సమ్మర్ హాలీడేస్ వచ్చేసాయ్.. ఇక, ఇప్పుడు పిల్లలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవులు. కాబట్టి చాలామంది సొంత వూళ్లకు లేక విహారయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తుంటారు. మరికొందరేమో ఈ సమ్మర్‌లో కూల్ ప్లేస్‌లకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తుంటారు. మనదేశంలో చల్లని ప్రదేశాలు అనగానే చాలామందికి తమిళనాడులో ప్రసిద్ధిచెందిన హిల్‌స్టేషన్లే గుర్తుకొస్తాయి. ఇక ఇక్కడ హిల్‌స్టేషన్లగానే ఊటీ, కోడైకెనాల్ పర్యాటకుల జాబితాలో ముందు వరుసలో ఉంటాయి. అయితే, ఈ వేసవిలో ఊటీ, కోడైకెనాల్ వెళ్లాలనుకునేవారికి మద్రాసు హైకోర్టు కొన్ని ఆంక్షలు విధించింది.
ఈ రాష్ట్రంలోని ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రాంతాలలో ఊటీ, కొడైకెనాల్ ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి కేవలం దేశీయులే కాకుండా విదేశీయులు కూడా తరలి వస్తుంటారు. విదేశీ సందర్శకులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఆరో స్థానంలో ఉంది. అయితే, ప్రస్తుతం ఇక్కడికి వెళ్లాలంటే మాత్రం 'ఈ-పాస్ విధానం' తప్పనిసరి చేస్తూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ -పాస్ విధానం గురించి తెలుసుకుందాం.

నేటి నుంచి జూన్ 30 వరకు ఈ పాస్ విధానం..
కొండ ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్యను నియంత్రించేందుకు కరోనా సమయంలో అనుసరించిన "ఈ-పాస్" విధానాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిది. దీని ఫలితంగా ఊటీ, కొడైకెనాల్‌లో - నేటి నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. జూన్ 30వ తేదీ వరకు ఈ విధానం కొనసాగనుంది. ఈ- పాస్ విధానాన్ని అమలు చేయాలని నీలగిరి, దిండిగుల్ జిల్లాల కలెక్టర్లను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
తమిళనాడులోని పర్యాటక ప్రాంతాల పర్యావరణ పరిరక్షణ గురించి వేసిన ఓ పిటిషన్‌ను ఇటీవల విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కొండ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వస్తోన్న పర్యాటకుల కారణంగా అనేక ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ-పాస్ విధానం తీసుకురావాలని జస్టిస్ డి భరత చక్రవర్తి, జస్టిస్ ఎన్ సతీశ్ కుమార్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీని ఫలితంగానే ఈ పాస్ విధానాన్ని తీసుకువచ్చారు.

20 వేలకు పైగా వాహనాలు ...
ప్రతి వేసవి సెలవుల్లో ఇక్కడికి 20 వేలకు పైగా వాహనాలు వస్తుంటాయి. అందులో కార్లు- 11,500, వ్యాన్లు- 1,300, బస్సులు- 600, టూ వీలర్లు- 6,500 ఉంటాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో తమిళనాడు సర్కారు తెలిపింది. ఒకే సమయంలో అన్ని వాహనాలు కొండ ప్రాంతాలకు వెళ్లడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని, స్థానిక ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని, పర్యావరణం, జంతువులపై ప్రభావం తీవ్ర ప్రభావం పడుతుందని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే క్రమంలో మద్రాస్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో తమిళనాడు ప్రభుత్వం ఈ-పాస్‌ను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం (మే 6) నుంచి ప్రారంభమైంది. ఇక, ఈ-పాస్ కోసం పర్యాటకులు తమ వివరాలు, వాహనాల నంబరు, వచ్చే రోజు, విడిది చేసే రోజులు, ఉండే చోటు వంటి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ సీజన్‌లో ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారు తప్పకుండా ఈ పాస్ చేసుకోవాల్సిందే..



Click it and Unblock the Notifications














