ఈ సెలవుల్లో విహరించేందుకు.. దేశంలోని బెస్ట్ ప్లేస్‌లు ఇవే..!
ఇది పండుగల సీజన్.. ఇక ఈ నెలలో దీపావళి సంబరాలు మొదలుకానున్నాయి. ఈ పండుగ సందర్భంగా పిల్లలకు ఎలాగో సెలవులు ఉంటాయి. కాబట్టి ఈ సెలవుల్లో సంతోషంగా కుటుంబంతో గడపాలనుకుంటే మాత్రం దేశంలో సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ హాలిడేస్‌లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలనుకుంటే మాత్రం ఇవే బెస్ట్ ప్లేస్‌లు.. మరెందుకాలస్యం ఆ ప్రదేశాలేంటో చూసేయండి..

గోవా
గోవాను ఎప్పుడైనా సందర్శించొచ్చు. ఎందుకంటే ఇక్కడి వాతావరణం ఎప్పడూ అనుకూలంగానే ఉంటుంది. గోవాకు ఏడాది పొడవునా పర్యాటకులు ఉంటారు. నవంబర్ ప్రారంభం నుంచి గోవా సందర్శనకు మంచి సమయం. వర్షాకాలం ముగిసి టూరిస్ట్ సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఇక్కడి ప్రకృతి దృశ్యాలను వీక్షించాల్సిందే.. శీతాకాలానికి ముందు వీచే గాలి ఎంతో ఆహ్లాదభరితంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ గోవా కార్నివాల్, కవాతులు, సంగీతం, నృత్యాలు వంటి కార్యక్రమాలను చూసి ఆనందించొచ్చు.

జైపూర్, రాజస్థాన్
పింక్ సిటీగా పిలువబడే జైపూర్ ఈ సీజన్‌లో సందర్శించేందుకు ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. ఇంకా ఇక్కడ అమెర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, హవా మహల్ వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలను సందర్శించొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏటా నిర్వహించే ఫుష్కర్ ఒంటెల ఫెయిర్‌ను కూడా తిలకించవచ్చు. ఇది రాజస్థాన్ సంస్కృతిని ప్రదర్శించే ముఖ్యమైన కార్యక్రమం. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది.

కులు-మనాలి, హిమాచల్ ప్రదేశ్
నవంబర్ నెల మనాలిని సందర్శించడానికి ఎంతో ఉత్తమమైనది. శరదృతువు ఆకులు గరిష్ట స్థాయికి చేరుకున్నందున కులు , మనాలి పర్యటనకు చలికాలం ముందు సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పాటు యాపిల్ తోటలను కూడా చూడొచ్చు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ రోహ్‌తంగ్ పాస్, సోలాంగ్ వ్యాలీ, హాట్ వాటర్ స్ప్రింగ్స్, బియాస్ నది, భృగు సరస్సు వంటి అనేక ప్రదేశాలు నవంబర్‌లో సందర్శించేందుకు వీలుగా ఉంటాయి.

ఉత్తరప్రదేశ్, వారణాసి
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు భాగంలో ఉన్న వారణాసి ఒక ప్రముఖ పుణ్య క్షేత్రం. నవంబర్ మాసంలో సందర్శించే ప్రదేశాలలో మొదటి స్థానంలో ఈ ప్రాంతం ఉంది. ఇది పవిత్ర గంగా నది ఒడ్డున వెలసింది. ఇక్కడ ఉదయం, సాయంత్రం వేలలో ధూపదీపాలతో గంగమ్మకు హారతిని అందజేస్తుంటారు. దీపావళి పండుగ ఇక్కడ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ దశాశ్వమేధ్ ఘాట్ వద్ద నిర్వహించే గంగా హారతిని అస్సలు మిస్సవ్వకూడదు.
లేహ్-లడఖ్, జమ్మూ కాశ్మీర్
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అత్యంత అందమైన ప్రాంతాలలో ఇది ఒకటి. ఇక్కడి వాతావరణం ఎప్పడూ చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే శీతాకాలానికి ముందు కాలం ఎంతో ఉత్తమమైనది. అందుకే చాలామంది పర్యాటకులు ఈ సీజన్‌లో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు బారులు తీరుతారు. మంచుతో కప్పబడిన పర్వతాలతో ఈ ప్రాంతం అందం మరింత రెట్టింపవుతుంది. ఇక్కడ పాంగోంగ్ వంటి సహజమైన సరస్సులు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు, అడ్వంచర్ ట్రిప్ చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం ఎంతో ఉత్తమమైనది.



Click it and Unblock the Notifications














