బాహుబలి సినిమాలో చూపించే మాహిష్మతి రాజ్యం జోక్ కాదు..! నిజంగానే ఉంది. ఇదెక్కడో కాదు మన భారతదేశంలోనే ఉంది. సరిగ్గా ఇండియాకి మధ్యభాగంలో గల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మాహిష్మతి రాజ్యం ఉండేది. ఇది కార్తవీర్యార్జునుని రాజధాని. మీరు కార్తవీర్యార్జునుని గురించి తెలుసుకోవాలంటే మహాభారతం చదవాలి. పూర్తిగా చదవలేకపోతే ఇక్కడ క్లిక్ చేసి చదవండి. ప్రస్తుతం మాహిష్మతి ఉన్న ప్రదేశం మహేశ్వర్ గా పిలువబడుతున్నది.
మహేశ్వర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఒక అందమైన పట్టణం. ఈ ప్రదేశం పూర్వ సంస్కృతికి ప్రతిబింబం వంటిది మరియు మహేశ్వర్ పర్యాటక రంగాన్ని పెంచే చేనేత వస్త్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది. మధ్యప్రదేశ్ లో పవిత్ర నర్మదా నది ఒడ్డున ఉంది మహేశ్వర్. మహా శివుడు వెలసిన ప్రాంతం కాబట్టి దీనిని మహేశ్వర్ గా పిలుస్తారు.
మహేశ్వర్ ప్రదేశం ప్రాచీనకాలం నుంచి వేల ప్రజల తీర్థయాత్రా కేంద్రంగా ఉన్నది. దీనిని దర్శించే యాత్రికులు ఒక పవిత్రమైన భావంతో నర్మదా నదిలో స్నానం చేస్తారు మరియు మహేశ్వర్ లో ఉన్న ఆలయాలను దర్శించుతారు. ఇక్కడున్న ఈ ఆలయాలు అన్నీ హోల్కర్ వంశ రాణి రాజమాత అహల్యా దేవి బాయి నిర్మించింది. అంతే గాక మహేశ్వర్ లో కోటలతో పాటుగా భవంతులు, ధర్మసత్రాలు కట్టించింది. నర్మదా నది ఒడ్డున భక్తులు స్నానం చేసేందుకు వీలుగా పీష్వా, ఫాన్సే, అహల్యా ఘాట్లను రాణి అహల్యా ఏర్పాటుచేసింది. ఇక్కడున్న కొన్ని సుప్రసిద్ధ స్థలాలు చూసినట్లయితే ..

అహల్యా కోట
అహల్యా కోట దీనినే హోల్కర్ కోట అని లేదా మహేశ్వర్ కోట అని కూడా పిలుస్తారు. ఈ కోట 18 వ శతాబ్ధం లో నర్మదా నది ఒడ్డున కొండ పై రాణి అహల్యా దేవి కాలంలో నిర్మించారు. ఈ మహేశ్వర్ కోట అప్పటి మాల్వా రాణి, మహారాణి ఆహల్యా బాయి హోల్కర్ యొక్క నివాసంగా ఉండేటిది. ఈ పురాతన కోట లో శివుడి యొక్క అనేక అవతారాలకు అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి. వాస్తు పరంగా భిన్నమైనది మహేశ్వర్ కోట. కోటలోని శిల్పాలు చాలా అందమైనవి. కోటపైకి ఎక్కిచూస్తే నర్మదా నది అందాలను తనివితీరా చూడవచ్చు. నర్మదా నదిలో పడవ షికారు సందర్శకులు చేయవచ్చు.
Photo Courtesy: Arjun Valsaraj

జలేశ్వర్ దేవాలయం
జలేశ్వర్ ఆలయం, మహేశ్వర్ వద్ద ఉన్న పరమశివుడికి అంకితమైన ఒక ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయంలోని దేవతకు 'నీటి యొక్క దేవుడు' గా పూజలు జరుపుతారు. ఈ ఆలయం లోని శివలింగాలు కూడా చాలా కాలం నుంచి పూజలు అందుకుంటున్నాయి. ఈ ఆలయ నిర్మాణకళ మహోన్నత స్తంభాలతో నిస్సందేహంగా ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ దేవాలయం పైన కనిపించే చెక్కడాలు చాలా మనోహరంగా ఉంటాయి.
Photo Courtesy: Nilrocks

కాశీ విశ్వనాధ్ ఆలయం
కాశీ విశ్వనాధ్ ఆలయం, మహేశ్వర్ యొక్క పవిత్ర భూమిలో ఉన్న మరొక ప్రసిద్ధ ఆలయం. ఇది జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాలని భక్తులు పూజించి, ప్రార్థనలు జరిపితే, వారికి ఉన్న అన్ని బాధలు మరియు కష్టాలనుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోని జ్యోతిర్లింగ దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ప్రాచీన కాలం నుండి దేశంలో అత్యధికంగా ఉన్న ఆధ్యాత్మిక నిర్మాణాలలో ఒకటైన ఈ ఆలయాన్ని వందల కొద్ది ప్రజలు ప్రతిరోజూ దర్శిస్తుంటారు.
Photo Courtesy: Jean-Pierre Dalbéra

మహేశ్వర్ ఘాట్స్
నర్మదా నది తీరాన ఉన్న మహేశ్వర్ ఘాట్స్ ఎన్నడూ ఖాళీగా ఉండవు. ఈ నది ఒడ్డున ప్రతిరోజూ అనేకమంది భక్తులు కూర్చుని, గంటల కొద్ది సమయాన్ని గడుపుతుంటారు. భక్తులు ఈ పవిత్రమైన నర్మద నదిలో స్నానం తప్పనిసరిగా చేస్తారు. ఈ ఘాట్స్ అనేక స్మారక చిహ్నాలను వర్ణిస్తున్న కొన్ని అసాధారణ రాతి శిల్పాలను కలిగి ఉన్నాయి. ఈ ఘాట్స్ ఒడ్డున, అనేక శివాలయాలు ఉండటం వలన, ఇక్కడి వాతావరణం భక్తితో నిండి ఉంటుంది.
Photo Courtesy: ECHOES IN THE WONDERLAND

నర్మదా ఘాట్
ఇక్కడ చెప్పబడుతున్న ఘాట్ లలో కెల్ల నర్మదా ఘాట్ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ చెప్పబడుతున్న ఘాట్ లలో కెల్ల ఈ ఘాట్ చాలా ప్రత్యేకమైనది. రాత్రుళ్ళు, గంగ, తను ఆశుభ్రమయ్యానని అనుభూతి చెందినప్పుడల్లా, నల్ల ఆవు రూపంలో వచ్చి ఈ నర్మద నదిలో శుభ్రపరచుకొని వెళుతుందని చెపుతుంటారు. ఇక్కడ పవిత్ర స్నానమాచరించటానికి భక్తులు గుంపులుగుంపులుగా వొస్తుంటారు. ఈ ఘాట్ నుండి నదీదృశ్యం ఉత్కంఠభరితంగా ఉంటుంది.
Photo Courtesy: Telugu Nativepalnet

పండరినాథ్ దేవాలయం
ఈ పండరినాథ్ దేవాలయం మహేశ్వర్ వద్ద ఉన్న ఆలయాలలో కెల్ల ముఖ్యమైన ఆలయం. ఈ ప్రదేశంలో ఉన్న ఇతర ఆలయాలవలే కాకుండా ఈ ఆలయం విష్ణువుకి అంకితం చేయబడినది. పురాణాలలో పండరినాథుని ఆలయం యొక్క శ్రేష్ఠమైన శిల్పకళతో ఉన్న విగ్రహాల గురించి వర్ణించారు. సున్నితమైన చెక్కడం ఉన్న ఆలయ వ్రేలాడే తోరణాలను కూడా చూడవచ్చు. సూక్ష్మమైన చెక్కడంతో ఉన్న అద్భుతమైన కళతో అలంకరించిన దేవాలయ తలుపులను చూడవచ్చు.
Photo Courtesy:Jean-Pierre Dalbéra

ఓన్
వెయ్యేళ్ల క్రితం నిర్మించిన దేవాలయాల సముదాయం ఇక్కడ ఉంది. ఖారాగావ్ కు 18 కి.మీ. దూరంలో ఉంది ఓన్. హిందూ, జైన మతాలకు చెందిన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. దేవాలయాలుపై చెక్కిన శిల్పాలు ఖజురాహో శిల్పాలను పోలి ఉంటాయి. మాళ్వా ప్రాంతాన్ని పాలించిన పర్మారా రాజులు ఈ దేవాలయాలకు ఆర్ధిక తోడ్పాటు అందించారు.
Photo Courtesy:Prasoonpadhye

కస్రావాద్
కస్రావాద్ NH-3 నుండి 17 కి. మీ దూరంలో ఉన్నది. ఇక్కడ విలక్షణమైన నమూనాలతో మరియు ఆకర్షణీయమైన రంగులతో నూలు చీరలు నేస్తారు. ఈ ప్రదేశం కొనుగోళ్లకు పుట్టినిల్లువంటిది. ఇక్కడ శీతాకాలంలో జరిగే రంగులతో నిండి ఉన్న గంగాలేశ్వర్ ఉత్సవాలను చూడటానికి ప్రతి సంవత్సరం వందల కొద్ది యాత్రికులు వస్తుంటారు. ఈ పట్టణం చిన్నది అయినా, ఇక్కడికి పర్యాటకులు విశ్రాంతిగా మరియు ప్రశాంతంగా ఉండటానికి వస్తుంటారు.
Photo Courtesy: Telugu Nativeplanet

హోల్కర్ వంశస్థుల సమాధి
మహేశ్వర్‌కు సమీపంలోని రౌఎరాలో హోల్కర్ వంశ రాజుల సమాధులు ఉన్నాయి. పీష్వా వంశస్థుడైన తొలి పీష్వా బాజీ రావు సమాధి ఇక్కడ ఉంది. ఇందులో ఆయన అస్థికలు ఉంటాయని అంటారు.
Photo Courtesy:Shirish Mulmuley

మాండ్లేశ్వర్
మహేశ్వర్ కు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది మాండ్లేశ్వర్. ఇక్కడ ముస్లిం రాజుల నిర్మించిన రాతి కోట ఉంది. నర్మదా నది ఒడ్డున ఉన్న కొండపై ఈ కోట ఉంది. కోట దగ్గరలో నర్మదా నదిలోకి దిగటానికి 123 మెట్లతో ఘాట్ ఏర్పాటుచేశారు. రెండో హోల్కర్ రాజు అయిన తుకోజి రావు ఇక్కడ ఒక భవంతిని నిర్మించాడు. బ్రిటీష్ వారి కాలమైన 1919-1864 మధ్య నీమర్ ప్రాంత కంట్మోనెంట్ ఇక్కడే ఉంది.
Photo Courtesy:Lenton Sands

మహేశ్వర్ చేరుకోవడం ఎలా??
విమాన మార్గం
ఇండోర్ విమానాశ్రయం, మహేశ్వర్ నుండి 85 కి మీ. దూరంలో ఉన్నది మరియు ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం. విమానాశ్రయం నుండి మహేశ్వర్ కు టాక్సీలు మరియు బస్సుల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. కావున, ప్రయాణికులు విమాన మార్గం ద్వారా రెండు గంటలలోనే ఇండోర్ మరియు మహేశ్వర్ మధ్యన ఉన్న దూరాన్ని పూర్తి చేయవొచ్చు.
రైలు మార్గం
మహేశ్వర్ లో రైల్వే స్టేషన్ లేదు. మహేశ్వర్ కి 66 కి. మీ. దూరంలో ఇండోర్ రైల్వే స్టేషన్ ఉన్నది. అది ఒక ప్రధాన రైల్వే స్టేషన్ అవటం వలన, రైళ్ల రాకపోకలు మరియు కనెక్టివిటీ మార్గం ఉత్తమంగా ఉన్నాయి. ఇండోర్ నుండి మిగిలిన దూరాన్ని టాక్సీలు మరియు బస్సుల ద్వారా చేరుకోవొచ్చు. మహేశ్వర్ కి చేరువలో ఉన్న మరి కొన్ని రైల్వే స్టేషన్ లు బార్వాహ (39 కి.మీ.), ఖాండ్వా (110 కి.మీ.) లు.
రోడ్డు మార్గం
మధ్య ప్రదేశ్ లోని అన్ని ముఖ్య నగరాల నుండి మహేశ్వర్ ను సులభంగా మరియు సౌకర్యవంతంగా చేరుకోవొచ్చు. మహేశ్వర్ లో రోడ్ రవాణా చాలా బాగా నిర్వహిస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో ఉన్న ఏ ఇతర ప్రదేశం నుండైన మహేశ్వర్ ప్రైవేటు మరియు పబ్లిక్ బస్సుల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. టాక్సీల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
Photo Courtesy:Prashanth Sampagar



Click it and Unblock the Notifications














