ఒడిశా ఒడిలో దాగిన టిబెట్ సోయగాలు
పచ్చని కొండ కోనల నడుమ భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని కనులారా చూడాలంటే.. దేశ సరిహద్దులను చేరుకోవాలి. అయితే, అంతదూరం వెళ్లడం సాధారణ ప్రజలకు సాధ్యం కాదు. అలాంటి వారి కోసం విశాఖ జిల్లాలో అరకు ఒక ప్రకృతి ప్రసాదిత వేదిక. అయితే దీనికి పోటీపడుతూ ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మహేంద్రగిరి పర్వతావళి పర్యాటకులకు మరో కానుకనే చెప్పాలి. అచ్చం టిబెట్ వాతావరణాన్ని పోలి ఉండే ఇక్కడి వాతావరణం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
అంతేకాదు.. టిబెటన్‌లు నివసించే ఆరు గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. ఇంత చలిలోనూ నిత్యం వేడినీరు ఉబికే తప్తపాని కేంద్రం పర్యాటకులకు మరో అదనపు ఆకర్షణ. ఈ సీజన్‌లో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత రెట్టింపు అవుతాయి. ప్రకృతి సిగలో దాగిన అరుదైన టిబెటెన్ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకోసం..

ఒడిశాలోని పర్లాకిమిడికి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి పర్లాకిమిడి సుమారుగా 60 కిలోమీటర్లు. అక్కడి నుంచి మహేంద్రగిరి కొండల పక్క నుంచి వెళ్తుంటే... నిజంగానే టిబెట్ లోకి వచ్చేశామా! అన్న అనుభూతి కలుగుతుంది. శీతాకాలపు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మా మిత్ర బృందంతో అక్కడికి ప్రయాణమయ్యాం. అసలే చలికాలం... అలా పర్లాకిమిడి దాటామో లేదో చలి విశ్వరూపం చూపించింది. మధ్యమధ్యలో ఆగుతూ, అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ మా జర్నీ కొనసాగించాం. టిబెటన్లు నివసించే చంద్రగిరి చేరుకోగానే... అచ్చం టిబెట్‌లో ఉన్న ఫీలింగే కలిగింది.
అక్కడి కట్టడాలు, ఆలయాలు, వారు నివసించే ఇళ్లు చూస్తుంటే నిజంగానే టిబెట్‌లోకి వచ్చేశామా అనే ఫీలింగ్ కలిగింది. వారి ఇళ్లు కూడా చెక్కలతో నిర్మించుకోవడం విశేషం. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం టిబెట్ నుంచి తాము ఇక్కడికి వచ్చేసామని ఒక మహిళ చెబుతూ ఆ ప్రాంతంలో తమ అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తన కొడుకుతో పాటు, ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లలను మాకు పరిచయం చేసిందామె. అక్కడే కొద్దిసేపు ఉండి, ఆ కుక్కపిల్లలతో ఆడుకున్నాం. తర్వాత బౌద్ధవులకు ఆరాధ్యదైవమైన తథాగతుని ఆలయాన్ని దర్శించుకున్నాం. ప్రశాంతతను చేరువ చేసే అక్కడి వాతావరణం గురించి మాటల్లో చెప్పడం కాస్త కష్టమే.

టిబెట్ శైలీ సంస్కృతి
భారత్‌లోకి 1967లో వలస వచ్చిన టిబెటన్‌లకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారత ప్రభుత్వం ఆవాసాలను కల్పించింది. ఇందులో భాగంగానే ఒడిశాలో కూడా కొండప్రాంతంలో ఆరు గ్రామాలను వారి కోసం కేటాయించింది. అప్పటినుంచి వారు అక్కడే జీవనం సాగిస్తున్నారు. ప్రారంభంలో దాదాపు 2,480 మంది జనాభా ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య మూడు వందలు మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది.
కుటుంబ నియంత్రణ పాటించడం, ఎదిగిన పిల్లలు వివిధ ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం వల్ల గ్రామాల్లో జనాభా తక్కువగానే కనిపిస్తోంది. ఎక్కువగా భారత ఆర్మీలోనే పనిచేస్తున్నట్లు స్థానికులు చెప్పారు. భాష వేరైనా ప్రస్తుతం అక్కడివారు సగం ఒరియా, సగం హిందీ కలిపి మాట్లాడడం గమనించాం. ఈ గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సౌకర్యాలనూ కల్పిస్తున్నాయి. ఇక్కడి పిల్లల కోసం రెండు ప్రాథమిక పాఠశాలలు, నర్సరీ సంస్థలు, చిన్న డిస్పెన్సరీతోపాటు టిబెట్‌లో ప్రత్యేకత కలిగిన ఆయుర్వేదిక వైద్యశాల కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయం చేసుకునేవారికి కావాల్సిన విత్తనాలు, ఇతర అవసరాలకు సహకార సంఘం ఈ గ్రామాలకు ఉండడం విశేషం.
అలాగే ప్రతి గ్రామానికి ఒక సెటిల్మెంట్ అధికారి ఉంటారు. ఆ అధికారిని కేంద్ర హోంశాఖ నియమిస్తుంది. గ్రామస్తుల అవసరాలను స్థానిక రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లడం ద్వారా వాటి పరిష్కారానికి ఈ అధికారులు చర్యలు తీసుకుంటారు. అక్కడి భిన్నమైన జీవనశైలి మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది.

తప్తపాని ప్రత్యేకత
తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉన్న కొన్ని జలపాతాల వద్దకు వెళ్లాం. అక్కడి ప్రకృతి చూడగానే మా శారీరక అలసట మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది. చాలాసేపు జలపాతాల్లో సరదాగా గడిపాం. తిరుగు ప్రయాణంలో తప్తపానికి చేరుకున్నాం. అప్పటికే సాయంత్రం కావడంతో చలిగాలులు కూడా పెరిగిపోయి శరీరాన్ని వణికించడం మొదలెట్టింది. తప్తపానిలోని ఓ ప్రత్యేకత మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్కడి కొలనులో 365 రోజులూ వేడినీరు పొంగుతూనే ఉంటుంది.
భూగర్భంలో ఉన్న కొన్ని రసాయన ఖనిజాల కారణంగానే నీరు వేడిగా ఉంటుందని అక్కడి వారు చెప్పారు. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం. ఈ ప్రాంతం పర్లాకిమిడి కన్నా... బరంపురానికి దగ్గరలో ఉంటుంది. గోరువెచ్చని నీటి సవ్వడులు ఒకింత ఆశ్చర్యంతోపాటు మానసిక ప్రశాంతతను అందించాయి. ఆ స్వచ్చమైన నీరు శరీరానికి తగలగానే మనసుకు ఏదో తెలియని అనుభూతి కలిగింది. కొద్దిసేపు అక్కడే ఉండి, స్నానం చేసి, మళ్లీ బయలుదేరాం.

తుపాను ప్రభావం
అక్కడి నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారింబడికి చేరుకున్నాం. ఇది చాలా ఎత్తయిన ప్రదేశంలో ఉన్న చిన్న గిరిజన గ్రామం. అక్కడ సాధారణ పరిస్థితుల్లో చలి తీవ్రంగా ఉంటుంది. దాదాపుగా అత్యంత శీతల ప్రాంతమైన లంబసింగి మాదిరిగానే జీరో డిగ్రీ ఉష్ణోగ్రత నమోదవుతుందని స్థానికులు చెప్పుకొచ్చారు. అయితే అక్కడే మా బృందానికి దురదృష్టం వెంటాడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో మబ్బులు కమ్ముకోవడంతో చలి కొంతవరకు తగ్గింది.
అయినప్పటికీ 16 డిగ్రీల వరకూ ఉండడంతో ఆ చలిలోనే గ్రామంలో సరదాగా తిరిగాం. ఆ రాత్రికి అక్కడే బస చేసేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే, అంత చలిలో రాత్రిపూట కారు ప్రయాణం బాగుంటుందన్న భావనతో రాత్రి పదకొండు గంటలకే తిరుగు ప్రయాణం ప్రారంభించాం. రాయగడ మీదుగా విజయనగరం నుంచి విశాఖ వెళ్ళాలని భావించాం. రాత్రి సమయంలో నరమానవులు జాడ లేకపోవడంతో గూగుల్‌నే నమ్ముకోవాల్సి వచ్చింది.
దాంతో దారి తప్పి, చిన్న చిన్న ఇరుకు రోడ్లపైకి చేరిపోవడంతో కొంత ఇబ్బందిపడ్డాం. ఎట్టకేలకు ఉదయం ఐదు గంటలకు రాయగడ చేరుకుని కాలకృత్యాల అనంతరం మళ్లీ ప్రయాణం ప్రారంభించాం. ఉదయం పదకొండు గంటలకు విశాఖకు చేరుకున్నాం. కేవలం 24 గంటలే మా పర్యటన జరిగినప్పటికీ, అనేక మధుర జ్ఞాపకాలు మూటగట్టుకున్నాం. మరెందుకు ఆలస్యం! మీరూ.. మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి!!



Click it and Unblock the Notifications












