లెహ్ - వాతావరణం అనూహ్యం !

సింధు నది ఒడ్డున, హిమాలయ, కరకోరం పర్వత శ్రేణుల మధ్య నెలకొని వుంది లెహ్ నగరం. ఈ నగరం అందం దేశం నలుమూలల నుంచి యాత్రికులను ఏడాది పొడవునా ఆకర్షిస్తుంది. 16, 17 శతాబ్దాల నాటి మసీదులు, బౌద్ధారామాలతో నగరంలోని ప్రధాన భాగం నిండి వుంటుంది. మధ్య యుగాల నాటి నిర్మాణ శైలిలో నిర్మించబడి నాంగ్యాల్ వంశ రాజు సేంగ్గే నాంగ్యాల్ నివసించిన ప్రాచీన తొమ్మిది అంతస్తుల ప్రాసాదం ఈ నగరంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.

లెహ్ జనాభాలో ఎక్కువ భాగం బౌద్ధ సన్యాసులు, హిందువులు, లామాలు వుంటారు. శాంతి స్తూపాలు, శంకర్ గోమ్పా లు లాంటి ఎన్నో అధ్యయన కేంద్రాలు ఈ నగరం గొప్పదనాన్ని ఇనుమడింప చేస్తాయి. ఏళ్ళు గడిచే కొద్దీ లెహ్ మధ్య ఆసియా లో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదిగింది – స్వయం ప్రజ్ఞ వున్న వ్యాపారులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది.

షాపింగ్ అంటే ఆసక్తి వున్న వాళ్ళు ఇక్కడ నగలు, శీతాకాలపు ఉన్ని దుస్తులు, చేతితో, యంత్రాలతో చేసిన తివాచీలు లాంటి ఆసక్తికరమైన టిబెట్ కళాకృతులు కొనవచ్చు. మంచుతో కప్పి వుండే హిమాలయ పర్వతాలు ఈ ప్రాంతం అందాన్ని మరింతగా పెంచుతాయి. సాహస ప్రేమికులు లెహ్ లోని వివిధ ప్రాంతాల్లో హిమాలయ పర్వతారోహణ చేస్తూ ఇక్కడి ప్రాకృతిక అందాల్ని ఆస్వాదించవచ్చు.

ముఘలాయిల హయాంలో నిర్మించిన పురాతన చారిత్రిక జామా మసీదు, పెద్ద బుద్ధ విగ్రహం వున్న ‘లడాకీ రాజుల వేసవి విడిది’గా పిలువబడే షె ప్రాసాదం, ఈ ప్రదేశంలోని ఇతర ఆకర్షణలు.

లెహ్ లో వేసవి మార్చ్ నుంచి జూన్ మధ్య నడుస్తుంది – ఈ ప్రాంత సందర్శనకు ఇదే అనువైన సమయంగా భావిస్తారు. ఈ కాలంలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా వుండి గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు వుంటుంది. సగటు పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల మధ్య వుంటుంది.

లెహ్ లో శీతాకాలాలు చాలా కఠినంగా వుంటాయి. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత -28 డిగ్రీల వరకు పడిపోతూ వుంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య ఇక్కడ మంచు కూడా భారీగా కురుస్తుంది. ఈ గడ్డ కట్టే చలి వాతావరణాన్ని ఎదుర్కోడానికి సిద్ధం కాకపొతే మంచు కోతకు గురి కావాల్సి రావచ్చు.

వర్షాకాలంలో ఇక్కడ 90 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదౌతుంది. మార్చ్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఇక్కడి ఉష్ణోగ్రత భరించగలిగే స్థాయిలో వుంటుంది కనుక ఈ ప్రాంత సందర్శనకు ఇదే అనువైన సమయం.

లెహ్ లో వాతావరణం అనూహ్యంగా వుంటుంది కనుక యాత్రికులు తమతో పాటు విండ్ చీటర్లు, ఉన్ని దుస్తులు, దళసరిగా వుండే మేజోళ్ళు, చేతి తొడుగులు, మెడ చుట్టూ కప్పుకునే గుడ్డలు, టోపీలు, ఉన్ని టోపీలు, గాటి బూట్లు లేదా నడక బూట్లు, సన్ స్క్రీన్ లోషన్, లిప్ బామ్, గాగుల్స్ లాంటివి తీసుకు వెళ్ళాలి. యాత్రికులు వీటివల్ల ఇక్కడి కఠీనమైన పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు.

డిల్లీ, జమ్మూ, శ్రీనగర్ ల నుంచి నిత్యం రాను పోను విమానాలు వున్నాయి. డిల్లీ లోని విమానాశ్రయం అన్ని ప్రధాన విమానాశ్రయాల నుంచి అందుబాటులో వుంటుంది. విమానాశ్రయం నుంచి వెయ్యి రూపాయల బాడుగతో లెహ్ కు కార్లో చేరుకోవచ్చు. రైల్లో రావాలనుకుంటే లెహ్ నుంచి 734 కిలోమీటర్ల దూరంలో వున్న జమ్మూ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గర.

ఇవే కాకుండా, రోడ్డు మార్గంలో రావాలనుకునే వారు జమ్మూ కాశ్మీర్ రోడ్డు రవాణా స౦స్థ వారి బస్సుల్లో రావచ్చు. ఈ సంస్థ 734 కిలోమీటర్ల దూరంలో వున్న శ్రీనగర్ నుంచి నిత్యం బస్సులు నడుపుతుంది. హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ వారి బస్సుల్లో కూడా ఇక్కడికి చేరుకోవడం సౌకర్యంగానే వుంటుంది. లెహ్ నుంచి 474 కిలోమీటర్ల దూరంలో వున్న మనాలి నుంచి కూడా యాత్రికులు ఇక్కడికి బస్సుల్లో చేరుకోవచ్చు.

Please Wait while comments are loading...