ట్రిచీ - సాంప్రదాయం, ఆధునికత కలిసే చోటు!

దక్షిణ భారత దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ట్రిచీ లేదా తిరుచిరాపల్లి ఒక పారిశ్రామిక, విద్యా కేంద్రమైన నగరం. ట్రిచీ అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం. ఈ నగరం కావేరి నది ఒడ్డున ఉంది. ఈ నగరం తమిళనాడు లోని నాలుగో అతి పెద్ద పురపాలక సంఘం, పట్టణ కేంద్రం.

ఈ ప్రాంతం పేరు పుట్టుక గురించి చాలా కథనాలు వున్నాయి. సంస్కృతంలో ‘త్రిశిర’ అంటే మూడు తలలు, ‘పల్లి’ లేదా ‘పురం’ అంటే నగరం అని అర్ధం వచ్చే రెండు పదాల కలయిక ‘త్రిశిరాపురం’ నుంచి తిరుచిరాపల్లి పేరు వచ్చింది. మూడు తలల రాక్షసుడు ‘త్రిశిరుడు’ ఇక్కడే శివుడి గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తెలుగు పండితుడు సి.పి.బ్రౌన్ – చిన్న ఊరు అని అర్ధం వచ్చే ‘చిరుత-పల్లి’ అనే పదం నుంచి ఈ పేరు వచ్చిందని భావించాడు. 16 వ శతాబ్దానికి చెందిన రాతి శాసనం ‘పవిత్ర శిలా నగరం’ అని అర్ధం వచ్చే తిరు-శిలా-పల్లి అనే పదం నుంచి తిరుచిరాపల్లి అనే పేరు వచ్చిందని చెప్తోంది. ‘పవిత్రమైన చిన్న పట్టణం అని అర్ధం వచ్చేలా తిరు-చిన్న-పల్లి అనే పదం నుంచి ఈ పేరు వచ్చిందని కొందరు పండితులు అంటారు. మద్రాస్ శబ్దకోశం ప్రకారం శిన మొక్క వున్న పవిత్ర (తిరు) పట్టణం (పల్లి) అని అర్ధం వచ్చే తిరుస్సినప్పల్లి అనే పదం నుంచి ఈ పేరు వచ్చింది.

బ్రిటిష్ హయాంలో తిరుచిరాపల్లి ని త్రిచినోపోలి అనేవారు, దాన్నే సంక్షిప్తంగా ట్రిచీ లేదా తిరుచ్చి అంటున్నారు.

చరిత్ర పుటల నుంచి

తమిళనాడు లో జనావాసాలు ఏర్పడ్డ అతి ప్రాచీన నగరాల్లో ట్రిచీ ఒకటి. గొప్ప సాంస్కృతిక వైభవం వున్న ఈ నగరం ఎన్నో రాజ్యాల ఉత్థాన పతనాలు చూసింది. క్రీ.పూ.2 వ శతాబ్దానికి చెందిన జనావాసాలు కనుగొనబడ్డాయి. మధ్య యుగంలో క్రీ.శ.6 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ రాజు ఒకటో మహే౦ద్రవర్మన్ రాక్ ఫోర్ట్ లో చాలా గుహాలయాలు నిర్మించాడు. పల్లవుల తరువాత మధ్యయుగాల్లో చోళులు తిరుచిని జయించి క్రీ.శ.13 వ శతాబ్దం వరకు పాలించారు. చోళుల పతనం తరువాత, మాలిక్ కాఫుర్ వారిని ఓడించేటప్పుడు 1216 నుంచి 1311 వరకు పాండ్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అటు తరువాత ఈ ప్రాంతాన్ని డిల్లీ, మదురై సుల్తాన్లు 1311 నుంచి 1378 వరకు పాలించారు. సుల్తాన్ల తరువాత విజయనగర సామ్రాజ్యం కూడా ఈ ప్రాంతాన్ని పాలించింది. ట్రిచీని విజయనగర రాజుల తరువాత 1736 వరకు మదురై నాయక రాజులు పాలించారు. మదురై నాయకుల రాణి మీనాక్షి ఆత్మహత్య చేసుకున్నాక ఈ ప్రాంతాన్ని చంద్రా సాహిబ్ 1736 నుంచి 1741 వరకు పాలించాడు. చంద్రా సాహిబ్ ను మరాఠాలు ఓడించగా మరాఠా సేనాని ముఆరి రావ్ ట్రిచీ ని 1741 నుంచి 1743 వరకు పాలించాడు, తరువాత అది కర్నాటక రాజ్యంలో కలిసింది. కర్నాటక నవాబును చందా సాహిబ్ 1751 లో పదవి నుంచి తొలగించాడు. దీని వల్ల ఒక వైపు బ్రిటిష్ వారు, ముహమ్మద్ అలీ ఖాన్ వల్లాజా, కర్నాటక నావాబు, మరో వైపు ఫ్రెంచ్ వారితో కలిసిన చందా సాహిబ్ ల మధ్య రెండో కర్నాటక యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారు గెలవగా ముహమ్మద్ అలీ ఖాన్ వల్లాజా కు రాజ్యం అప్పచెప్పారు.1801 లో బ్రిటిష్ వారు కర్నాటక రాజ్యాన్ని చేజిక్కించుకుని దాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ లో కలిపారు. బ్రిటిష్ హయాం లో ట్రిచీ ఒక ప్రముఖ ప్రసిద్ధ నగరంగా వెలుగొందింది.

ట్రిచీ చుట్టూ వున్న ఆకర్షణలు

గొప్ప సాంస్కృతిక వైభవం, సంప్రదాయం వల్ల ట్రిచీ లో చాలా అద్భుతమైన. చారిత్రిక, ధార్మిక ప్రదేశాలు కోటలు వున్నాయి. విరలిమలై మురుగన్ దేవాలయం, రాకఫోర్ట్ దేవాలయం, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, జంబుకేశ్వరార్ దేవాలయం, సమయపురం మరియమ్మన్ దేవాలయం, ఎరుమ్బీశ్వర్ దేవాలయం, వయలూర్ మురుగన్ దేవాలయం, వెక్కలియమ్మన్ దేవాలయం, గుణశీలం విష్ణు దేవాలయం, నాదిర్ షా మసీదు, సెయింట్ జాన్స్ చర్చి, సెయింట్ జోసెఫ్స్ చర్చి ఈ చారిత్రిక వైభవం లోంచి వచ్చినవే.

నవాబ్ అంతఃపురం, కళ్ళనై ఆనకట్ట, ముక్కొంబు డ్యాం, ట్రిచీ లోని కొన్ని ప్రాచీన, ప్రముఖ కట్టడాలు.

పొంగల్, తమిళ సంవత్సరాది, ఆది పెరుక్కు, వైకుంఠ ఏకాదశి, నవరాత్రి, బక్రీద్, శ్రీరంగం రథోత్సవం, దీపావళి, హోలీ లాంటి వివిధ పండుగలు వైభవంగా జరుపుకోవడం ఈ ప్రాంతంలో ప్రత్యెక ఆకర్షణ. స్థానిక హస్తకళలు, నగలు ఈ నగరంలో షాపింగ్ ను కూడా ఒక మంచి అనుభూతిగా అందిస్తూ , దీన్ని పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తాయి.

ట్రిచీ కి ప్రయాణం

ట్రిచీ వాయు, రైల్, రోడ్డు మార్గాల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి వుంది. చెన్నై, బెంగళూరు, శ్రీలంక, కౌలాలంపూర్ లకు విమానాలు నడిచే తిరుచిరాపల్లి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. జాతీయ రహదారులు NH 45, 45B, 67, 210, 227 ట్రిచీ గుండా వెళ్తాయి. కనుక ఈ నగరం నుంచి తమిళనాడు లోని ఇతర ప్రధాన నగరాలకు నిత్యం బస్సులు నడుస్తాయి. ట్రిచీ లోని రైల్వే స్టేషన్ తమిళనాడు లోని ప్రధాన జంక్షన్లలో ఒకటి. ఇక్కడి నుంచి భారత దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం రైళ్ళు నడుస్తాయి, అలాగే దక్షిణ భారత దేశంలోని నగరాలకు నేరుగా రైళ్ళు తిరుగుతాయి.

ట్రిచీ లోని వాతావరణం ఏడాదిలో ఎక్కువ కాలం వేడిగా, పొడిగా వుంటుంది. ఇక్కడి వేసవి పగటి పూట చాలా వేడిగా ఉంటూ, సాయంత్రాలు చల్లబడతాయి. వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు పడి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ట్రిచీ లోని శీతాకాలం చల్లగా వున్నా, ఆహ్లాదకరంగా వుంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వుండే శీతాకాలం నగర సందర్శనకు ఉత్తమ సమయం.

Please Wait while comments are loading...