
కేరింతలు కొట్టించే వాటర్ పార్క్‌లు ఏపీలోనూ ఉన్నాయండోయ్!
ఈ సంక్రాంతి సెలవుల్లో కుటుంబసమేతంగా సరదాగా విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా? ప్రత్యేకించి మీరు వాటర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడేవారు అయితే, ఆహ్లాదకరమైన రిఫ్రెష్ అనుభవం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని వాటర్ పార్కులు ఆహ్వానం పలుకుతున్నాయి.
పొడవైన వాటర్ స్లయిడ్‌లు, వేవ్ పూల్, రెయిన్ డ్యాన్స్ సహా మరెన్నో ఉత్సాహభరితమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీలోని పేరుగాంచిన ఐదు వాటర్ పార్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమరావతి వాటర్ పార్క్
మానసిక ప్రశాంతత కోరుకునేవారికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది అమరావతి వాటర్ పార్క్.పెందుర్తిలో ఉన్న అమరావతి వాటర్ పార్క్ విశాఖ నగరానికి చేరువలో ఉన్న ముఖ్యమైన విహార విడిది కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి నగరంతో పాటు చుట్టుపక్కల పట్టణాలు మరియు గ్రామాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో ఈ పార్క్ రద్దీగా కనిపిస్తుంది. అమరావతి వాటర్ పార్క్‌కు వెళ్లేందుకు వారం మొత్తంలో ఉదయం 11 నుండి సాయంత్రం 6 వరకు అనుమతి ఉంటుంది.

వైజాగ్ వాటర్ వరల్డ్
రిఫ్రెష్ డే అవుటింగ్ కోసమే దీనిని ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. వైజాగ్ వాటర్‌వరల్డ్ ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద వాటర్ పార్కులలో ఒకటిగా పరిగణించబడుతోంది. రాష్ట్రంలోని సందర్శక ఆదరణ పొందిన ప్రదేశంగా వాటర్ వరల్డ్ తన కార్యకలాపాలను ప్రారంభించిన అనతికాలంలోనే గుర్తింపు పొందింది. ఆకర్షణీయమైన వాటర్ రైడ్‌లతో పాటు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, ప్రథమ చికిత్స సహాయం మరియు స్నాక్స్‌లను కూడా అందిస్తున్నారు నిర్వాహకులు.
స్విమ్మింగ్ పూల్ మరియు వైజాగ్ వాటర్ వరల్డ్ రైడ్‌ల ధరలు పిల్లలకు, పెద్దలకు వేరు వేరుగా ఉంటాయి. ఈ సౌకర్యాల ధర సుమారు రూ. 100 నుంచి రూ. 600 వరకూ ఉంటుంది. వైజాగ్ వాటర్ వరల్డ్‌ను సందర్శించేందుకు వారం మొత్తంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 6 వరకు అనుమతి ఉంటుంది.

వేవ్స్ అమ్యూజ్‌మెంట్ పార్క్
విశాఖపట్నానికి చేరువలో ఉన్న తగరపువలసలో ఉంది వేవ్స్ అమ్యూజ్‌మెంట్ పార్క్. ఆధునిక సౌకర్యాలను ఇక్కడ చూడవచ్చు. ఇందులో మూడు థ్రిల్లింగ్ వాటర్ స్లయిడ్‌లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విధానం సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇది కుటుంబసమేతంగా విహారానికి, మరీ ముఖ్యంగా పిల్లలకు చాలా వినోదభరితంగా ఉంటుంది. పార్క్‌లో ఆరు అడుగుల లోతైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వారం మొత్తంలో ఉదయం 10 నుండి రాత్రి 9:30 వరకు తెరచి ఉంటుంది.

హాయ్‌లాండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్
అద్భుతమైన వాటర్ రైడ్‌లు, ఆహ్లాదకరమైన రెస్టారెంట్లు మరియు ఆయుర్వేద వెల్‌నెస్ సెంటర్‌తో, హాయ్‌ల్యాండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ఆకర్షణీయంగా ఉంటుంది. కుటుంబం మరియు స్నేహితులతో వినోదభరితమైన సమయాన్ని గడపడానికి హాయ్‌లాండ్ కేరాఫ్ అడ్రస్‌గా చెప్పొచ్చు. ఈ పార్క్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని చినకాకాని NRI హాస్పిటల్ సమీపంలో ఉంది. పార్క్ టిక్కెట్ల ధర రూ. 750 వరకూ ఉంటుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ప్రవేశం ఉంటుంది.

హైవే గ్రాండ్ వరల్డ్
హైవే గ్రాండ్ వరల్డ్ చిత్తూరు జిల్లాలోని నగరిలో ఏర్పాటు చేసిన వాటర్ థీమ్ పార్క్. ఈ ఉద్యానవనం అనేక ఆహ్లాదకరమైన నీటి సవారీలను అందిస్తుంది. పెద్దలు మరియు పిల్లలకు సరైన విహార కేంద్రంగా చెప్పొచ్చు. దుస్తులు మార్చుకునే గదులు, ఫలహారశాల, పిల్లల ఆటల విభాగం మరియు విశ్రాంతి గదులు కూడా హైవే గ్రాండ్ వరల్డ్‌లో అందుబాటులో ఉంటాయి. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉంటుంది.