చిక్కమగళూరు - ప్రశాంతతతో విశ్రాంతికై ఏకైక విహార స్ధలం

చిక్కమగళూరు పట్టణం  కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలోనే ఉంది. ఈ ప్రాంతంలో అనేక పర్యాటక స్ధలాలున్నాయి. చిక్కమగళూరు పట్టణం రాష్ట్రంలోని పర్వతప్రాంత చిత్తడి భూములైన మల్నాడు ప్రాంతానికి దగ్గరగా ఉన్నది. చిక్కమగళూరు అంటే...‘చిన్న కుమార్తె ఊరు ’ అని అర్ధం చెపుతారు. ఈ పట్టణాన్ని అక్కడి పాలకుడు తన చిన్న కుమార్తెకు కానుకగా ఇచ్చివేశాడని, ఆ కారణంగానే దానిని చిక్కమగళూరు అంటారని చరిత్ర చెపుతోంది. హీరేమగళూరు అంటే పెద్ద కుమార్తె ఊరు. దీని పేరుతో కూడా ఈ జిల్లాలో ఒక ఊరు ఉంది.

చిక్కమగళూరు పట్టణం దాని ప్రాధాన్యత! చిక్కమగళూరు పట్టణం చాలా పురాతనమైంది. దానిని చక్కటి విశ్రాంతి పొందగల ప్రదేశంగా వర్ణిస్తారు. చుట్టుపట్ల అనేక సహజ ప్రకృతి ప్రదేశాలు సుందర దృశ్యాలతో సందర్శకులను అలరిస్తాయి. పల్లపు భూములనుండి మల్నాడు లోని పర్వత ప్రాంతాలవరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలో పెద్ద పెద్ద కాఫీ ఎస్టేట్లు ఉన్నాయి. కనుక దీనిని కర్నాటక రాష్ట్ర కాఫీ రాజధాని అని కూడా అంటారు.

చిక్కమగళూరు పట్టణంలో మహాత్మ గాంధీ పార్క్ పర్యాటకుల ప్రదేశంగా పేరొందింది. పర్యాటకులు ప్రధానంగా దసరా పండుగల సమయంలో జరిగే జానపద కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఆనందించడానికి ఈ స్ధలానికి వస్తారు. ఆ రోజులలో జరిగే వివిధ కార్యక్రమాలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి.

షాపింగ్ చేయాలనుకునేవారు మహాత్మ గాంధీ రోడ్డు లోని దుకాణాలలో చక్కటి కొనుగోళ్ళు చేయవచ్చు. ఇక సాహసాలు చేయాలని కోరేవారు చుట్టుపట్ల ప్రదేశాలను సందర్శించి ఆనందించవచ్చు.    కాంక్రీట్ నగరాలనుండి విముక్తి కోరేవారికి చక్కటి ప్రదేశంచిక్కమగళూరు ప్రాంతం పర్యాటకులకు ఒక స్వర్గాన్ని తలిపిస్తుంది. యాత్రా ప్రదేశాలనుండి కాఫీ తోటలవరకు, అటవీ సంబంధ ప్రదేశాలు, సాహసోపేత క్రీడల ప్రదేశాలు, హిల్ స్టేషన్లు, దేవాలయాలు, జలపాతాలు, వన్యప్రాణుల విహారాలు ఎన్నో మరెన్నో ఆకర్షణలు కలిగి ఒకసారి చూసిన వారికి మరెన్నో సార్లు చూడాలని అనిపిస్తూంటుంది.

మైసూర్ పాలకులు నాల్గవ క్రిష్ణరాజ ఒడయార్ తన విశ్రాంతి కొరకు కెమ్మనగుండి ప్రదేశానికి వచ్చేవారు. ఇది ఒక హిల్ స్టేషన్. రోజ్ గార్డెన్, సుందరమైన జలపాతాలు ఎన్నో ఆకర్షణలు. ఇవి పట్టణానికి అతి కొద్ది దూరంలోనే ఉంటాయి.

చిక్కమగళూరు పట్టణ సమీపంలోనే దట్టమైన అడవులతో కూడిన మరో పచ్చటి ప్రదేశం కుద్రేముఖ్. ఈ ప్రాంతంలో గుర్రపు ముఖ ఆకారంలో ఒక కొండ ఉండటంచే దీనికి కుద్రేముఖ్ అనే పేరువచ్చింది. కుదురే అనగా కన్నడంలో గుర్రం అని, ముఖ్ అనగా ముఖం అని చెపుతారు.

కర్నాటకలో ముల్లాయనగిరి అతి పొడవైన శిఖరం. ఇది బాబా భూదాన్ గిరి కొండలలో ఒక భాగంగా ఉంది. ఈ కొండ శిఖరం 1930 మీటర్ల పొడవుతో ట్రెక్కింగ్ విహారానికి అత్యంత అనువైన ప్రదేశంగా చెప్పబడుతుంది. కొండ శిఖర పైభాగానికి వెళ్ళి అక్కడినుండి ప్రదేశాలను చూస్తే ఎటువంటి వారికైనా సరే ఎంతో ఆనందోత్సాహాలు కలుగుతాయి. ఈ ప్రాంతంలో అనేక జలపాతాలు ...కళాతగిరి జలపాతం లేదా కాళహస్తి జలపాతం నుండి రెండు దశలలో ప్రవహించే హెబ్బె జలపాతం వరకు సందర్శకులను అచ్చెరువొందిస్తాయి.

జలపాతాలైన మాణిక్య ధార జలపాతం, శాంతి జలపాతం, కాదంబి జలపాతాలు కూడా ఈ ప్రాంతంలో సందర్శించవచ్చు. ప్రశాంతతలు గోరే ఆధ్యాత్మిక వ్యక్తులకు చక్కటి ప్రదేశం  శృంగేరి నుండి హొరనాడు మరియు కలాసా వరకు ఆద్యాత్మిక ప్రియులకు ఎన్నో ప్రదేశాలు దర్శనమిస్తాయి. చిక్కమగళూరు పట్టణంనుండి 38 కి.మీ. దూరంలో భధ్ర శాంక్చువరి వీరిని ఎంతో అలరిస్తుంది. గుండె ధైర్యంకలవారు ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే, చిక్కమగళూరు పట్టణమే కాదు పూర్తి జిల్లా అంతా ప్రతి ఒక్కరి అభిరుచులను తీర్చగల విహార స్ధలాలు ఉన్నాయి.

Please Wait while comments are loading...