మాల్పే  - మనోహర దృశ్యాల మాల్పే పట్టణం!

మాల్పే పట్టణం ఒక అందమైన బీచ్ పట్టణం. ఇది ఉడుపి దేవాలయాల పట్టణం నుండి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక సహజమైన ఓడరేవు. కర్నాటక సముద్రతీరంలో ఒక ప్రధాన మత్స్య ప్రాంతం. ఈ ప్రాంతం ఉద్యావర నదీ తీరాలలో ఉండటం చేత మనోహరమైన వినోద యాత్రా స్ధలంగా పేరుపడింది.

మాల్పేలో పర్యటన ఎలా? మాల్పే లో ప్రధాన ఆకర్షణ దాని అద్భుత ద్వీప సముదాయం. ఇవి తీరం వెంబడి అగ్నిపర్వతం బద్దలవడంతో ఏర్పడ్డాయి. వీటిలో సెయింట్ మేరీ ద్వీపాలు యుగాల క్రిందట పర్వతం నుండి లావా వెదజల్లబడి చక్కటి రాతి ద్వీపాలుగా ఏర్పడ్డాయి.

భారతదేశంలోని ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలలో మాల్పే కూడా ఒకటి. ఈ ప్రాంతం, భూగర్భ శాస్త్రవేత్తలను అధికంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో ఇతర ఆకర్షణలలో బలరామ మరియు అనంతేశ్వర దేవాలయాలున్నాయి. వీటిలోని ఒక ద్వీపంలో ఒక కోట ఉంది. ఈ కోటను బసవప్ప నాయకర్ నిర్మించాడని చెపుతారు.

మీరు మాల్పే దర్శించాలనుకుంటే, ఒక ఫెర్రీ లేదా బోట్ ద్వారా సెయింట్ మేరీ ద్వీపాలకు వెళ్ళాలి. బంగారు ఇసుక తిన్నెలు, ఆకర్షణీయ బీచ్, కొబ్బరి చెట్లు మొదలైన దృశ్యాలు, ప్రశాంతమైన సరస్సులు కంటికి విందు చేస్తాయి. కెరటాలు బాగా ఎత్తుగా వచ్చినపుడు కూడా తీరం వెంబడి మీరు ఒక బోటు లో సుమారు 10 కిలోమీటర్లవరకు ప్రయాణించవచ్చు. నిలకడగా ఉండే ఈ నీటిలో ముణిగి పోతామన్న భయం లేకుండా చక్కగా ఈతకొట్టవచ్చు.

ఈ ప్రాంతంలో చేపల వేట మాత్రమే కాక, టైల్స్ తయారీ, కొబ్బరి చెట్ల సాగు కూడా మాల్పే ప్రజలకు జీవనోపాధిగా ఉంటాయి. ఈ ప్రాంతం ప్రధానంగా పర్యటనకు అనుకూలమైనది కావడంతో  చాలామంది యాత్రికులను ఆకర్షిస్తుంది. కనుక పర్యాటక పరిశ్రమ బాగా అభివృధ్ధి చెందుతుంది. మాల్పేలో తుళు, కొంకణి, కన్నడ భాషలు మాట్లాడుతారు.

ఇక్కడ అనేక బీచ్ రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులకు వీటిలో అనేక సౌకర్యాలున్నాయి. ఇది ఉడుపి పట్టణానికి సమీపంలో ఉండటం చేత మీరు ఎక్కడ కావాలన్నా బస చేయవచ్చు. ప్యారడైజ్ ఐల్ బీచ్ రిసార్ట్, మాల్పే బీచ్ రిసార్ట్, ఉడుపిలోని పామ్ గ్రోవ్ బీచ్ రిసార్ట్ వంటివి ఈ ప్రాంతంలో కొన్ని మంచి హోటళ్ళు.

Please Wait while comments are loading...