విజయదుర్గ్ – మంత్రముగ్ధుల్ని చేసే చిన్న పట్టణం 

మహారాష్ట్ర తీరం వెంబడి వుండే చిన్న పట్టణం విజయదుర్గ్. ముంబై నుంచి 485 కిలోమీటర్లు దూరంలో వుండే ఈ పట్టణం సింధుదుర్గ్ జిల్లా లో వుంది. పూర్వం దీన్ని గేరియా అనేవారు. అటు అరేబియా సముద్రానికి ఇటు సహ్యాద్రి పర్వతాలకు మధ్య వుండే ఈ పట్టణం చూసి తీరాల్సిన ప్రదేశాల్లో ఒకటి.

విజయదుర్గ్ పట్టణం, సింధుదుర్గ్ జిల్లా అంతా మరాఠా రాజ్యంలో నౌకా దళానికి స్థావరంగా వుండేవి. ఈనాటికీ అది పని చేస్తున్న ఓడ రేవు.

వారాంతంలో పని వత్తిడి నుంచి సేద తీరేందుకు వెళ్లి తీరాల్సిన ప్రదేశం విజయదుర్గ్. స్వచ్చమైన, కలుషితం కాని తీరాలు, చారిత్రిక కోట లతో నిజమైన పర్యాటకులకు అందించడానికి విజయదుర్గ్ లో చాలా అందాలు వున్నాయి. తీరాల వెంబడి కూడా కొబ్బరి చెట్లు, తాటి చెట్లతో దట్టమైన అడవులు పరుచుకుని వుంటాయి. రసాలూరే ఆల్ఫోన్సో మామిడి పళ్ళ అమృత తుల్యమైన వాసనతో ఈ ప్రాంతంలోని వేసవి నిండిపోతుంది. ఎర్ర చెక్కతో కట్టిన ఇళ్ళు వాటిపై పరచిన గడ్డి పైకప్పులతో ఆ అందం ఇంకా ఇనుమడిస్తుంది.

విజయదుర్గ్ కోట – ఓ అద్భుత నిర్మాణం :

మరాఠా రాజ్యంలో శివాజీ మహారాజు కట్టిన విజయదుర్గ్ కోట ఇక్కడ ప్రసిద్ది చెందినది – దీన్నే ఫోర్ట్ విక్టర్ అని కూడా అంటారు. దీన్ని 300  సంవత్సరాలకు పూర్వం 17 వ శతాబ్దంలో కట్టారు. నాలుగింట మూడు వైపులు అది సముద్రంతో కప్పబడి వుంది కనుక దీన్నే ఘేరియా అని కూడా అంటారు.

పీష్వా, మరాఠా రాజ్యాల్లో ఈ కోటను ఒక బలీయమైన శక్తిగా పరిగణించేవారు, ఈ పట్టణాన్ని నాశనం చేయాలని సర్వ శక్తులూ ఒడ్డిన విదేశీ శత్రువులు దీని దుర్బెధ్యంగా భావించేవారు. కోట చుట్టూ మూడు అంచెలుగా గోడలు కట్టారు, సమీపంలోనే కొన్ని భవనాలు, కట్టడాలు కట్టారు, దాంతో కోట దుర్బెధ్యంగా మారింది. ఇది మొత్తం  17 ఎకరాల్లో విస్తరించి వుంది.

భారీ ఎత్తున కట్టిన ఈ కోటను ఒకప్పుడు బ్రిటీష్ వాళ్ళు చేజిక్కించుకుని దానికి ఫోర్ట్ ఆగస్టస్ అని లేదా ఓషన్ ఫోర్ట్ అనీ నామకరణం చేశారు. శతాబ్దాల నాటి ఈ కట్టడం తన అందంతో ఈనాటికీ పర్యాటకుల్ని ఎలా ఆకట్టుకుంటున్నదో చూసి నిర్మాణ ప్రియులు అబ్బురపడుతున్నారు.

శివాజీ ఈ కోట వున్న భౌగోళిక స్థితిని తనకు అనుకూలం గా వాడుకున్న విధానం కారణంగా ఈ కోట ను ఓ అద్భుతమైన నిర్మాణం అనవచ్చు. ఈ కోటకు అనుబంధంగా వున్న ఖర్పెతాన్ వాగు వల్ల పెద్ద నౌకలు, ఓడలు ఈ దరిదాపుల్లోకి రావడం దాదాపు అసాధ్యం అయ్యేది. మరాఠా వారి యుద్ధ నౌకలను వుంచడానికి ఈ ప్రాంతాన్ని వాడేవారు. అందువల్ల ఈ కోటకు తూర్పు జిబ్రాల్టర్ అనే పేరొచ్చింది. అరేబియన్ సముద్రంలో నిఘా కోసం కట్టిన వేదిక కూడా చూసి తీరవలసిన అద్భుతం.

ఈ ఓడ రేవులోనే మరాఠా యుద్ధ నౌకలకు మరమ్మతులు చేసేవారు. కోట నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో వుండే ఈ ప్రదేశాన్ని వాగ్జోతాన్ వాగు అనేవారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శివాజీ మహారాజు కాషాయ జండా ఎగురవేసిన రెండు కోటల్లో ఇది ఒకటి. ఇంకోటి తోరానా కోట. మారుతి, మహాపురుష్, మహాదేవ్ వంటి దేవుళ్ళ విగ్రహాలతో వుండే చాలా గుళ్ళు ఈ పరిసరాల్లో వున్నాయి. చాల పురతనము, శిదిలమూ అయిన రామేశ్వరాలయం కూడా వుంది. హిందూ మతావలంబులకూ, భక్తులకూ ఇది ప్రసిద్ధమైన గుడి.

అక్కడ వుండగా, తప్పకుండా చూడాల్సినవి :

మీరు విజయదుర్గ్ వెళ్లి అక్కడి స్థానిక రుచులు చూడకుండా రాలేరు. ఇక్కడ మీరు తప్పక రుచి చూడవలసిన వాటి జాబితాలో మాల్వాణి కూర ముందు వుంటుంది. సోల్ ఖడీ కూడా రుచి చూడాల్సిందే. మత్స్య ప్రియులు ఇక్కడ దొరికే చేపల వంటకాలతో చాల ఆనందిస్తారు.

ఇక్కడి ప్రజలు చాల ఆప్యాయంగా ఆతిథ్యం ఇస్తారు. వసతి కూడా ఇబ్బంది కాదు. వేసవిలో విజయదుర్గ్ వెళ్ళేటట్లయితే తప్పకుండా రసాలూరే ఆల్ఫోన్సో మామిడి పళ్ళు, ఇక్కడ దొరికే పనస పళ్ళు తినడం మర్చిపోకండి. జీడిపప్పు పరిశ్రమకు వెళ్లి దాన్ని ఎలా శుద్ధి చేస్తారో చూడండి.

మరిన్ని వివరాలు :

ఇక్కడి అర్థ ఉష్ణ మండల వాతావరణం వల్ల విజయదుర్గ్ లో ఏడాదంతా హాయిగా వుంటుంది. ఇక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేసవిలో ఇక్కడికి రావడం సూచించ దగిన విషయం కాదు. వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడి ఈ ప్రాంతాన్ని ఓ దృశ్య కావ్యంలా మారుస్తాయి. అయితే, శీతాకాలం – ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చాల మంచి సమయం – ఎందుకంటే వాతావరణం చల్లగా, హాయిగా వుంటుంది. ఈ చిన్న పట్టణం అందించే అందాలు ఆస్వాదించడానికి ఇది ఉత్తమ సమయం అని చెప్పాలి.

మహారాష్ట్ర లోని అన్ని ప్రదేశాల నుంచి, బయటి నుంచి కూడా విజయదుర్గ్ తెలిగ్గానే చేరుకోవచ్చు. మీరు విమానంలో వస్తుంటే పనాజి సమీపంలోని విమానాశ్రయం. అక్కడి నుంచి ఒక కార్ మాట్లాడుకుని కొద్ది ప్రయాణంతో  ఇక్కడికి చేరుకోవచ్చు. రైలు మార్గంలో వస్తే, కుడాల్ లేదా రాజపూర్ స్టేషన్లలో దిగి పోవచ్చు.  పూణే, ముంబై లాంటి అన్ని ప్రధాన నగరాల నుంచి విజయదుర్గ్ కు ప్రభుత్వ, ప్రైవేట్ బస్ సర్వీసులు అందుబాటులో వున్నాయి.

విజయదుర్గ్ ను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాబట్టి మీరు నిర్మాణ ప్రియులైనా, ఈ అద్భుతమైన దేశామికి చెందినా వాడినని గర్వించే కుతూహల పర్యాటకులైనా, విజయదుర్గ్ మీ కోరిక తీరుస్తుంది.

Please Wait while comments are loading...