రాజుల చరిత్రకు అలనాటి రాతినిర్మాణాలు నిలువెత్తు సాక్ష్యాలుగా నేడు పలకరిస్తాయి. కొన్ని అబ్బురపరచే నిర్మాణ శైలితో ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని అంతుచిక్కని రహస్యాలతో ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి రహస్యం నిండిన ఓ బావి గురించి. కాలుష్యపు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న నేటి పర్యావరణ ప్రపంచంలో స్వచ్ఛతపు మారుపేరుగా నిలుస్తూ.. శతాబ్దాలుగా తన సేవలను కొనసాగిస్తోన్న దూద్‌బావి చరిత్రను ఒక్కసారి స్పృషిద్దాం రండి!
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మొలంగూర్‌లో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో కోటను నిర్మించారు. ఆ కోట ప్రవేశద్వారం ఎదురుగా పూర్తి రాతితో ఓ బావిని ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు దూద్ బావిగా పిలుస్తోన్న ఆ బావి నీటి గురించిన అంతుచిక్కని రహస్యం ఆ ప్రాంతానికి మంచి గుర్తింపునిచ్చేలా చేస్తోంది. ఆ బావిలోని నీరు పాల మాదిరిగా తెల్లగా కనిపిస్తాయి. ఇందుకు గల కారణం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికీ చరిత్రకారులతోపాటు స్థానిక ప్రజలు ఆ దూద్‌బావిలో నీరు తెల్లగా పాల మాదిరిగా ఉండటానికి కారణమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు.
పర్యాటకంగా గుర్తింపు కోసం..
శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో ఉన్న ఈ దూద్‌బావి నీటి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. బావిలో నీరు తెల్లగా ఉండడం వల్ల దీని స్వచ్ఛతపై ఎవ్వరికైనా అనుమానం రావచ్చు. అయితే, ఇక్కడ అడుగు మొదలుపై భాగం వరకు రాతి కట్టడంతో ఉంటుంది. ఈ దూద్‌బావి నీటిలో ఒక నాణెం వేస్తే.. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ బావిలోని నీటి పారదర్శకతకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది చెప్పండి.

అంతేకాదు, ఈ బావి నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలైనా దూరమైపోతాయని ఇక్కడి చుట్టుపక్కల ప్రజలు విశ్వాసం. అలాగే, ఇటీవల బావి గురించి పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండడంతో దీనిని చూసేందుకు దూర ప్రాంతాలనుంచి సైతం ఔత్సాహికులు బావిని చూసేందుకు ఇక్కడకు చేరుకుంటున్నారు. ఇటీవల కాలంలో మొలంగూరు కోట, దూద్‌బావి పరిసరాలను పర్యాటకంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. అలాగే, మెులంగూరు ప్రజలు దూద్ బావి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
అధికారుల నీటి పరీక్షల్లో ఏం తేలింది..
బావి నిర్మాణంతోపాటు వినియోగానికి కూడా చారిత్రక నేపథ్యం ఉండడం విశేషం. ఈ బావి పాలు, నీళ్లు కలిపిన రీతిలో తెల్లగా ఉండడంతో ఈ నీటిని నిజాం నవాబు తాగునీటి అవసరాల వినియెగించేవారట. ఈ నీటి కోసం గుర్రాలను పంపి, వాటి సాయంతో ఇక్కడి నుంచి నీటిని తెప్పించుకునే వారని ప్రచారంలో ఉంది. అంతేకాదు, బావిలో ఊటనీరు చేరుకోగానే తోడుకుని వెళ్ళేందుకు వీలుగా ప్రజలు రాత్రికే అక్కడకు చేరుకుని తెల్లవార్లు ఆ బావి వద్దే గడపడం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది.
శతాబ్దాల చరిత్ర కలిగిన దూద్‌బావి నీటిని వినియోగించడంపై పలు అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ నీటి స్వచ్ఛతను, విశిష్టతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో అధికారులు పరీక్షలు జరిపారు. అలాగే, మార్కెట్‌లో బాటిళ్లు, ప్యాకెట్ల రూపంలో లభించే నీటితో పోల్చితే ప్రకృతి సిద్ధమైన దూద్‌బావి నీరు ఎంతో స్వచ్ఛమైనదని భూగర్భ జలశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది.



Click it and Unblock the Notifications













