Search
  • Follow NativePlanet
Share
» » అక్క‌డి రైతులు పంట‌చేలలో సంక్రాంతి పండ‌గ చేసుకుంటారు!

అక్క‌డి రైతులు పంట‌చేలలో సంక్రాంతి పండ‌గ చేసుకుంటారు!

అక్క‌డి రైతులు పంట‌చేలలో సంక్రాంతి పండ‌గ చేసుకుంటారు!

సంక్రాంతి పండ‌గ‌ను మ‌న‌సారా ఆస్వాదించాలంటే ప‌ల్లెల‌కు పోవాల్సిందే అంటారు చాలామంది. అందులో నిజం లేక‌పోలేదు. ప‌ల్లెల్లో పండ‌గ అంటే సంప్ర‌దాయాల‌కు చిరునామా. అప్యాయ‌త‌ల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం. అలాంటి పండ‌గ‌లు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి.

ఒక చోట విగ్ర‌హాల‌ను పూజిస్తే.. మ‌రో చోట ప్ర‌కృతిని ఆరాధిస్తారు. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయేది అలాంటి ఓ అరుదైన సంప్ర‌దాయాన్ని పాటించే తెలంగాణాలోని ఓ ప్రాంతం గురించి. పాడిపంట‌ల‌ను కొలిచే సంక్రాంతి సంప్ర‌దాయం గురించి.. మ‌రెందుకు ఆల‌స్యం ఆ ప్రాంత‌పు సంక్రాంతి విశేషాల‌ను తెలుసుకుందామా!

సంక్రాంతి పండ‌గ‌ను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జ‌రుపుతారు. కొత్త‌బ‌ట్ట‌లు, పిండివంట‌లతో సంతోషంగా గ‌డిపేస్తారు. అయితే, ఆ సంతోషానికి కార‌ణ‌మైన పాడిపంట‌ల‌ను కోలుస్తున్నారు కామారెడ్డిలోని కొంద‌రు రైతులు. సంక్రాంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలోని నాలుగు మండలాల్లోని రైతులు పంట చేలలో ధాన్యలక్ష్మిని ప్రతిష్టించి మొక్కులు తీర్చుకుంటారు.

సంక్రాంతి సంద‌ర్భంగా ఏటా త‌మ ఆక‌లిని తీర్చి, త‌మ కోర్కెల‌ను నెర‌వేర్చే ప్ర‌కృతినే ఆరాధించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోన్న ఆచారంగా చెబుతున్నారు ఇక్క‌డి రైతులు. ఈ సంద‌ర్భంగా దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ‌స‌భ్యులు అంద‌రూ త‌ప్ప‌క హాజ‌ర‌య్యేలా ఏర్పాట్లు చేసుకుంటారు.]

sankranthi special

పంటచేలలో లక్ష్మీ దేవతను ప్రతిష్టించి..

నిజానికి, మహారాష్ట్రలోని రైతు కుంటుబాలు ఈ సంప్రదాయాన్ని ఆచ‌రిస్తారు. అయితే, ఆ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న తెలంగాణ‌లోని కామారెడ్డి జిల్లా బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్‌గల్‌ మండలాల్లో రైతులు ద‌శాబ్దాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం సంక్రాంతి రోజున రైతులు ఉదయాన్నే కుటుంబ సమేతంగా ఎడ్లబండి, వాహనాల్లో పంట చేలకు చేరుకుంటారు. పంటచేలలో లక్ష్మీ దేవతను తామే స్వ‌యంగా ప్రతిష్టించి, పూజ‌లు నిర్వ‌హిస్తారు.

అంతేకాదు, వ్యవసాయరంగంతో ముడిపడి ఉన్న పశువులనూ ఈ సంద‌ర్భంగా దైవంతో స‌మానంగా కొలుస్తారు. కొత్త‌బ‌ట్ట‌లు ధ‌రించి, కుటుంబ పెద్ద స‌మ‌క్షంలో పంట‌పొలాల విలువ‌ను భ‌విష్య‌త్తు త‌రాల‌కు చాటిచెప్పేలా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. సంక్రాంతి సంద‌ర్భాంగా జ‌రిగే ఈ వేడుకలో చిన్నాపెద్దా తార‌త‌మ్యం లేకుండా కుటుంబ‌స‌భ్యులంద‌రూ నియ‌మ‌నిష్ట‌ల‌తో పాలుపంచుకుంటారు.

Sankranti

పాడిపంటలు పుష్కలంగా పండాలని..

ఈ పూజా కార్య‌క్ర‌మంలో ఐదు రకాల కూరగాయలతో వంటలు, భక్షాలు చేసి నైవేద్యంగా పంట‌పొలంలో ప్ర‌తిష్టించిన ల‌క్ష్మీ దేవి ప్ర‌తిమ ద‌గ్గ‌ర పెడ‌తారు. అదే స‌మ‌యంలో ఇంటి ఆడ‌ప‌డుచులు ల‌క్ష్మీదేవి ప్ర‌తిమ ద‌గ్గ‌ర దీపం వెలిగిస్తారు. బంధుమిత్రులతో క‌లిసి, ఆ పంట చేలలో వనభోజనాలు చేస్తారు. దేవత ముందు వెలిగించిన దీపం ఆరిపోకుండా సాయంత్రం గంపలో పెట్టి, జాగ్ర‌త్త‌గా ఇంటికి తీసుకు వ‌స్తారు. అలా తెచ్చిన ఆ దీపంతో ఇంట్లో దీపాలను వెలిగిస్తారు.

ఆ దీపాల‌కు మొక్కుతూ త‌మ‌ పాడిపంటలు ఎప్పుడూ పుష్కలంగా పండాలని ప్ర‌కృతిని వేడుకుంటారు. నిజానికి, వ్య‌వ‌సాయ‌దారులైన ప‌ల్లెవాసులు త‌మ వ్య‌వ‌సాయ ప‌నుల‌న్నీ ఒక కొలిక్కి వ‌చ్చాక‌, పంట రాసులు ఇంటికి తీసుకువ‌చ్చే స‌మ‌య‌మే సంక్రాంతిగా భావిస్తారు. అందుకే, ప్ర‌కృతిని ఆరాదించ‌డమ‌నే సంప్ర‌దాయం ఈనాటిది కాదు. చుట్టూ ఉన్న‌ ప‌ర్యావ‌ర‌ణంతో మ‌నిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే ఈ రైతు కుటుంబాల‌కు సంక్రాంతి సంద‌ర్భంగా హ్యేట్సాఫ్ చెప్పాల్సిందే.

Read more about: kamareddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X