ఉత్తరాంధ్రుల ప్రజల కల్పవల్లి పైడితల్లి అమ్మవారు. పండుగలకే పండుగ ఉత్తరాంధ్రుల పెద్దపండుగ సిరిమాను పండుగ. విజయనగరంలో నేడు పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగనుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రుల ఈ పెద్దపండుగను రాష్ట్ర పండగగా ప్రకటించింది. అంతేకాదు, పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వంతో పాటు టీటీడీకూడా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఈ సిరిమానోత్సవం ఇక్కడ ప్రతిఏటా జరుగుతుంది. ఇది ఒక భక్తి పూర్వక సంప్రదాయం అని చెప్పుకోవాలి. ఈ ఉత్సవం వేలాది జనం మధ్య ఎంతో కన్నుల పండువగా జరుగుతుంది. అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తున్నాయి. నేడు జరగబోయే ఈ సిరిమాను సంబరానికి సుమారు అరవై అడుగుల పొడువున్న చింతచెట్టును పదమూడు మంది వడ్రంగులు కలిసి సిరిమానుగా మలిచారు. రండి ఆ సిరిమాను విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
మూడులాంతర్లు వద్ద సిరిమాను..
జిల్లాలోనే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు గత (సెప్టెంబర్) నెల 20వ తేదిన ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ నెల (అక్టోబర్) 10వ తేదిన అర్ధమండల దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే నిన్న (అక్టోబర్ 14 సోమవారం) తొలేళ్ల ఉత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఇక, నేడు (అక్టోబర్ 15 మంగళవారం) సిరిమానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఈ ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు.

ఈ సిరిమాను సంబరానికి సుమారు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ సిరిమాను 55 నుంచి 60 అడుగుల పొడువు ఉంటుంది. ఈ సిరిమాను చివరి భాగంలో ఇరుసు బిగించి ఒక పీటను ఏర్పాటు చేస్తారు. ఆ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమానును వేరొక చివరి రథంపై అమర్చుతారు. సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద జరగుతుంది. పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజా బజారు మీదుగా కోట వరకూ మూడు సార్లు ఈ సిరిమాను తిరుగుతుంది.
ఈ నెల 30వరకు..
ఇక, నేడు జరగబోయే ఈ సిరిమాను సంబరంలో సిరిమాను ముందుండే బెస్తవారివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఉత్సవానికి వచ్చే భక్తుల రద్దీనీ దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇక్కడా రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న తోళ్లేళ్ల ఉత్సవం జరిగింది. నేడు (అక్టోబర్ 15)న సిరిమానోత్సవం జరగనుంది.
అక్టోబర్ 22వ తేదిన తెప్పోత్సవం, అక్టోబర్ 27వ తేదీన కలశజ్యోతుల ఊరేగింపు, అక్టోబర్ 29వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం, అక్టోబర్ 30వ తేదీన వనంగుడిలో చండీహోం, పూర్ణాహుతి జరుగుతుంది. చివరిరోజు (అక్టోబర్ 30)న దీక్ష విరమణతో ఈ సిరిమాను ఉత్సవం ముగుస్తుంది. ఈ సిరిమాను ఉత్సవాన్ని సుమారు మూడు శతాబ్దాల నుంచే నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమయ్యాయి. 260 ఏళ్లగా ఈ ఉత్సవాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఇలవేల్పగా భావించే సిరిమానోత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహించడం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications













