సామాన్యులకు అందుబాటులో కుటుంబసమేతంగా టూర్ ప్లాన్ చేసుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ సరికొత్త ప్యాకేజీని పరిచయం చేసింది. ఈ ప్యాకేజీతో తక్కువ ఖర్చులో ప్రఖ్యాత ఆలయాన్ని దర్శించుకునే అవకాశం కల్పించింది. సాయి సన్నిధి పేరుతో ప్రవేశపెట్టిన ఈ టూర్‌తో హైదరాబాద్ నుంచి మొదలై షిరిడీ, శనిశింగ్నాపూర్‌లు చుట్టేయవచ్చు. మరీ ముఖ్యంగా కుటుంబంతో టూర్ వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం సాయి సన్నిధి టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దామా?!
శ్రావణ మాసం వచ్చిందంటే షిరిడీలోని సాయిబాబాను దర్శించుకోవాలని చాలామంది కోరుకుంటారు. అందుకు అనుకూలమైన ప్యాకేజీలను వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ సాయి సన్నిధి టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. భాగ్యనగరం కేంద్రంగా టూర్ ఉండడంతో ముందుగా హైదరాబాద్‌నుంచి ప్రారంభమవుతుంది. పర్యాటకులు అజంతా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వారంలో ప్రతి రోజూ అందుబాటులో ఉన్న 17064 నెంబరు గల ఈ రైలు కాచిగూడ నుంచి సాయంత్రం 6:40 గంటలకు జర్నీ మొదలవుతుంది. సాయి సన్నిధి ప్యాకేజీలో భాగంగా రెండు రోజులు రాత్రి ప్రయాణం, మూడో రోజు పగటి పూట కలిపి మొత్తం మూడు రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
అదే రోజు షిరిడీ సాయి దర్శనం..
టూర్ ప్యాకేజీలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు కాచిగూడలో రైలు సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం నాగర్‌సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి షిరిడీలో హోటల్‌కు చేరుకునేందుకు ముందుగానే వాహనాలను సిద్ధం చేసి ఉంచుతారు. ఆ రోజు సాయంత్రంలోగా సాయిబాబా దర్శనం చేసుకుని మళ్లీ తిరుగు ప్రయాణం చేస్తారు. అలా రాత్రి 8:30 గంటల్లోపు నాగర్‌సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ రాత్రి 9:20 గంటలకు ట్రైన్ ఎక్కి, మరునాడు ఉదయం 9:45 గంటలకు కాచిగూడలో అడుగుపెట్టడంతో సాయి సన్నిధి టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర ఎంత అంటే?
ఈ ప్యాకేజీలో మనం ఎంపిక చేసుకునే కేటగిరిని బట్టీ ధరలను నిర్ణయించారు. థర్డ్ ఏసీ(కంఫర్ట్)లో ప్రయాణించాలనుకునేవారు ఒక్కరికి రూ.7,870 చెల్లించారు. ఇక్కడే ఐఆర్‌సీటీసీ మరో ఆఫర్‌ను అందిస్తోంది. ఇద్దరు బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికీ రూ.6,650 లేదా ఒకేసారి ముగ్గురు బుక్ చేసుకుంటే రూ.6,630 చెల్లిస్తే సరిపోతుంది. 5-11 సంవత్సరాల మధ్య ఉండే పిల్లలకు రూ. 5,420గా ధర నిర్ణయించారు. అలాకాకుండా స్టాండర్డ్ క్లాస్(కంఫర్ట్)లో వెళ్లాలనుకుంటే ఒకరికి రూ.6,190, ఒకేసారి ఇద్దరు బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికీ రూ.4,960, ముగ్గురికి రూ.
4,940గా ఆఫర్ ఉంటుంది. ఇక్కడ కూడా 5-11 సంవత్సరాల మధ్య పిల్లలకు రూ.3,740 చెల్లిస్తే సరిపోతుంది. సీజన్ బట్టి ఈ ప్యాకేజీ ధరలలో మార్పులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, ఆలయంలో దర్శన టికెట్లతోపాటు భోజన ఖర్చులు ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలతోపాటు టికెట్ బుకింగ్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR009 లింక్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది. మరెందుకు ఆలస్యం.. వెంటనే కుటుంబసమేతంగా సాయి సన్నిధికి బయలుదేరండి!



Click it and Unblock the Notifications














