తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలసింది గొంతెమ్మగుట్ట..ఈ ప్రదేశం పురాణాలకు పుట్టినిళ్లుగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో పర్యాటకులు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ చారిత్రక తెలియజేసే ప్రదేశాలు ఎన్నో. గొంతెమ్మ గుట్టలో కాకతీయుల కాలం నాటి రాతికట్టడాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఈ గొంతెమ్మ గుట్టకు అనేక పురాణ కథలు ఉన్నాయి. పచ్చని ప్రకృతిలో సేదతీరాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రాంతానికి రావాల్సిందే. ఈ ప్రదేశపు సంగతులు చూసేద్దాం పదండి..
ఈ గొంతెమ్మ గుట్ట అందమైన అడవిలో విస్తరింపజేసింది. ప్రకృతిలో సేద తీరాలనుకునేవారు తప్పకుండా ఈ గుట్టకు రావాల్సిందే. ఈ గుట్ట ఎత్తు సుమారు 250 మీటర్లు ఉంటుంది. గుట్ట మీద నుంచి కిందకు ప్రవహించే జలపాతాలు, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ గుట్టపై నుంచి చూస్తే దూరంగా ఉన్న గోదావరి మరింత అందంతో పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఈ గుట్టపై కోటలు, అపురూపమైన రాతి కట్టడాలు ఎన్నో ఉన్నాయి.

ద్వాపరయుగం నాటి గుట్ట..
ఈ గొంతెమ్మగుట్టకు ద్వాపరయుగానికి సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది. శ్రీ కృష్ణుడు, కుంతీదేవి, సుభద్ర కొంతకాలం ఈ ప్రాంతంలో ఉన్నారని, ఆ సమయంలోనే కుంతీదేవి ఇక్కడ తపస్సు చేసిందని ఇక్కడివారు చెబుతుంటారు. ఆ చరిత్రకు గుర్తుగా ఈ గుట్టపై ఒక గుహ కూడా ఉంది. ఆ గుహలో ఒక శివలింగం కూడా ఉంది. ఆ శివలింగాన్నే కుంతీదేవి పూజించి, వరాలు పొందిందని ఇక్కడివారు చెబుతుంటారు. ఈ శివలింగానికి దగ్గర్లోనే పాద ముద్రల గుర్తులు కూడా ఉన్నాయి. వీటిని శ్రీకృష్ణుడి పాద ముద్రలుగా భావించి ఇక్కడివారు పూజలు చేస్తుంటారు.
14వ శతాబ్దం నాటి గుట్ట...
ఈ గుట్ట14వ శతాబ్దం నాటిదని చరిత్ర చెబుతోంది. ఈ గుట్టపై ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మూడు అంచెలుగా కట్టిన గోడ ఒకటి ఉంది. ఈ గోడ కాకతీయుల ప్రభువైన ప్రతాపరుద్రుడి కాలం నాటిదని చెబుతుంటారు. మొఘల్ సైన్యం నుంచి ప్రతారుద్రుడు తనను, తన సైన్యాన్ని కాపాడుకోవడానికి ఈ గుట్టపై కొంతకాలం నివసించాడని చరిత్ర చెబుతోంది. ఈ గోడకు కొన్ని బురుజులు కూడా ఉన్నాయి.
ఈ బురుజుల్లో సైనికులు ఉండి దూరం నుంచి వచ్చే శత్రువులను గమనించేవాళ్లని అంటుంటారు. ఇక్కడ ఒక డ్యామ్ కూడా ఉంది. సైనికుల నీటి అవసరాలకోసం ఒకటవ కోటకు, రెండో కోటకు మధ్య నీటిని నిల్వచేసుకునేందుకు దీనిని ఏర్పాటు చేసిట్లు సమాచారం. కొండల మీద నుంచి ప్రవహించే నీళ్లు ఇక్కడ నిల్వ ఉంటాయి. ప్రతి ఏటా ఇక్కడ లక్ష్మీదేవర పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ పండుగలో శివస్తుతులు చదువుతూ, భక్తులు వారి మొక్కులను చెల్లించుకుంటారు.
ఎలా వెళ్లాలి...!
గొంతెమ్మ గుట్టను చేరుకోవాలంటే ముందుగా హైదరాబాద్ చేరుకోవాలి. హైదరాబాద్ నగరానికి బస్సులు, ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి బస్సులో వెళ్లొచ్చు. అక్కడి నుంచి సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కాటారం వస్తుంది. ఆ తర్వాత ప్రతాపగిరి గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతాపగిరి నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే గొంతెమ్మ గుట్టకు చేరుకోవచ్చు. ఈ ప్రదేశంలో నిత్యం ఆటోలు అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications













