భాగ్యనగరవాసులకు తెలంగాణ టూరిజం శాఖ ఓ సరికొత్త ప్యాకేజీని పరిచయం చేసింది. హైదరాబాద్ నుంచి షిర్డీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీని అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ఆధ్యాత్మికచింతనతోపాటు చారిత్రక నిర్మాణాలను ఒకే టూర్‌లో చూడాలనుకునేవారికి ఇది ఆఫర్ అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎల్లోరా అందాలు చూపరులను మరింత మంత్రముగ్ధులను చేస్తాయి. మరి తెలంగాణ టూరిజం వారు ప్రకటించిన ఆ ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకుందామా?!
తెలంగాణ టూరిజం శాఖ షిర్డీ, ఎల్లోరాకు నాలుగు రోజుల టూర్‌ను కేవలం 3 వేల 500 రూపాయలకే అందిస్తోంది. Shirdi Ellora Tour - Telangana Tourism పేరుతో తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీలో మొత్తం 4 రోజుల పాటు టూర్ కొనసాగుతుంది. ఈ షిర్డీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది.
ప్రతి బుధ, శుక్రవారం తేదీల్లో ఈ ప్యాకేజీలో టికెట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ముందుగా హైదరాబాద్‌లోని మనం ఎంపిక చేసుకున్న పికప్ పాయింట్ నుంచి మధ్యాహ్నం జర్నీ మొదలుపెట్టాలి. దిల్‌సుక్‌నగర్, బషీరాబాగ్, బేగంపేట్‌తోపాటు బోర్డీంగ్‌పాయింట్‌లు ఉన్న ప్రాంతాలను తెలంగాణ టూరిజం శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మనసుదోచే ఎల్లోరా అందాలు..
హైదరాబాద్‌లో మధ్యాహ్నం 30 మంది కూర్చునే కెపాసిటీ ఉండే ఏసీ బస్సులో బయలుదేరి మరుసటిరోజు ఉదయం షిర్డీకి చేరుకుంటారు. అదే రోజు శనిశిగ్నాపూరం, షిర్డీ దర్శనం ఉంటుంది. ఈ సందర్భంగా అక్కడి ఆధ్యాత్మిక క్షణాలను పదిలపరుచుకునేందుకు కెమేరాను తీసుకువెళ్లడం అస్సలు మర్చిపోవద్దు. అదే రోజు ఈ రెండు ప్రాంతాల సందర్శన పూర్తవుతుంది. ఆ రోజు రాత్రికి షిర్డీలోనే బస చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు ముందుగానే చూసుకుంటారు.
మరుసటి రోజు ఉదయం షిర్డీ నుంచి బయలుదేరి ఎల్లోరా అందాలను చూసేందుకు బయలుదేరాల్సి ఉంటుంది. దారి మధ్యలో ఔరంగాబాద్‌లోని మినీ తాజ్ మహల్‌ను కూడా చూసే అవకాశం ఉంటుంది. చారిత్రక ఎల్లోరా శిల్ప సంపదను వీక్షించేందుకు రెండు కళ్లూ సరిపోవంటే నమ్మండి. అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు సలాం కొట్టాల్సిందే. ఎల్లోరా అందాలను ఆస్వాదించిన తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు ఉదయం హైదరాబాద్ చేరుకోవడంతో షిర్డీ, ఎల్లోరా టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరల వివరాలు ఇలా..
మనం జర్నీ చేయాల్సింది ఏసీ, నాన్ ఏసీ కోచ్ అనేది మనం ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ నిర్ణయం ఆధారంగా ప్యాకేజీ ధరలు ఉంటాయి. ఏసీ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు పెద్దలకు రూ. 3550, పిల్లలకు రూ. 2890 చెల్లించాల్సి ఉంటుంది.
నాన్ ఏసీ కోచ్‌లో అయితే పెద్దలకు రూ.3100, పిల్లలకు రూ.2530గా ధర నిర్ణయించారు. మరిన్ని వివరాలకు +91-1800-425-46464 నెంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే, ఈ ప్యాకేజీలో టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు నేరుగా https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శిస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications













