అమర్‌నాథ్ యాత్రకు సమీపంలోని ప్రసిద్ధ ప్రదేశాలు..
అమర్‌నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ తీర్థయాత్రలో పాల్గొంటారు. మీరు కూడా ఈ సంవత్సరం ఈ ప్రయాణం చేయబోతున్నట్లయితే, ఇక్కడ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు ఇంకా చాలా ప్రదేశాలు చూసేందుకు ఉన్నాయి. భోలేనాథుని సందర్శనార్థం ఇక్కడ సందర్శనకు అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం పదండి.

పహల్గామ్
కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న "వాలీ ఆఫ్ షెపర్డ్స్" అని పిలువబడే పహల్గామ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమనే చెప్పాలి. కశ్మీర్‌లోని ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం నురుగు, గజగజలాడే మంచు గడ్డలతో నిండి ఉంటుంది. లిడర్ నది ఒడ్డున కూర్చొని అక్కడి పచ్చికభూములు, పచ్చని అడవులు, ఆకాశాన్ని తాకే పర్వతాలు, ఆపిల్ తోటలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ ప్రాంతం. పహల్గామ్‌లో కాశ్మీర్ అందాల అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ చిరాగా లోయ, బేటాబ్ వ్యాలీ, బాబెల్ జలపాతం మొదలైన వాటిని కూడా సందర్శించొచ్చు.

సోనామార్గ్
సోనామార్గ్ ఒక అందమైన హిల్ స్టేషన్. దీనిని అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే సమయంలో చూడొచ్చు. సోనామార్గ్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గందర్బల్ జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. దీనిని "మెడో ఆఫ్ గోల్డ్" అని కూడా అంటారు. సోనామార్గ్ కాశ్మీర్‌ను టిబెట్‌తో కలుపుతూ పురాతన సిల్క్ రోడ్‌లో గేట్‌వేగా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడి మార్కెట్లు ప్రధాన ఆకర్షణ. ఇక్కడి లోయలలో హైకింగ్ చేయొచ్చు.

గంగాబాల్
గంగాబాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు ఉత్తరాన ఉన్న గందర్‌బల్ జిల్లాలో ఉంది. ఇది కాశ్మీర్ లోయ పరిసరాలలో ఉన్న రెండవ ఎత్తైన పర్వత శిఖరం అయిన హరముఖ్ పర్వతం వద్ద ఉంది. గంగాబాల్ ఒక సహజ సరస్సు. ఇది అమర్‌నాథ్‌కు సమీపంలో ఉంది. ఈ సరస్సు రెండున్నర కిలోమీటర్ల పొడవు. ఒక కిలోమీటరు వెడల్పు కలిగి ఉంటుంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన అందాలను తిలకించొచ్చు.
వైష్ణో దేవి ఆలయం
వైష్ణో దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు కూడా అందుబాటులో వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైనా వెళ్లొచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాలా కష్టతరమైంది.

శ్రీనగర్
అమర్‌నాథ్ యాత్ర చివరి దశలో భాగంగా శ్రీనగర్‌ను కూడా సందర్శించొచ్చు. ఇక్కడ దాల్ లేక్, నిషాత్ బాగ్, షాలిమార్ బాగ్, చష్మా-ఎ-షాహి వంటి ప్రసిద్ధ, అందమైన ప్రదేశాలను చూడొచ్చు. జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి ఇది వేసవి రాజధాని. ఇది జీలంనది ఒడ్డున ఉన్న కాశ్మీర్ లోయలో దాల్, అంచర్ సరస్సులలో ఉంది. ఈ నగరం ఉద్యానవనాలు, మంచుతుంపరలుతో సహజవాతావరణం కలిగిఉంటుంది.



Click it and Unblock the Notifications













