రాఖీ పౌర్ణమి రోజున ఆలయాలు కిటకిటలాడుతూ కనిపిస్తాయి. అన్నాచెళ్లెల్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రోజు కోసం చాలామంది ఏడాది మొత్తం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే, ఎన్నో ఆచారాలకు నిలయమైన మన దేశంలో రాఖీ పౌర్ణమి నాడు మాత్రమే పూజలందుకునే ఆలయం ఒకటి ఉంది. మిగతా రోజుల్లో ఈ ఆలయ తలుపులు మూసుకుని ఉంటాయంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటి వింతైన ఆలయం వెనుక దాగిన విస్తుపోయే వాస్తవాలను తెసుకునే ప్రయత్నం చేయాలంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందే!
ఉత్తరాఖండ్‌లోనిని బన్షీ నారాయణ ఆలయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది హిమాలయాల్లో ఉన్న పురాతన ఆలయం. ఇది వార్తల్లోకి ఎక్కడం తొలిసారి కాదు. ఏటా రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు బన్షీ నారాయణ ఆలయం గురించి పెద్ద చర్చ జరుగుతుంది. తర్వాత ఈ ఆలయం గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోరు. ఎందుకంటే, ఏడాదిలో ఒక్క రాఖీ పౌర్ణమి రోజున మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరుస్తారు.
అది కూడా కొన్ని గంటలు మాత్రమే! ఆ సమయంలోనే స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. నిజానికి, ప్రతి ఆలయానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ప్రతి రోజూ పూజలతో శోభిళ్లుతూ ఉంటే.. మరికొన్ని నెలకొకసారి మాత్రమే పూజలను అందుకుంటాయి. కానీ, ఇలా ఏడాది ఒక్కరోజు.. అది కూడా రాఖీ పౌర్ణమి నాడు మాత్రమే పూజలు అందుకునే బన్షీ ఆలయం గురించి విన్నవారెవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే మరి.

మహిళా భక్తులు రాఖీ కడతారు..
ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉన్న ఈ బన్షీ నారాయణ ఆలయంలో రక్షాబంధన్ రోజున పూజలు నిర్వహిస్తే ఎంతో పుణ్యం వస్తుందని, మనసులో కోరుకున్న కోరికలు వెంటనే నెలవేరుతాయని భక్తులు విస్వాసం. అందుకే ఈ రోజు కోసం ఏడాది మొత్తం ఎదురు చూస్తారు. రక్షాబంధన్ రోజున బన్షీ నారాయునుడిని దర్శించుకుని, స్వామివారికి ఇక్కడికి వచ్చే మహిళా భక్తులు రాఖీ కడతారు. అలా రాఖీ రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11:55 నిముషాల వరకూ నిర్విరామంగా పూజలు నిర్వహించి, ఈ ఆలయంలో దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఆలయ తలుపులు మూసివేయబడతాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయ ఆచారానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో వాస్తవం ఎంత ఉన్నప్పటికీ.. నేటికీ ఆ ఆచారాన్ని కొనసాగించడంతో ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఎలా ఆలయానికి వెళ్లాలంటే..
బన్షీ నారాయణ ఆలయం ఉత్తరాఖండ్‌లోని ఉర్గాం ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రక్షాబంధన్ తర్వాత కూడా ఈ ఆలయాన్ని చూసేందుకు భక్తులు వస్తుంటారు. అయితే, ఆలయ ప్రవేశం ఇతర సమయాల్లో ఉండదు. అంతేకాదు, ఇక్కడికి చేరుకునేందుకు కొన్ని కిలోమీటర్లు నడవాల్సి ఉంది. రైలులో వెళ్లదలిచే సందర్శకులు హరిద్వార్ రిషికేశ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. రిషికేశ్ నుండి జోషిమఠం లోయ వరకు దూరం దాదాపు 225 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉర్గాం గ్రామం నుంచి కొన్ని కిలోమీటర్లు కాలినడకన వెళ్లడం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













