ఆ అయోధ్య రామయ్యను దర్శించికోవాలనుకునే భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికీ రెండు నెలల కిందట ప్రారంభమైన అయోధ్య బాల రామమందిరానికి నిత్యం భక్తులు తండోపతండాలుగా పోటెత్తుతున్న విషయం తెలిసిందే. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆ రాములవారిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు.
ఆ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల స్థానం కూడా మెరుగుగానే ఉన్నప్పటికీ అయోధ్య చేరుకునేందుకు అవసరమైన రవాణా సౌకర్యం విషయంలో ఇబ్బందులు తప్పలేదు. బస్సులు, రైళ్ల ప్యాకేజీలంటూ ఎన్ని ఆఫర్లు వచ్చిన దూరం ఎక్కువగా ఉండడంతో ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయోధ్యకు సులువుగా రెండు గంటల్లో చేరుకోవచ్చనే వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఆ వివరాలు తెలుసుకుందామా?!

నేరుగా అయోధ్యకు విమాన సర్వీస్‌లు..
జీవితంలో ఒక్కసారైనా అయోధ్య దర్శనం చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. పెద్ద వయస్కుల్లో ఈ కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రయాణ దూరాన్ని గుర్తు చేసుకుని తమ ఆశను బయటపెట్టలేరు. అన్ని గంటలు రైలు, బస్సు ప్రయాణం అంటే ఆలోచించాల్సిన విషయమే కదా! అయితే అలాంటి వారు ఎగిరి గంతేసే వార్త ఇది. అయోధ్యను కేవలం రెండు గంటల్లోనే చేరుకునేలా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. అవును మీరు వింటున్నది ముమ్మాటికీ నిజం.
మన రెండు తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులు అయోధ్యకు అందుబాటులోకి రానున్నాయి. ఏఫ్రిల్ 2 నుండు వారంలో మూడు రోజులు (మంగళ, గురు, శనివారాల్లో) విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా ప్రకటించారు. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

స్పందించిన కేంద్ర మంత్రి..
అయోధ్యకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసుల అవసరం ఎంతుందో వివరిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫిబ్రవరి 26న తాను లేఖ రాసినట్టు తెలిపారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సింధియా వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడి, రేపటి నుంచి (ఏప్రిల్ 2 నుంచి) వారంలో మూడు రోజులు (మంగళవారం, గురువారం, శనివారం) విమాన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది.
మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ నుంచి విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అవే రోజుల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీసుల కారణంగా హైదరాబాద్ నుంచి అయోధ్యకు రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. మరి ఇది రామ భక్తులకు నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం.. కుటుంబసమేతంగా విమాన ప్రయాణం ద్వారా ఆ అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి!



Click it and Unblock the Notifications















