Search
  • Follow NativePlanet
Share
» »అల‌నాటి ఖగోళ పరిజ్ఞానానికి స‌జీవ‌ సాక్ష్యం.. మ‌డుమాల్ నిలువురాళ్లు!

అల‌నాటి ఖగోళ పరిజ్ఞానానికి స‌జీవ‌ సాక్ష్యం.. మ‌డుమాల్ నిలువురాళ్లు!

తెలంగాణ‌లోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం పేరు చెబితే ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి ఆన‌వాళ్లు ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇక్క‌డి ముడుమాల్ ప్రాంతంలో క‌నిపించే నిలువురాళ్లు చ‌రిత్ర ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆకర్షిస్తున్నాయి. శిలాయుగంలో వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆదిమ మానవులు వీటిని ఏర్పాటు చేసుకున్నట్లు పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు నిర్థారించారు.

అంత‌టి విశేష చరిత్ర క‌లిగిన ఈ రాళ్లను యునెస్కో గుర్తింపు కోసం దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందుకు కావాల్సిన ప్ర‌క్రియ‌ను దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్టు, తెలంగాణ హెరిటేజ్‌శాఖ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌లోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ముడుమాల్‌లోని నిలువురాళ్లు, సప్తర్షి మండలానికి గుర్తింపు వస్తే ప్రపంచ వారసత్వ సంపదలో తెలంగాణ పేరు మ‌రోసారి మారుమోగ‌నుంది.

Madumal pillars

గుర్తింపు అంత సులువుకాదు..

అయితే, ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందాలంటే అంత సులువు కాదు. ఇందు కోసం చాలా నియమాలు ఉంటాయి. ముందుగా ప్రభుత్వం నుంచి పురాతత్వ వారసత్వ పరిరక్షణ ప్రాంతంగా గుర్తింపు పొందాలి. అందుకోసం దీనికి 200 మీటర్ల వరకు ఎలాంటి ఇత‌ర‌ నిర్మాణాలూ ఉండకూడదు. దీంతోపాటు ఇక్కడి స్థలానికి ఉన్న ప్రత్యేకత అంతర్జాతీయ స్థాయిలో మ‌రెక్కడా ఉండకూడదు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశోధనలు జరిగాయి? ఇంకేమైనా పరిశోధనలు జ‌ర‌పాల్సి ఉందా? ఇలా ఈ ప్ర‌దేశంలో 30 ఏళ్లకు సంబంధించిన డీపీఆర్‌ను తయారు చేయాల్సి ఉంటుంది.

ఇందుకోసం ఓ ఏజెన్సీని నియ‌మించి, దానికి నిధులు కేటాయించాలి. ఆ వివ‌రాల‌ను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. గ‌తంలో రామప్ప దేవాలయానికి రెండు సార్లు ప్రతిపాదనలు పంపిస్తే తిరస్కరించి, మూడోసారి ఎంపిక చేశారు. రామప్ప ఆలయానికి అనేక‌ ప్రత్యేకతలు ఉన్నాయి. నీళ్లలో తేలియాడే ఇటుకలతో గోపురం ఇక్క‌డ క‌నిపిస్తుంది. అలాగే, డోలమైట్‌ మీద 2 వేల శిల్పాలు చెక్కడంతోపాటు ఇసుక రాతిపై నిర్మాణాలు చేప‌ట్టారు. ఇటువంటి నిర్మాణం ప్రపంచంలో మ‌రెక్క‌డా లేదు.

Madumal pillars

నిలువురాళ్లకు ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు..

నిజానికి, ముడుమాల్‌లోని నిలువురాళ్లకు చాలా ప్రత్యేక‌త‌లు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో ఇన్ని మెన్హిర్స్ ఇక్క‌డ త‌ప్ప‌ మ‌రెక్క‌డా క‌నిపించ‌వు. అలాగే, ఖగోళ శాస్త్ర పరిశోధనలకు అనుగణంగా సప్తర్షి మండలం ఇక్క‌డి అద‌న‌పు అవ‌కాశంగా చెప్పొచ్చు. అంతేకాదు, ఈ నిలువురాళ్లపై అప్పట్లో మనుషులు వేసిన చిత్రాల‌ ఆనవాళ్లు నేటికీ కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి దగ్గరలోనే కృష్ణా నది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. ఇవి ఆదిమ మానవుల(శిలాయుగ) ఆనవాళ్లగా నిర్ధార‌ణ జ‌రిగింది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 100 వరకు గండ శిలలు ఉండ‌గా, ఒక్కొక్కటి 12-14 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి.

వీటితోపాటు చిన్న, చిన్న గుండ్లు(రాళ్లు) మరో 2 వేల వరకు ఉండొచ్చు. వాతావరణంలో మార్పులు, కాలాలను గుర్తించడానికి నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసిన‌ట్లు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఆకాశంలోని నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని(ఖగోళ పరిజ్ఞానం) కచ్చితంగా గుర్తించేందుకు ఓ రాతిపై సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేనిన‌ట్లు గుర్తించారు. ఇన్నీ ప్ర‌త్యేక‌త‌లు ఉన్న ముడుమాల్ నిలువురాళ్ల ప్రదేశాన్ని యునెస్తో త‌ప్ప‌కుండా గుర్తిస్తుంద‌ని.. గుర్తించాల‌ని మ‌న‌మూ కోరుకుందాం.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+