సిర్సా  – సిర్సా లోని ధార్మిక ప్రదేశాలు !!

జిల్లా ప్రధాన కేంద్రం సిర్సా పేరే జిల్లాకు కూడా పెట్టారు. ఈ జిల్లా ఉత్తర భారతం లోని చాలా ప్రాఛీనమైన ప్రదేశాల్లో ఒకటిగా భావిస్తారు. సిర్సా గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన వుంది, అయితే దాన్ని అప్పట్లో సైరిశక అని పిలిచేవారు. పాణిని రాసిన అష్టాధ్యాయి లోను, దివ్యవాదన్ లోను కూడా ఈ ప్రాంత ప్రస్తావన వుంది. మహాభారతంలో నకులుడు తన దండ యాత్రలో భాగంగా పశ్చిమాన వున్న సైరిశక ను చేజిక్కించుకున్నట్టు వుంది. క్రీ. పూ.5 వ శతాబ్దం నాటికే సిర్సా సంపన్న నగరంగా ఉండేదని పాణిని పేర్కొన్నాడు.

చరిత్ర

భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలో ఒక జిల్లా అయిన సిర్సా 10 వ నెంబర్ జాతీయ రహదారి పై వు౦ది. 1819 లో ఈ ప్రాంతాన్ని చేజిక్కి౦చుకున్నాక డిల్లీ రాజ్యంలోని వాయువ్య భాగంలో ఒక ప్రాంతమైంది ఈ జిల్లా. మరో సంవత్సరం తరువాత, ఈ వాయువ్య జిల్లాను ఉత్తర, పశ్చిమ జిల్లాలుగా విడదీశారు – దీంతో సిర్సా పడమటి జిల్లాలో భాగంగా మారింది, దీన్ని తరువాత హర్యానా గా వ్యవహరించారు.

సిర్సా లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు

సిర్సా జిల్లా పర్యాటకులకు చాలా అందిస్తుంది. షా మస్తానా గా పిలువబడే ఖేమామల్ స్థాపించిన ధార్మిక బృందం డేరా సచ్చా సౌదా కు సిర్సా ప్రధాన కేంద్రం. ఈ తెగ వారు సమాజ సేవా కార్యక్రమాలు చేస్తారు, ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు (లంగర్), పైగా ప్రజల నుంచి ఎటువంటి చందాలు స్వీకరించరు. మరో ప్రసిద్ధ ధార్మిక సమూహం రాదా స్వామి లకు కూడా ఇదే ప్రధాన కేంద్రం. సిర్సా నగరానికి తూర్పున అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న సికందర్ పూర్ సమీపంలో రాధా స్వామి సత్సంగ్ ఘర్ వుంది. ఈ తెగ నిజానికి పంజాబ్ లోని అమృతసర్ జిల్లాలోని బియాస్ లో వున్న రాధా స్వామి ప్రధాన కేంద్రానికి శాఖ.

సిర్సా లో వున్నప్పుడు కగ్దానా లో వున్న రాం దేవ్ మందిరం కూడా చూడవచ్చు. పేరుకు తగ్గట్టే ఈ గుడి రాజస్థాన్, పాకిస్తాన్ లోని సింద్ తో సహా చాలా ఇతర రాష్ట్రాల్లో దైవపురుషుడిగా కొలిచే బాబా రాందేవ్ కోసం నిర్మించారు.

పేద వారిని, ఆర్తులను ఆదుకున్నందుకు ఆయన్ను దయామయుడిగా కొలుస్తారు, ఆయనకున్న మహిమాన్విత శక్తుల గురించి కూడా కొన్ని కథలు ప్రచారంలో వున్నాయి. రాం నగరియా లో వున్న హనుమాన్ దేవాలయం, చోర్మార్ ఖేరా లో వున్న గురుద్వారా గురు గోవింద్ సింగ్ కూడా చూడతగ్గవి. సిఖ్ గురువు గోవింద్ సింగ్ ఇక్కడ ఒక రాత్రి గడిపాడని చెప్తారు. 13 వ శతాబ్దంలో డేరా బాబా సర్సాయి నాథ్ దేవాలయం సిర్సా లో ఇప్పుడు హిసార్ గేట్ గా పిలువబడే ప్రాంతంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని నాథ సంప్రదాయానికి చెందినా సర్సాయి నాథ్ అనే గురువు నిర్మించారు, ఆయన కూడా తన అనుచరులతో ఇక్కడ పూజలు, యజ్ఞాలు, ధ్యానం చేసారు.

సిర్సా నగరం, దాని పరిసరాలు మనకు ఘగ్గర్ లోయ ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వ౦ గురించి తెలియ చేస్తాయి. భారతీయ పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

సిర్సా వాతావరణం

సిర్సా లో వేసవి, వర్షాకాలం, శీతాకాలం తో కూడిన ఉప ఉష్ణ మండల వాతావరణం వుంటుంది.

సిర్సా ఎలా చేరుకోవాలి ?

సిర్సా కు రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలు వున్నాయి.

Please Wait while comments are loading...