గాజులదిన్నె ఒక ఆయకట్టు. ఇది కర్నూలు జిల్లాలో కలదు. నేను ఎప్పుడో చిన్నగున్నప్పుడు ఈ పాజెక్టు ను చూసాను. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ ప్రాజెక్టు చూడటం నిజంగా ఆనందం కలిగించింది. అప్పటికీ, ఇప్పటికీ ప్రాజెక్టు లో చాలా మార్పులు, చేర్పులు వచ్చాయి. ఇదివరకు ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు వచ్చేవారే కాదు కానీ నేడు చద్ది కట్టుకొని మరీ ఇక్కడే సాయంత్రం వరకు కాలక్షేపం చేస్తున్నారు.
ఎలా వెళ్ళాలి ?
గాజులదిన్నె పాజెక్టు (దీనికి గల మరోపేరు సంజీవయ్య సాగర్) గోనెగొండ్ల మండలం లో కలదు. కర్నూలు నుండి కోడుమూరు మీదుగా ఆదోని రోడ్డు మార్గాన వెళ్ళాలి. సొంత వాహనాలుంటే బెటర్. బైక్, కార్ అయితే సరిపోతుంది. కోడుమూరు నుండి వర్కూర్, వెలుగోడు, కైరవాడి వరకు వెళ్ళాలి.
కైరవాడి నుండి గోనెగొండ్ల వరకు వెళ్లే మార్గంలో ఎడమవైపు నేరేడుపల్లె అనే బోర్డు తో ఒక గ్రామం వస్తుంది. ఆ రస్త వెంబడి అలానే ఒక కోలోమీటర్ దూరం వెళితే గాజులదిన్నె ప్రాజెక్టు కనిపిస్తుంది. కర్నూల్ నుండి గాజులదిన్నె 50 కిలో మీటర్ల దూరం. ప్రాజెక్టు 6 గేట్లకలిగి ఉంటుంది.

గాజులదిన్నె ప్రాజెక్టు
చిత్ర కృప : షఫీ
గాజులదిన్నె ప్రాజెక్టు ఎంట్రెన్స్ అంటే ఎడమవైపు తిరిగే మార్గంలో ముందుగా తుంగభద్ర కుడి కాలువ కనిపిస్తుంది. అది దాటి ముందుకువెళితే ఎపి మోడల్ స్కూల్, చెట్ల పొదలు, కుడివైపు గట్టు మాదిరి కనిపించే ఒక పెద్ద మైదానం కనిపిస్తుంది.
మైదానంలో మేము పిల్లలతో, కుటుంబసభ్యులతో సేదతీరాం. మధ్యాహ్నం ఇంటి నుండి తీసుకొచ్చిన భోజనం - అన్నం, గోంగూరపప్పు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఓపెన్ చేసి తిన్నాం. పక్కనే వేస్తున్న వేడి వేడి బజ్జీలు చూసి నోరూరడంతో అదీ లాగిచ్చేశాం. (మైదానంలో స్థలం లేకపోతే స్కూల్ మైదానం లో వెనకవైపు కూడా చెట్ల నీడలో సేదతీరవచ్చు, భోంచేయవచ్చు) పిల్లలు తినటానికి చెకోడీలు, బజ్జీలు, కారం బురుగులు, కారంచుట్టలు, చల్లని ఐస్ క్రీమ్ లు అందుబాటులో ఉంటాయి. ఈ మైదానంలో మధ్యాహ్నం వరకు చల్లగా చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నాం.

గాజులదిన్నె ప్రాజెక్టు పైన ఎర్రమట్టి మార్గం
చిత్ర కృప : షఫీ
సాయంత్రం 3-4 మధ్యలో మెల్లగా మా కాళ్లకు పనిచెప్పాం. నేను, ఇద్దరు అన్నయ్యలం, పిల్లలు నడుచుతుంటూ ప్రాజెక్టు వరకు మొక్కజొన్న కంకులు తింటూ వెళ్లాం. అమ్మ, నాన్న, వదిన వాళ్ళు కారులో అక్కడి వరకు వచ్చారు. కొంత మంది పర్యాటకులు ప్రాజెక్టు మీద నడుస్తున్నారు. అరె భలేగా ఉందే ! అనుకొని మేము పైకి ఎక్కి నడవాలనుకున్నాం(మా అమ్మ వద్దని వారిస్తున్నా సరే).
మెట్లు ఎక్కి పైకి వెళ్లాం. ఆ మార్గం ఎర్రటి మట్టితో వేశారు. ఆయకట్టు అవతలి వైపు హంద్రీ నది ఉరుకలువేస్తూ కనిపించింది. అంత నీరు వచ్చిన గేట్లు ఇంకా తెరవలేదు. ఇది ఓ రకంగా మంచిదే! ప్రాజెక్టు మధ్య వరకు పోవటానికి వీలుపడింది. పైన కొంత సమయం పిల్లలతో ఫొటో లు దిగాము.

ఉవ్విల్లూగుతున్న హంద్రీ
చిత్ర కృప : షఫీ
ఆరోజు చద్ది పండగ కావడంతో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది. అంతేకాదు గేట్లు తెరవకపోవడంతో ప్రాజెక్టు మధ్యలో ఉన్న రాళ్ళ గుట్టల మధ్య సేదతీరేందుకు వీలుపడింది. మేము మా అమ్మ, నాన్న వారికి సైగలు చేయటంతో వారు అక్కడికి చేరుకున్నారు. మేము మెట్లు దిగి కిందకు దిగాము. గుట్ట మీద కూర్చొని సేదతీరి వెంట తీసుకొచ్చిన కారంబురుగులు తింటూ ఆనందించాము.
కొంత మంది యువకులు నీళ్లు కనపడటంతో ఈత కొట్టడం మొదలుపెట్టారు. మరికొంత మంది గేట్ వద్ద నిల్చొని స్టెంట్ లు చేశారు. అదో సరదా వారికి ! సరదాలలో రకాలంటే ఇవే మరి. ఒకరి తింటూ ఆనందించడం సరదా అయితే, మరి కొందరికీ ఇలాంటి ప్రదేశాలలో వచ్చి స్నేహితులతో ఆనందాన్ని పంచుకోవటం ఇంకో సరదా ! అమ్మా, నాన్న వారు ఉండటంతో ఈత కొట్టడం వీలుపడలేదుగానీ, ఈసారి ఫ్రెండ్స్ తో వస్తే తప్పక ఈత కొడదాంలే అని మనసులో అనుకోని కర్నూలు కు తిరిగి ప్రయాణం అయ్యాము.

ప్రాజెక్టు మధ్యభాగాన రాళ్ళ గుట్టలు
చిత్ర కృప : షఫీ



Click it and Unblock the Notifications














