Search
  • Follow NativePlanet
Share
» »చూసొద్దామా.. కృత్రిమ‌ శిలా ఉద్యాన‌వ‌నాన్ని

చూసొద్దామా.. కృత్రిమ‌ శిలా ఉద్యాన‌వ‌నాన్ని

చూసొద్దామా.. కృత్రిమ‌ శిలా ఉద్యాన‌వ‌నాన్ని

చండీగఢ్‌లోని రాక్ గార్డెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే! అక్కడి కళాకృతులకు ప్రాణంపోసిన చేతులను మనసారా ముద్దాడాలనిపిస్తుంది. అయితే, ఏ ప్రణాళికా లేకుండా ఇక్కడ మానవ నిర్మిత జలపాతాలు, కల్వర్టులు, పర్వతాలు వివిధ రకాల కళాకృతులు ఎలా వచ్చి ఉంటాయి? ఎవరు చేశారు? అన్న సందేహం ఇక్కడికి వచ్చే సందర్శకులలో కలగక మానదు. అలాంటి ప్రాంత ప్రాముఖ్యత, చరిత్రను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా కలుగుతుంది. మరి ఆ చట్టవిరుద్ధ నిర్మాణస్థలం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎలా రూపుదిద్దుకుంది? అనే విష‌యాన్ని తెలుసుకుందా పదండి.

స్నేహితులతో కలిసి మేమంతా రాక్ గార్డెన్ చూసేందుకు వెళ్లాం. మేముంటోన్న మ్యూజియం కాంప్లెక్స్ నుంచి అరగంటలో అక్కడికి చేరుకున్నాం. రాక్ గార్డెన్ ఎంట్రీ ముందు నిలబడగానే మాకు మూడు బండరాళ్లు దర్శనమిచ్చాయి. వాటి దగ్గరికి వెళ్లి చూస్తే రాక్ గార్డెన్ అని వాటిపై రాసి ఉంది. అది చూసిన తర్వాత టికెట్ కౌంటింగ్ దగ్గర ఉన్న భారీ క్యూ దగ్గరకి వెళ్ళి నిలబడ్డాం. ముందుకు వెళ్లగానే పెద్ద కళాత్మకమైన గేటు మమ్మల్ని ఆహ్వానించింది. అదే రాక్ గార్డెన్ గేటు అనుకుని అక్కడే కూర్చొన్నాం.

లోపలికి వెళ్లి చూడగానే తెలిసింది. అది రాక్ గార్డెన్ గేటు కాదు క్యాంటిన్ గేటు అని..! మాలో మేమే నవ్వుకుంటూ రాక్ గార్డెన్ వైపుగా అడుగులు వేశాం. లోపలికి వెళ్లగానే ఇరుకైన మార్గాలు, మట్టి పర్వతాలు, పాత టైల్స్, వివిధరకాల కళాకృతులు మాకు స్వాగతం పలికాయి. ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే, ముందు ఏం వస్తుందో తెలియని ఉద్విగ్నత! మరొక్క క్షణం ఆగితే, కళ్ళముందు మరో ప్రపంచం. అలా నడుస్తూంటే మేమంతా ఓ అద్భుతమైన కోటలో ఉన్న అనుభూతి కలిగింది. అక్కడున్న శిల్పకళను చూస్తుంటే నేక్ చంద్ ప్రతిభంతా కళ్లకు కట్టినట్లు అనుభూతి కలిగింది.

గైడ్ చెప్పిన విశేషాలు

గైడ్ చెప్పిన విశేషాలు

అక్కడే ఉన్న గైడ్‌ను ఆ ప్రాంతం గురించి వివరించమని అడిగాం. ఒకవైపు కొత్త ప్రాంతం నిర్మాణం జరుగుతుంటే, మరోవైపు దానిపక్కనే ఉన్న కొన్ని గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇక్కడ చాలా భవనాలు, పురాతన కట్టడాలు తొలగించబడ్డాయట! అందులో గాజు వస్తువులు, గాజులు, టైల్స్, సిరామిక్ కుండలు, సింకులు, విద్యుత్ వ్యర్ధపదార్థాలతో ఆ ప్రాంతమంతా చెత్తతో నిండిపోయింది. పాత వస్తువులన్నీ కుప్పలు తెప్పలుగా మిగిలిపోయాయి. ఆ సమయంలో ఈ చెత్తంతా ఎక్కడ వేయాలని అక్కడున్న వారంతా ఆలోచనలోపడ్డారు. ఈ చెత్తనంతా కాపిటల్ కాంప్లెక్స్‌ ఉన్న ఓ స్థలంలో స్టోర్ చేశారు. అప్పటి పిడబ్ల్యూడి విభాగం పర్యవేక్షడు నేక్ చంద్ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ రాక్ గార్డెన్ అని చెప్పారు.

ఎన్నో అడ్డంకుల‌ను అధిగ‌మించి..

ఎన్నో అడ్డంకుల‌ను అధిగ‌మించి..

నేక్‌చంద్‌ ఉదయమంతా అక్కడ కాపలాగా ఉండి, రాత్రి సమయాల్లో ఎవరికీ కనపడకుండా రహస్యంగా

వెళ్లి ఓ ప్రాంతంలో వీటిని తన కలలకు ప్రతిరూపాలుగా తీర్చిదిద్దారు. అలా ఎన్నో రాత్రులు అతను అక్కడే గడిపాడు. 18 ఏళ్లపాటు చీకటి రాత్రుల్లోనే ఎవరికీ తెలియకుండా ఈ రాతి తోటను సృష్టించాడు. రాత్రివేళ రహస్యంగా సమీపంలోని అడవికి వెళ్లి, రాళ్లను చేతులతో మోసుకొచ్చేవాడు. కొండ ప్రాంతాలకు సైకిలుపై వెళ్లి, పెద్ద పెద్ద రాళ్ల తీసుకొచ్చేవాడు. కూల్చివేసిన భవనాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాడు. వీటన్నింటి మిశ్రమంతో నృత్యభంగిమల్లో ఉన్న సంగీతకారుల శిల్పాలు, జంతువులకు సంబంధించిన శిల్పాలను ఏర్పాటు చేశాడు. అది అటవీ ప్రాంతం కనుక, చాంద్ నిర్మాణాలు అన్నీ అక్రమమైనవని, తొలగించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, చాంద్ ప్రజాభిప్రాయం సేకరించి, ఇదొక గొప్ప పర్యాటక స్థలం కాగలదని నిరూపించాడు. అలా 1975లో దీన్ని అధికారికంగా గుర్తించారు. 1976 నుంచి సందర్శకుల కోసం తెరిచారు. తర్వాత ఈ వనాన్ని మరిన్ని శిల్పాలతో విస్తృతపరిచారు. దీనిద్వారా చాంద్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. పలు విదేశీ సంస్థలు ఆయన్ను సత్కరించాయి. విదేశీ మ్యూజియంలలో చాంద్ శిల్పాలకు చోటు దక్కింది.

పురాతన కట్టడాలూ ఉన్నాయి..

పురాతన కట్టడాలూ ఉన్నాయి..

విరిగిన గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్, మాడిన బల్బులు, సీసాలు, కత్తిరించిన జుట్టు వంటి ముడిపదార్థాలను ఈ నిర్మాణాలకు ఉపయోగించారు. క్రమంగా అవన్నీ అద్భుతమైన 20,000 కళాకృతులుగా రూపుదిద్దుకున్నాయి. 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి.. దేశంలోనే ప్రత్యేక కుత్రిమ‌ ఉద్యానంగా మార్చారు. నాట్యకారులు, సంగీత వాద్యకారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో అద్భుత సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇది 40 ఎకరాల మేర విస్తరించి ఉంది. నేక్ చంద్ కలలు ఈ గార్డెన్ ఆధునికతను కాకుండా పురాతన కట్టడాలనూ చూపించారు.

జాలువారే కృత్రిమ జలపాతాల సవ్వడులు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి. ఈ గార్డెన్లో వేసే ప్రతి అడుగూ మరుపురాని మధురమైన అనుభూతుల సమ్మేళనమే. అలా తిరుగుతూ ఎండకు చమటలు పట్టినా, ఆ కళాకృతుల అందాలు అలసటను దరి చేరనీయలేదు. ఓ గుహ దగ్గర కొద్దిసేపు కూర్చున్నాం. మళ్లీ లేచి, మరిన్ని అందాలను తిలకించాం.

అప్పటికే మేం వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. మా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. రాక్ గార్డెన్‌లో నుంచి బయటికి వచ్చేశాం. క్యాంటిన్ దగ్గర ఆలూపరోటా తిన్నాం. దీనిని సీజ‌న్ బ‌ట్టీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు, చలికాలంలో అయితే సాయంత్రం ఆరు వరకూ తెరిచి ఉంచుతారు. వారంలో ఏడు రోజులూ తెరిచే ఉంటుంది. ఇరవై రూపాయలు దీనికి ఎంట్రీ ఫీజు. అక్కడి నుంచి సెక్టార్ సత్రవా బస్‌స్టాప్‌కు వెళ్లాం. అక్కడి నుంచి క్లాక్‌రూం దగ్గరికి వెళ్లి మా సామాన్లు తెచ్చుకున్నాం. అక్కడి నుంచి మా ప్రయాణం ఎయిర్‌పోర్ట్‌కు సాగింది.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

చండీగఢ్ విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా దేశంలోని అన్ని ప్రదేశాల నుంచీ సులభంగా చేరుకోవచ్చు. చండీగఢ్ రైల్వే స్టేషన్ వ్యూహాత్మకంగా సెక్టార్ 17 వద్ద ఉంది. అయితే నగరంలో దేశీయ విమానాశ్రయం నగర కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ‌స్సు సేవలు సెక్టార్ 17, సెక్టార్ 43లో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ నుంచి అందుబాటులో ఉంటాయి.

Read more about: chandigarh rock garden
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X