జనవరిలో దేశవ్యాప్తంగా అనేక పండుగలు నిర్వహించబడతాయి. వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తారు. ఈ పండుగలను చూడటంలో విభిన్నమైన వినోదం ఉంటుంది. కనుక చాలామంది జనవరిలో సందర్శించవలసిన ప్రదేశాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈసారి జనవరిలో లాంగ్ వీకెండ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లాంగ్ వీకెండ్‌లో తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించొచ్చు.
రణ్ ఉత్సవ్, గుజరాత్
రణ్ ఉత్సవ్ గుజరాత్‌లో జనవరిలో జరిగే అద్భుతమైన పండుగ. ఇది మూడు నెలల పాటు జరుగుతుంది. ఈ పండుగలో పాల్గొనడం ద్వారా గుజరాత్‌లోని రంగుల సంస్కృతిని దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. పండుగలో ప్రదర్శించే గుజరాతీ జానపద నృత్యం, సంగీతం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆహార ప్రియులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదనే చెప్పుకోవాఇ. ఇక్కడికి రావడం ద్వారా గుజరాత్‌లోని రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. పౌర్ణమి సమయంలో ఇక్కడికి ప్లాన్ చేసుకోవడం మంచిది. తెల్లని ఎడారిపై చంద్రకాంతి పడే దృశ్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ అందమైన హస్తకళల కోసం షాపింగ్ కూడా చేయొచ్చు.

ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్, గుజరాత్
ఆకాశంలో చాలా రంగురంగుల గాలిపటాలు చూడటం చాలామందికి ఎంతో ఆనందంగా ఉంటుంది. మకర సక్రాంతి సందర్భంగా గుజరాత్‌లో అంతర్జాతీయ గాలిపటాల ఎగురవేత ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో ప్రపంచం నలుమూలల నుంచి గాలిపటాలు ఎగరవేసే వారు వచ్చి తమ కళను ప్రదర్శిస్తుంటారు. ఈ పండుగ ఉదయం సూర్యోదయం నుండి మొదలై సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో గాలిపటాలు ఎగరేయడమే కాకుండా, వైమానిక విన్యాసాలు, గాలిపటాల తయారీ, గాలిపటం పెయింటింగ్, మరెన్నో వినోదాత్మక పోటీలు కూడా ఉంటాయి.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్, రాజస్థాన్
ప్రతి సంవత్సరం జనవరిలో జైపూర్‌లో సాహిత్య ఉత్సవాన్ని ఏర్పాటుచేస్తారు. ఇందులో ప్రసిద్ధ రచయితలు, వక్తలు పాల్గొంటారు. సాహిత్య ప్రియులు తప్పనిసరిగా ఈ ఉత్సవానికి హాజరు కావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా మంది రచయితల విజయాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

బికనీర్ ఒంటెల పండుగ, రాజస్థాన్
జనవరిలో రాజస్థాన్‌లో బికనీర్ ఒంటెల పండుగను సందర్శించేయొచ్చు. ఇక్కడ ఒంటెలను వివిధ రకాలుగా అలంకరించి, వాటికి రేసులను నిర్వహిస్తారు. వాటి నృత్యాలను కూడా ఇక్కడ చూడొచ్చు. రాజస్థాన్‌లో ఈ ఫెయిర్ ఎంతో ప్రత్యేకమనే చెప్పుకోవాలి. దీంతో పాటు నిప్పుతో విన్యాసాలు చేసే వారిని, రాజస్థానీ జానపద కళాకారుల ప్రదర్శనను కూడా ఇక్కడ చూడొచ్చు.
మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్, తమిళనాడు
మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్ భారతదేశంలోనే అతిపెద్ద సంగీత ఉత్సవంగా పేరుగాంచింది. సంగీతంతో పాటు శాస్త్రీయ నృత్యం మరియు ఇతర కళలను కూడా ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భారతదేశంలోని నలుమూలల నుండి కళాకారులు వస్తారు. వారి ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.

పొంగల్, తమిళనాడు
పొంగల్ అనేది వ్యవసాయానికి సంబంధించిన పండుగ. ఈ పండుగ ద్వారా ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపడం ఆనవాయితీ. ఈ పండుగను తమిళనాడులో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను రంగోలీతో అలంకరించి, వివిధ రకాల వంటకాలను తయారు చేసి నృత్యాలు, పాటలతో పొంగల్‌ను జరుపుకుంటారు. ఈ పండుగను దగ్గరుండి చూడాలంటే మాత్రం తప్పకుండా తమిళనాడుకు వెళ్లాల్సిందే.
అరకు బెలూన్ ఫెస్టివల్, ఆంధ్రప్రదేశ్
అరకు బెలూన్ ఫెస్టివల్‌ను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ నిర్వహిస్తుంది. ఇందులో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ప్రత్యేకం. పర్యాటకలు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ద్వారా ఇక్కడ అందమైన దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ రాత్రిపూట క్యాంపింగ్ చేయొచ్చు, ఇక్కడ కాఫీ తోటల పర్యటన కూడా చేసే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications














