శివనామస్మరణకు నిలయాలు.. తెలంగాణలోని ఈ ఆలయాలు!
మహాశివరాత్రి పురష్కరించుకుని దేశంలోని శైవక్షేత్రాలు ముస్తుబవుతున్నాయి. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగనున్నాయి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. మహాశివరాత్రి దగ్గపడుతోన్నవేళ తెలంగాణలో శివుడు కొలువై ఉన్న ప్రముఖ శైవక్షేత్రాల విశేషాలను చూద్దాం రండి!

వేములవాడ
తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల జాబితాలో ముందువరసులో ఉండేది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా కొలువుదీరాడు. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ శైవక్షేత్రం ఉంది. ఇంద్రుడి బ్రహ్మహత్య పాపాన్ని నివారణ చేసిన శైవక్షేత్రంగా వేములవాడకు పురాణాల్లో స్థానం ఉంది.

రామప్ప
కాకతీయులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రసిద్ధ శైవక్షేత్రం ఉంది. రామలింగేశ్వరుడి రూపంలో ఇక్కడ శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. అద్భుతమైన శిల్పసంపదకు రామప్ప ఆలయం నిలయం.

ఐనవోలు
వరంగల్ జిల్లాలోని ఈ శైవక్షేత్రాన్ని ఆరో విక్రమాదిత్యుడి మంత్రి అయ్యనదేవుడు క్రీ.శ 1076లో కట్టించాడని చరిత్ర చెప్తోంది. 108 స్తంభాలతో నిర్మితమైన ఈ శైవక్షేత్రం చాళుక్య రాజుల నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు మల్లన్న అవతారంలో భీకరమైన విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ప్రతీ మహా శివరాత్రి పర్వదినాన ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

పానగల్
భౌతిక శాస్త్రవేత్తలకు సవాల్ విసిరిన పురాతన ఛాయా సోమేశ్వరాలయం ఇక్కడే ఉంది. ఛాయా సోమేశ్వరాలయంగా చెప్పుకునే ఈ శైవక్షేత్రంలో శివలింగం మీద నిత్యం నీడ ఉండడం ప్రత్యేకత. ఆ సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం ఉంది. నవరత్నాల్లో ఒకటైన పచ్చరాయితో చెక్కబడిన లింగం ఇది. కాకతీయ సామంతరాజుల కాలంలో ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పానగల్ ఉంది.

చెరువుగట్టు
శ్రీరాముడు ప్రతిష్టించిన చిట్టచివరి లింగమే చెరువుగట్టు రామలింగేశ్వరుడిగా చెప్పుకుంటారు. నల్గొండ పట్టణానికి సమీపంలో నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. శివరాత్రి రోజు ఇక్కడ భక్తులు అగ్నిగుండాలు తొక్కడం ప్రత్యేకం.

కాళేశ్వరం
జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న ఈ శైవక్షేత్రం ఇప్పుడు తెలంగాణ మొత్తానికి సుపరిచితం. ఇక్కడ యముడికి ప్రత్యక్షమైనందున శివుడిని కాళేశ్వరుడు అంటారు. కాళేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ముక్తేశ్వరుడిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న లింగానికి రెండు రంధ్రాలుంటాయి. ఆ రంధ్రాల్లో నీళ్లు పోస్తే ఒక ధార గోదావరి, మరొకటి ప్రాణహిత సంగమంలో కలుస్తాయని నమ్మకం.

వేయి స్తంభాల గుడి
వరంగల్ జిల్లా, హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి. 12 వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడు. వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉన్నారు.

కీసర
హైదరాబాద్కు అతి దగ్గరో ఉన్న, ఎక్కువమంది వెళ్లే శైవక్షేత్రం ఇది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. పూజ చేసుకోడానికి వారణాసి నుంచి లింగం తీసుకురమ్మని రాముడు ఆంజనేయుడిని పురమాయిస్తాడు. తీరా వారణాసి వెళ్లిన ఆంజనేయుడు.. అక్కడ ఉన్న 101 లింగాలను చూసి.. ఏ లింగం తీసుకెళ్లాలో తెలియక 101 లింగాలను తీసుకెళ్తాడట. అప్పటికీ ఆలస్యం కావడంతో శివుడే ప్రత్యక్షమై రాముడికి లింగం ప్రసాదించాడని స్థలపురాణం చెబుతుంది. తాను తెచ్చిన లింగాలకు పూజ చేయలేదని ఆగ్రహించిన హనుమంతుడు లింగాలను విసిరి పారేశాడట. అందుకే.. కీసరలో ఎక్కడ చూసినా.. లింగాలే కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications













