గుహఘర్  - దేవాలయ పట్టణం

గుహఘర్ ఒక చిన్న పట్టణం. ఈ పట్టణం భారతదేశంలో పడమటి తీరంలో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో కలదు. ఈ పట్టణానికి ఒకవైపున అరేబియా సముద్రం మరోవైపు గంభీరమైన సహ్యాద్రి పర్వత శ్రేణులు కలవు. గుహఘర్ అంటే స్ధానిక భాషలో ‘గుహ ఇల్లు’ అని అర్ధం చెపుతారు.  దేవాలయ పట్టణం గుహగర్ ను దేవాలయ పట్టణం అని కూడా అంటారు. దానికి కారణం ఈ పట్టణంలో అనేక హిందూ దేవాలయాలుండటమే. శివ భగవానుడి అనేక అవతారాలైన బాలకేశ్వర్, ఉదాలేశ్వర్, వ్యాధేశ్వర్, వెల్నేశ్వర్, తల్కేశ్వర్ మొదలైన పేర్లతో దేవాలయాలు కలవు. ఈ పట్టణంలోనే చంద్రికా మందిరం కూడా ఉంది. దీనిలో ఉఫ్రతా గణపతి విగ్రహం కలదు. ఇది గుహఘర్ బీచ్ సమీపంలో కలదు. శ్రీ దశభుజ్ లక్ష్మీ గణేశ దేవస్ధానం మరియు ఉమా మహేశ్వర దేవాలయం లు ఇక్కడ కల ఇతర దేవాలయాలు.

ప్రతి ఏటా ఈ పట్టణం వేలాది భక్తులను శివ దర్శనార్ధం ఆకర్షిస్తుంది. మహాశివరాత్రి సందర్భ వేడుకలకు ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ సమయంలో ఇక్కడ ఒక  పెద్ద సంత కూడా నిర్వహిస్తారు.

అందమైన బీచ్ ఎంతో ప్రశాంతమైన, మెత్తటి బంగారు రంగు ఇసుకలతో నిండి ఉన్న బీచ్ నుండి దూరంలోని అందమైన సూర్యాస్తమయం చూసి ఆనందించవచ్చు. అనేక నీటి సంబంధిత క్రీడలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. విశ్రాంతి సెలవులు బీచ్ లో గడిపేందుకు గుహగర్ సరైన ప్రదేశంగా భావించవచ్చు.

గుహఘర్ పట్టణం దాని దేవాలయాలకు ప్రసిద్ధి అవటమే కాక, మనుష్య సంచారం లేని సుమారు 6 కి.మీ.ల దూరం విస్తరించిన బీచ్ కు కూడా ప్రసిద్ధి చెందినదే. వక్కలు, అల్ఫాన్సో మామిడి పండ్లు, కొబ్బరి చెట్లు బీచ్ లో వరుసన నిలబడి ఉంటాయి. కొంకణ్ సంస్కృతికి ఈ ప్రదేశం అద్దం పడుతుంది.

బుధాల్ మరొక నిర్మలమైన, ప్రశాంతమైన సముద్రపు ఒడ్డు. దీనిలో అనేక పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఎంతో ఆనందానుభూతులు కలిగిస్తుంది.  ఈ బీచ్ లు అన్నీ కూడా మనుష్య సంచారంలేక ఏ రకమైన కాలుష్యం లేకుండా ఎవరూ ఉపయోగించని విధంగా ఉండి మీకు ఒక తాజా అనుభూతి కలిగిస్తూ ప్రకృతిలోని నిగూఢ అందాలను ప్రదర్శిస్తూ ఉంటాయి.

ఉన్నతమైన, కొండ భూభాగాల నేపథ్యంగా మరియు దట్టమైన వృక్ష జాతులతో, గుహగర్ బీచ్ సందర్శించడానికి మీకు ఆనందంగా ఉంటుంది.

గుహఘర్ చేరాలంటే ఎపుడు? ఎలా? గుహఘర్ చేరేవారు పడమటి కోస్తాలో కల అరేబియా సముద్ర తీర ఆహ్లాదకర  వాతావరణాన్నితప్పక ఆనందిస్తారు. సెప్టెంబర్ నుండి మే నెల వరకు అంటే వర్షాలు నిలిచిన తర్వాత మరియు పూర్తి శీతాకాలంలో గుహఘర్ ప్రదేశం ఆనందించేందుకు అద్భుతంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 18 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా రికార్డు అవుతూంటాయి. మే నెల అధిక ఉష్ణోగ్రతలకు దూరంగా ఉండటం మంచిది. గుహగర్ ప్రాంతంలో కొబ్బరి, మామిడి అల్ఫాన్సో, జీడిపప్పు మరియు పనస మొదలైన తోటలకు ప్రసిద్ధిగా ఉంటుంది. అంతేకాదు, ఇక్కడి సముద్రపు ఆహారాలు, వంటకాలు నోరు ఊరేలా చేస్తాయి. వెజిటేరియన్లకు వారు తినే మరిన్ని బ్రాహ్మణ ఆహార రుచులు కూడా దొరుకుతాయి.

గుహఘర్ చేరాలంటే, రైలు, రోడ్డు మరియు విమాన సౌకర్యాలు కలవు. ఈ కారణంగానే సెలవులు వచ్చాయంటే చాలు గుహఘర్ చేరేందుకు ఆసక్తి చూపుతారు. మీరు విమానం మీద వెళ్ళాలనుకుంటే, ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం. రైలు మార్గం ఎంపిక చేస్తే, ఛిప్లున్ రైల్వే స్టేషన్ సమీప రైలు స్టేషన్. మీరు కనుక రోడ్డు మార్గం ఎంచుకుంటే, అనేక బస్సులు ప్రభుత్వం లేదా ప్రయివేటువి కలవు.   పురాతన దేవాలయాలు, చుట్టుపట్ల జలపాతాలు, అందమైన ప్రదేశాలు, బీచ్ లు దట్టమైన అడవులతో కల గుహఘర్ సందర్శన మీకు జీవితంలో మరువలేని అనుభూతులు అందిస్తుంది.  

Please Wait while comments are loading...