Search
  • Follow NativePlanet
Share
» »స్వాతంత్రోద్య‌మ స్ఫూర్తిని ర‌గిల్చే స్మార‌కాలు.. ఈ నిర్మాణాలు!

స్వాతంత్రోద్య‌మ స్ఫూర్తిని ర‌గిల్చే స్మార‌కాలు.. ఈ నిర్మాణాలు!

ఏటా ఆగ‌స్టు 15న మ‌నం స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని జరుపుతాం. వలస పాలన నుండి విముక్తి పొందేందుకు భార‌తీయులు చేపట్టిన అసాధారణ ప్రయాణానికి ఇది ఒక చిర‌స్మ‌ర‌నీయమైన గుర్తు. సుధీర్ఘ‌ స్వాతంత్య్ర‌ పోరాటానికి నిలువెత్తు సాక్ష్యాలుగా దేశం న‌లుమూల‌లా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు నేటికీ ఎంతో ఠీవిగా ద‌ర్శ‌మిస్తున్నాయి. తెల్ల‌దొర‌ల‌పై ధిక్క‌రణ స్వ‌రం ప‌లికిన‌ ఖుర్దా కోట గోడల నుండి జలియన్‌వాలా బాగ్ విషాదభరితమైన మైదానాల వరకు అల‌నాటి స్వాతంత్య్ర ఉధ్య‌మంలో ర‌గిలిన నిప్పుక‌నిక‌ల్లా, నేటి త‌రానికి స్ఫూర్తిని కలిగించేలా క‌నిపిస్తాయి ఈ ప్రాంతాలు. ఈ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా.. స్వేచ్ఛా మరియు సార్వభౌమ భారతదేశ పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కొన్ని స్మార‌క ప్ర‌దేశాల‌ను ప‌ల‌క‌రిద్దాం.

వీర గున్న‌మ్మ స్థూపం(శ్రీకాకుళం)

శ్రీకాకుళం జిల్లా మందస మండలం గుడారిరాజమణిపురం రైతులు బ్రిటిష్ పాల‌న‌పై తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేశారు. ఆ రైతుల కూట‌మిలో నిండు గ‌ర్భిణిగా ఉన్న‌ గున్న‌మ్మ ఒక‌రు. అంతాక‌లిసి.. అడవుల నుంచి నాటుబళ్లపై కట్టెలతో శిస్తు క‌ట్ట‌కుండా గ్రామంలో అడుగుపెట్టారు. ఆ విష‌యం మంద‌స ఎస్టేట్ దివాను రామ‌కృష్ణ‌దేవ్ బ్రిటిష్ ప్ర‌భుత్వానికి చేర‌వేశారు. దీంతో డీఎస్పీ మునిలాల్‌ పోలీసు బలగాలతో గుడారిరాజ‌మ‌ణిపురం గ్రామానికి చేరుకున్నారు. కొంద‌రు రైతుల‌ను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. దీంతో అక్క‌డి రైతులు మూకుమ్మ‌డిగా పోలీసుల‌పై తిర‌గబ‌డి అరెస్టయినవారిని విడిపించారు.

1940 ఏప్రిల్ 1న‌ గ్రామానికి సబ్‌కలెక్టరు చక్రవర్తి అదనపు పోలీసు బలగాలతో వ‌చ్చి, చర్చల పేరుతో రైతులను తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అక్క‌డే ఉన్న‌గున్న‌మ్మ‌ అక్క‌డి రైతుల‌తో క‌లిసి కర్రలతో పోలీసుల‌ను ఎదిరించారు. దీంతో విచ‌క్ష‌ణ మ‌రిచిన ఆ పోలీసులు రైతుల‌పై కాల్పులు జ‌రిపారు. ఆ తూటాల‌కు ఎదురునిలిచిన నిండు గ‌ర్భిణి గున్న‌మ్మతోపాటు రైతులు గొర్లె జగ్గయ్య, గుంట బుడియాడు, కర్రి కలియాడు, గుంట చిననారాయణలు త‌మ ప్రాణాల‌ను అర్పించారు. 1988లో గవర్నరు శ్రీమతి కముద్‌బెన్‌జోషి ఆ గ్రామంలో గున్నమ్మ ప్రాణాల్పించిన స్థ‌లంలోనే స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ గ్రామానికి వీరగున్నమ్మపురంగా నామకరణం చేసి ప్రభుత్వ గెజిట్ విడుద‌ల చేశారు.

kovelakuntlafort1

కోవెలకుంట్ల కోట, క‌ర్నూలు

క‌ర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాల‌వాడ‌ నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం బ్రిటిష్‌వారు అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. అయితే, బ్రిటీష్‌పాలన నిరంకుశత్వ పాలనను ప్రతిఘటించి మొదటిసారిగా 1842లో తిరుగుబాటు బావుట ఎగర వేశాడు.

తన పోరాటంలో కోవెలకుంట్ల తహసీల్దార్‌ను నరికిచంపడమే కాక బ్రిటీష్‌ వారి ఖజానాను కొల్లగొట్టారు. ఎట్టకేలకు 1847లో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకున్నారు. బందిపోటు దొంగగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22వ తేదీన కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు చేశారు. ప్రజలు భయపడేలా 1877 వరకు ఆయన తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశారు. అల‌నాటి ఉయ్యాల‌వాడ పోరాటానికి సాక్ష్యంగా కోవెల‌కుంట్ల కోట మిగిలిపోయింది.

ఖుర్దా కోట (1803)

బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ బెంగాల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత దాని విస్తరించే క్ర‌మంలో ఒడిశాను కలుపుకుంది. ఒడిశాలోని ప్రస్తుత ఖోర్ధా జిల్లా ఖుర్దాకు చెందిన పైకా (యోధుల సంఘం)లు విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. 1803లో ఖుర్దా కోటపై బ్రిటిష్ దాడి సామ్రాజ్యవాద ప్రతిఘటనకు కీల‌క ఘ‌ట్టంగా చెప్పొచ్చు. నిజానికి, ఒడిశాపై బ్రిటిష్ దాడి సెప్టెంబర్ 1803లో ప్రారంభమైంది. కల్నల్ హార్కోర్ట్ నేతృత్వంలోని సాయుధ దళం మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఉత్తరం వైపు ఉన్న‌ మాణిక్‌పట్న వైపుగా ముందుకొచ్చింది. బ్రిటీష్ వారి ఆయుధ బ‌ల‌గాల ముందు పైకాలు బ‌లం స‌రిపోలేదు. అయిన‌ప్ప‌టికీ చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ వారు ప్ర‌తిఘ‌టించారు. అయితే, బ్రిటీష్ వారు కొద్ది వారాల్లోనే దాదాపు అన్ని ఒడిశా భూభాగాలను ఆక్రమించారు. ఆనాటి పైకాల తిరుగుబాటుకు ఖుర్దా కోట సాక్ష్యంగా నిలుస్తుంది.

kovelakuntlafort1

బెంగళూరు కోట (1791)

బెంగుళూరు కోటను కెంపె గౌడ నిర్మించాడు. ఈ కోట‌ మూడవ మైసూర్ యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించింది. 21 మార్చి 1791న లార్డ్ కార్న్‌వాలిస్ నేతృత్వంలోని మూడవ మైసూర్ యుద్ధ (1790-1792) సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం బెంగళూరు ముట్టడించి, కోటను స్వాధీనం చేసుకుంది. ఇక్క‌డ ఒక పాలరాతి ఫలకం బ్రిటీష్ వారు కోట గోడను ఆక్ర‌మించిన ప్రదేశాన్ని గుర్తుచేస్తుంది. టిప్పు సుల్తాన్‌తో యుద్ధం చేసినప్పుడు కోటలోని కొంత భాగం బ్రిటిష్ వారి బాంబు దాడులకు గురైంది. బెంగళూరు కోటను స్వాధీనం చేసుకోవడంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం సామాగ్రిని తిరిగి నింపి, శ్రీరంగపట్నంపై దాడి చేసేందుకు వ్యూహాత్మక స్థావరాన్ని రూపొందించింది.

redfort

ఎర్రకోట, ఢిల్లీ (1857)

భారతదేశ చరిత్రలో ఢిల్లీలోని ఎర్రకోట ఒక కీలకమైన ప్రదేశం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీనిని నిర్మించాడు. అనంత‌రం ఇది బ్రిటిష్ నియంత్రణకు చిహ్నంగా మారింది. 1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో కోట రక్షణ గోడలు పెద్దగా పాడవకుండా ఉన్నాయి. దీంతో కోటను దండు(రక్ష‌ణ ప్ర‌దేశం)గా ఉపయోగించారు. రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం త‌ర్వాత‌ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ భూభాగాల పరిపాలనను చేపట్టింది. ఎర్రకోటలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసింది. తిరుగుబాటులో ఓడిపోయిన తర్వాత బహదూర్ షా II సెప్టెంబరు 17న బ్రిటిష్ దళాలకు పట్టబడ్డాడు. మెహతాబ్ బాగ్ లేదా మూన్‌లైట్ గార్డెన్ వంటి చిన్న ఉద్యానవనాలు దీనికి పశ్చిమాన ఉండేవి. అయితే బ్రిటిష్ బ్యారక్‌లు నిర్మించబడినప్పుడు అవి కూల్చివేయబడ్డాయి.

మంగళ్ పాండే పార్క్, బరాక్‌పూర్ (1857)

మంగళ్ పాండే 1857లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపించాడు. అతను బారక్‌పూర్ కంటోన్మెంట్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటులో పాల్గొన్న సైనికుడు. అతను తన కత్తితో ఇద్దరు బ్రిటిష్ అధికారులను గాయపరిచాడు. ఏప్రిల్ 8, 1857న అతన్ని కోర్టు ఆదేశాల మేర‌కు ఉరితీశారు. ఈ పార్క్ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండేకి అంకితం చేయబడింది. పార్కులో మంగళ్ పాండే విగ్రహంతోపాటు అతని స్మారక చిహ్నం కూడా ఉన్నాయి. మంగళ్ పాండే విగ్రహం ముందు గౌరవార్థం చిన్న ఏనుగు విగ్రహం ఉంటుంది.

ఝాన్సీ రాణి కా ఖిలా (1858)

చండేలా రాజుల కాలంలో ఝాన్సీ రాణి కా ఖిలా బలమైన కోట. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా రాణి లక్ష్మీ బాయి తిరుగుబాటుతో భారతదేశ చరిత్రలో ఈ కోట‌ ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఝాన్సీని ఏప్రిల్ 1858లో జనరల్ హ్యూ రోజ్ కంపెనీ బలగాలు ముట్టడించి, 4 ఏప్రిల్ 1858న స్వాధీనం చేసుకున్నాయి. రాణి లక్ష్మీ బాయి ధైర్యంగా పోరాడి, కోట నుండి గుర్రంపై ధైర్యంగా తప్పించుకుంది. 1861లో, బ్రిటిష్ ప్రభుత్వం గ్వాలియర్ కోటకు ప్రతిగా గ్వాలియర్ మహారాజా జయజీరావు సింధియాకు ఝాన్సీ కోట, ఝాన్సీ నగరాన్ని ఇచ్చింది. అయితే బ్రిటిష్ వారు 1886లో గ్వాలియర్ రాష్ట్రం నుండి ఝాన్సీని తిరిగి తీసుకున్నారు.

jallianwalabagh1

జలియన్ వాలా బాగ్, అమృతసర్ (1919)

శాంతియుతంగా జరిగిన సభపై బ్రిటీష్ దళాలు కాల్పులు జరిపినప్పుడు అక్కడ జరిగిన మారణకాండకు సాక్ష్యమే జలియన్‌వాలాబాగ్. ఈ ఘ‌ట‌న వలసవాద క్రూరత్వానికి నిద‌ర్శ‌న‌గా మిగిలిపోయింది. జలియన్‌వాలా బాగ్‌కి ఒక వైపు మాత్రమే బ‌య‌ట‌కు వెళ్లే దారి ఉంటుంది. మిగ‌తా మూడు వైపులా భవనాలు ఉన్నాయి. ఆ ఒక్క‌ మార్గం వ‌ద్ద‌ 13 ఏప్రిల్ 1919న, డ‌య్య‌ర్‌ తన దళాలతో నిర‌స‌న‌కారుల‌పై కాల్పుల‌కు ఆదేశించాడు. తమ వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి అయిపోయేంత వరకు సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘ‌ట‌నలో 379 నుండి 1,500 లేదా అంతకంటే ఎక్కువ మంది అసువులుబాశారు.

More News

Read more about: independence day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+