పర్యాటకుల మనసు దోచేస్తున్న... బొగత జలపాతం..!
తెలంగాణ ప్రాంతం జలపాతాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇక్కడి జలపాతాలు తెల్లటి నురగలు కక్కుతూ పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఎత్తైన కొండల్లో నుంచి.. దట్టమైన అడవుల్లో నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చి ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి జలపాతాలు పర్యాటకులతో నిండిపోతున్నాయి. పచ్చని కొండల నడుమ, తెల్లటి పాలధారలా జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధి చెందిన బొగత జలపాతం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. రండి ఈ జలపాతపు విశేషాలను తెలుసుకుందాం.

చీకులపల్లి ఫాల్స్‌గా పేరు..
ములుగు జిల్లా చీకుపల్లి గ్రామ సమీపంలో ఉంది ఈ బొగత జలపాతం. రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వానలతో తెలంగాణలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఉన్న బొగత జలపాతానికి వరద పోటెత్తింది. జలపాతానికి భారీగా నీరు వస్తుండటంతో జలసవ్వడులను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. ప్రకృతి సోయగాలను తిలకించి మైమరచిపోతున్నారు. బొగతను చీకులపల్లి ఫాల్స్ అని కూడా అంటారు. ఈ జలపాతం తెలంగాణ నయాగార జలపాతంగా కూడా ప్రసిద్ధి చెందింది.

చిన్నచిన్న కొలనులు
జలపాతం చూడగానే ఎవ్వరికైనా మనసు పులకరించిపోతుంది. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే బొగత వద్ద గతంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పర్యాటకులను ఈ జలపాతంలోకి అనుమతించడం లేదు. దీంతో జలపాతపు నీటిలో దిగి ఎంజాయ్ చేద్దామనుకుంటున్న పర్యాటకుల ఆశలపై నీళ్లు చల్లిన్నట్లుంది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే పర్యాటకులు కాస్త నిరాశ చెందుతున్నారు. దీంతో పర్యాటకుల ఆనందం కోసం ప్రత్యేకంగా జలపాతం వద్ద చిన్న నీటి కొలనులను ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. అంతేకాకుండా పిల్లలు జలపాతం వద్ద ఆడుకునేందుకు పిల్లల పార్కులు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. దీంతోపాటు రోప్ వే సైకిల్, పర్యాటకులు కూర్చోవడానికి షేడ్స్ నిర్మించడమే కాకుండా, ఇతర సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచారు.

ఎలా చేరుకోవాలి..
ములుగు జిల్లా అనేక పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధిగా ఉంది. ఈ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. బోగత జలపాతం చేరుకోవాలంటే 163 జాతీయ రహదారి వయా ఏటూరునాగారం మీదుగా చీకుపల్లి గ్రామం వరకు వెళ్లాలి. ఇక్కడికి ప్రత్యేకంగా బస్సులు లేవు. పర్యాటకులు తమ సొంత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ కేంద్రం నుంచి 105 కిలోమీటర్ల దూరంలోని ఏటూరునాగారం చేరుకోవాలి.
ఏటూరునాగారం వై జంక్షన్ నుంచి 25 కిలోమీటర్లు వెళ్తే చికుపల్లీ గ్రామం నుంచి ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది. రైలు మార్గంలో ఇక్కడికి చేరుకునేందుకు వరంగల్ రైల్వేస్టేషన్ అందుబాటులో ఉంది. హైదరాబాద్-న్యూఢిల్లీ, చెన్నై కోల్‌కత్తా మార్గంలో వరంగల్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్‌గా ఉంది. అలాగే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారు ఖమ్మం నుంచి 243 కిలోమీటర్లు , భద్రాచలం నుంచి 123 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే హైదరబాద్ నుంచి అయితే 280 కిలో మీటర్లు ప్రయాణించాలి.



Click it and Unblock the Notifications













