తొలిసంధ్యలో పక్కన ఏముందో కనిపించనంతగా దట్టంగా కమ్మేసిన మంచు.. అంతలోనే చురుక్కుమనిపించే సూర్యోదయం.. ఉన్నట్టుండి భోరున కురిసే వర్షం.. సాయం సంధ్య సమయానికి ఆహ్లాదాన్ని పంచే చల్ల గాలులు. ఇలా మహేంద్రగిరి జీవవైవిధ్యానికి కేంద్రబిందువనే చెప్పాలి. నెమళ్లు, ఎగిరే ఉడుతలు, రాక్షస తొండలు, ఏనుగులు, మచ్చల జింకలు, మైనాలు వంటి అనేక రకాల అరుదైన జీవజాలానికి ఇది నివాసకేంద్రం.

మహేంద్రగిరి
ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని డియోమలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో ఎత్తైన పర్వతం మహేంద్రగిరి. సముద్రమట్టానికి 4925 అడుగుల ఎత్తులో తూర్పుకనుమల్లో ఉన్న మహేంద్రగిరి ఎక్కేందుకు ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాకిమిడి చేరుకోవాలి. దాదాపు 1200 రకాల జాతులకు చెందిన మొక్కలు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఒడిశా రాష్ట్రంలోని వివిధ పుష్పజాతులకు చెందిన మొక్కల్లో 35 శాతం మొక్కలకు మహేంద్రగిరి ఆవాస కేంద్రమని గుర్తించారు. దాదాపు 300కు పైగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ లభిస్తాయి. అంతరించిపోతున్న అత్యంత అరుదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇప్పటికీ ఈ పర్వతంపైన లభిస్తున్నాయి.

దారంతా పచ్చదనమే
పర్లాకిమిడి నుండి 66 కిలోమీటర్ల ప్రయాణంతో మహేంద్రగిరిని చేరుకోవచ్చు. ఆ దారంతా వంకరలు తిరిగి ప్రమాదకరంగా ఉండే ఘాట్‌రోడ్డు. నేల నుంచి నింగి వరకూ పచ్చదనం పరుచుకుందా అనిపించేంతగా ఎత్తైన కొండలూ, దారి దారిపొడవునా కనిపించే సెలయేర్లు, కొండలమీద నుంచి ఉరికే జలపాతాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. మూడువైపులా ఎత్తైన కొండలు. కనుచూపుమేరలో కొండల్ని కమ్మేసిన మేఘాలు కొత్త అనుభూతినిస్తాయి. మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకునే క్రమంలో చిన్న చిన్న కొండలు తారసపడతాయి. ఏడాది పొడవునా మానవ సంచారమే కనిపించని ఈ ప్రాంతం. మహాశివరాత్రి ముందు రోజు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు కాలినడక తరలివచ్చి, అక్కడి శివలింగాలను దర్శించుకుంటారు.

పురాతన ఆలయాలు
ఈ పర్వతంపై పరశురాముడు తపస్సు చేశాడని చెబుతారు. పర్వతంపైన పరశురాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వనవాసం సమయంలో పాండవులు కొంతకాలం ఇక్కడ జీవించారని, అందుకే ఇక్కడ ఆలయాలు నిర్మించారని చెబుతారు. ప్రస్తుతం కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే మిగిలాయి. మిగతావి శిథిలమయ్యాయి. ఈ ఆలయాలన్నింటిలో శివలింగాలే ఉన్నాయి. 30 అడుగుల ఎత్తులో ఉన్న కుంతీ ఆలయాన్ని అత్యంత అరుదైన రాతికట్టుతో నిర్మించారు. ఆలయం భూమిలోపలికి దిగినట్లు కనిపిస్తుంది. మెట్టు దిగి లోపలికి వెళ్లాలి. ఆలయం వెలుపలి భాగంలో తూర్పున కుమారస్వామి, ఉత్తరాన పార్వతీదేవి, దక్షిణాన విఘ్నేశ్వరుని విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయం ఎదురుగా రెండు పురాతన బావులు ఉన్నాయి. ఎత్తైన కొండమీద వాటిని ఎలా తవ్వారన్న ఆలోచన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కుంతీ మందిరం ఉత్తరదిశలో ధర్మరాజు ఆలయం ఉంది. ఈ పర్వతంపైన ఉన్న ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. ఆలయం పక్క నుండి సెలయేరు పారుతుంది. దాని సవ్వడి వినసొంపుగా ఉంటుంది. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండ శిఖరంపైన భీముడి ఆలయం కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపై ఉన్న అన్ని ఆలయాలలో ఇదే పురాతనమైనది. క్రీ.శ.ఆరో శతాబ్దానికి ముందే ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. పర్వతం చివరన ఒక కొండపైన జగన్నాథ స్వామి ఆలయం ఉంటుంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు.
చుట్టూ చెట్లు, రాళ్లు ఉన్న అత్యంత క్లిష్టమైన మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒడిశాలోని గజపతి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాల్లోని వేల ఎకరాలకు తాగు, సాగునీరును అందించే మహేంద్రతనయ ఈ పర్వతంలోనే పుట్టింది. మహేంద్రగిరి పర్వతంపై ఏడాది పొడవునా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ వర్షపు నీరు కొండపైన అనేక సెలయేర్లుగా, జలపాతాలుగా పారి కిందికి వచ్చేసరికి నది రూపును సంతరించుకుని, రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వైపు సాగి, 70 కిలోమీటర్ల మేర ప్రవహించి గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నదిలో కలిస్తే, మరో పాయ మందసవైపుగా సాగి 40 కి.మీ.మేర ప్రవహించి బారువ వద్ద సముద్రంలో కలుస్తుంది.



Click it and Unblock the Notifications












