ఆహ్లాదకరమైన పర్యాటకానికి ఆరోగ్యకరమైన పర్యావరణం ఎంతో అవసరం. భవిష్యత్తు తరాలకు అలాంటి ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉంది. ప్రకృతిని ప్రేమించేవారు ఆ జాబితాలో మొదటి వరుసలో ఉంటారు. క్షణం తీరిక లేకుండా ఒత్తిడితో సహవాసం చేసే సగటు నగరజీవులకు ఈ పర్యావరణ రక్షణ పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని మనదేశంలోని ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశాలను పలకరిద్దాం..

స్నో వ్యాలీ, కాశ్మీర్
కాశ్మీర్ లోయ అని కూడా పిలువబడే మంచు లోయ జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ఉత్తర భాగంలో ఉంటుంది. ఇది ప్రకృతి అందాలతో నిండిన ప్రదేశం. ఈ ప్రాంతం సహజంగానే ఓ అద్బుతమైన ప్లేస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ స్నోవ్యాలీ చేసేందుకు ఎంతో అనువైనది. ఇక్కడి కొండలు, పచ్చికభూములు, ఆకాశం, హిమాలయ పర్వతాలు, లోయలు.. ఇలా అన్నీ ప్రకృతి రమణీయంగా మారి స్థానికులతోపాటు ఇక్కడికి వచ్చే టూరిస్టులను కూడా ఆహ్లాదపరుస్తాయి. ఆకర్షణీయమైన హిమలయ పర్వతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుంటాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తప్పకుండా ఈప్రదేశాన్నిసందర్శించాల్సిందే. ప్రకృతిలో సేదతీరాలనుకునేవారికి ఇది ఉత్తమమైన గమ్యస్థానం అని చెప్పుకోవాలి.

లోనార్ సరస్సు, మహారాష్ట్ర
లోనార్ సరస్సు అనేది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం బుల్‌ధానా జిల్లా లోనార్ పట్టణ శివారులో ఉంటుంది. ఇది అందమైన సరస్సు. ఈ సరస్సు గురించి పురాణాల్లో అనేక గాథలు ఉన్నాయి. లోనార్ సరస్సును లోనార్ క్రేటర్ అని కూడా పిలుస్తారు. దీనిని నేషనల్ జియో-హెరిటేజ్ మాన్యుమెంట్ అని కూడా అంటారు. అంతరిక్షంలో నుంచి ఓ భారీ ఉల్క ఇక్కడ భూమిని ఢీకొనడంతో పెద్ద గుంత ఏర్పడింది.
అదే పెద్ద సరస్సుగా మారింది. లోనార్ లేక్ గురించి అతితక్కువ మందికే తెలుసు. ఇది సుమారు 5 లక్షల 70 వేల ఏళ్ల నాటిదని చాలామంది చెబుతుంటారు. ఈ సరస్సు చుట్టూ అందమైన కొండలు గుట్టలు ఉంటాయి. ఇవి ఇక్కడికొచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వీటితో పాటు ఇక్కడ పలు దేవాలయాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం మంచి పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధిచెందింది. ఇది ప్రకృతి ప్రేమికులకు ఎంతో బాగా నచ్చుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.

లోక్‌తక్ సరస్సు, మణిపూర్
ఈ సరస్సు తేలియాడే ద్వీపాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. పై నుంచి చూస్తే లోక్తక్ సరస్సు ద్వీపాల సముదాయంగా కనిపిస్తుంది. కానీ అవేవీ నిజమైన ద్వీపాలు కావు. ఈ సరస్సు మణిపూర్ రాష్ట్రంలో ఉంది. లోక్‌తక్ సరస్సు ఒక మంచినీటి సరస్సు. ఈ సరస్సు సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంటుంది. దీని ఉపరితల వైశాల్యం వర్షాకాలంలో 250 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సుమారు 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అనేక చిన్న చిన్న ద్వీపాలతో ఈ సరస్సు విస్తరించి ఉంటుంది.
ఈ సరస్సు అపారమైన జీవవైవిధ్యానికి, అనేక రకాల మత్స్య, వృక్ష, జంతు జాతులకు నిలయం. ఈ సరస్సులోని ద్వీపాలపై కొన్ని మత్స్యకార కుటుంబాలు నివాసాలు ఏర్పరచుకుని తమ జీవనం సాగిస్తున్నారు. ఇది ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనంగా పేరుగాంచింది. సాయంత్రం వేళ సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి ఆసక్తికరమైన దృశ్యాలను తప్పకుండా చూడాల్సిందే. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇదొక చక్కని ప్రదేశం. ఇక్కడ దేశంలోని మొదటి తేలియాడే స్కూల్ కూడా ఉంది. ఈ సరస్సు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సరస్సును తప్పకుండా వీక్షించాల్సిందే..



Click it and Unblock the Notifications













