ఆలయం కళాత్మకంగా, చూడముచ్చటగా ఉంటుంది.
చిత్రకృప : Hari Prasad Nadig

బస
రోజూ వేలాది మంది దర్శించుకునే ఈ పావగడ క్షేత్రంలో సరిపడా కాటేజీలు, సత్రాలు, హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. భోజనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సౌత్ ఇండియన్ మీల్స్, టిఫిన్స్ అందుబాటు ధరల్లో లభిస్తాయి.
చిత్రకృప : Nagesh Kamath

మొక్కులు
కోరికలు నెరవేరిన వారు మరళా శీతలా దేవి, శనీశ్వరుడు ఆలయాన్ని వచ్చి ఆనందిస్తారు లేదా మొక్కులు తీర్చుకుంటారు. పావగడ పక్కనే కోట మీద పెద్ద కోట ఉన్నది. సమయం ఉంటె చూసిరండి.
చిత్రకృప : Nagarjun Kandukuru

ఎక్కడ ఉంది ?
బెంగళూరు నుండి 175 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 114 కిలోమీటర్ల దూరంలో, తుముకూరు నుండి 98 కిలోమీటర్ల దూరంలో, కళ్యాణ దుర్గం కు 60 కిలోమీటర్ల దూరంలో పావగడ కలదు. పావగడ కు సమీపాన 40 కి. మీ ల దూరంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ కలదు. ఆంధ్రా సరిహద్దులో ఉన్నది కనుక తెలుగు భక్తులు కూడా అధికసంఖ్యలో వస్తుంటారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు.
చిత్రకృప : Arshad clickz



Click it and Unblock the Notifications














