పర్యాటకులకు తెలంగాణ టూరిజం ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సెప్టెంబర్ నెలలో అన్ని హరిత హోటళ్లలో 50 శాతం డిస్కౌంట్ పర్యాటకుల కోసం ప్రకటించింది. ఈ ఆఫర్లు కేవలం పబ్లిక్ హాలిడేస్ మినహా, సోమవారం నుండి గురువారం వరకు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయని తెలంగాణ టూరిజం వెల్లడించింది.
రాష్ట్రంలో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని హరిత హోటళ్లలో పైలట్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును తీసుకరానున్నట్లు అధికారులు వివరించారు. ఇక, ఈ ఆఫర్ సెప్టెంబర్ నుంచి మాత్రమే అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 27న జరుపుకునే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ డిస్కౌంట్ ఆఫర్ తీసుకొచ్చినట్లు పర్యాటకశాఖ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 25 హరిత హోటళ్లు, రిసార్ట్‌లు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ప్రసిద్ధ దేవాలయాలు,ఆనకట్టలు, రిజర్వాయర్‌ల సమీపంలో ఈ హోటళ్లు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.

లేక్ వ్యూ రిసార్ట్స్...
అలా ఉన్న ప్రాంతాలలో రామప్ప చెరువు ఒకటి. ఓవైపు పచ్చని చెట్లతో ఎత్తైన కొండలతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ అందాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునేవారు తప్పకుండా తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ భారీ ఆఫర్ వినియోగించుకోవాల్సిందే. ఈ పచ్చని ప్రకృతి అందాలు రాష్ట్రంలోని ములుగు జిల్లా రామప్ప సరస్సు ఒడ్డున్నే ఉన్నాయి. ఇక్కడ లేక్ వ్యూ రిసార్ట్స్ పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రామప్ప చెరువుతో పాటు పర్యాటకులు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. రామప్ప దేవాలయం, ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, పాండవులగుట్ట. ఘన్‌పూర్ దేవాలయాలు, రామప్ప సరస్సు, లక్నవరం వంటి ప్రాంతాలను వీక్షించొచ్చు. ఇందులో పర్యాటకుల సౌకర్యార్థం ఏసీ, నాన్ ఏసీ గదుల సదుపాయం కూడా ఉంది. ఈ రిసార్ట్స్‌లో ఒక్క రెస్టారెంట్ కూడా ఉంది.

వీటి ధరలు..
ఈ రిసార్ట్స్‌లోని ధరల వివరాలిలా ఉన్నాయి. ఏసీ డీలక్స్ కొత్త గదులు బుక్ చేసుకోవాలనుకునేవారు రూ.1500 చెల్లించాలి. ఇదే వీకెండ్‌లో అయితే మాత్రం రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. పాత ఏసీ గదులు బుక్ చేసుకోవాలనుకునేవారు రూ.1300 కట్టాల్సి ఉంటుంది. అదే వారాంతంలో అయితే రూ.1500 కట్టాలి. ఇక నాన్ ఏసీ గదులు పాతవి అయితే రూ. 900 అందుబాటులో ఉంటాయి. అదే వీకెండ్‌లో అయితే మాత్రం రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఈ రిసార్ట్స్‌ను బుక్ చేసుకోవాలనుకునే పర్యాటకులు గానీ లేదా ఇతర పూర్తి సమాచారం కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.

చేరుకోవడం ఎలా..?
ఈ రామప్ప రిసార్ట్స్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ట్రైన్ మార్గంలో వచ్చి అక్కడి నుంచి బస్సు జర్నీ చేయొచ్చు. ములుగు జిల్లా వరకు బస్సులో ప్రయాణిస్తే.. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఇక, కారులో రావాలనుకునేవారు మాత్రం హనుమకొండ ములుగు రోడ్డు నుంచి ప్రయాణం చేయొచ్చు.



Click it and Unblock the Notifications













