Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌పంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!

ప్ర‌పంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!

ప్ర‌పంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!

సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా పేరున్న పోచంపల్లి నూలు, పట్టు వ‌స్త్రాల‌కు ప్రసిద్ధి చెందింది. ఇటీవల పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందడంతో దేశ‌వ్యాప్తంగా పోచంప‌ల్లి పేరు మారుమ్రోగింద‌నే చెప్పాలి. తెలంగాణ‌లోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్​ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఆ గ్రామస్థుల కృషికి ఫ‌లితంగా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. ఆ నేప‌థ్యంలోనే దీన్ని బెస్ట్ టూరిజం విలేజ్​గా ఎంపిక చేసినట్లు యునైటేడ్​ నేషన్స్​ వరల్డ్​ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్​డబ్ల్యూటీవో) ప్రకటించింది.

పోచంపల్లి గ్రామంలో అడుగుపెడితే చాలు.. ఇంటాబయటా ఎక్క‌డ చూసినా అంద‌మైన‌ ముగ్గులు, ఇంటిలో మగ్గాలు ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇక్క‌డి పరిసర గ్రామాల్లో వేలమంది చేనేత ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ నేసిన దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆచార్య వినోబా భావే 'భూదాన' ఉద్యమ కార్యక్షేత్రంగా పోచంపల్లి చరిత్రలో నిలిచిపోయింది. గ్రామంలో పెద్దాచిన్నా, ఆడామగా అందరూ నేతవృత్తిలో తమ పాటవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వారు నేసే దుస్తులు, పనిచేసే విధానం పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించడంతో వివిధ దేశాలకు చెందిన అధికారుల బృందాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పోచంపల్లిని సందర్శిస్తుంటారు.

pochampalli

పచ్చ‌ని ప‌ల్లె వాతావ‌ర‌ణం..

అచ్చ‌మైన గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఆహ్లాదకరమైన గుట్టలు, లోయలు, పచ్చని చెట్లు, పొలాలు, చెరువులు పోచంపల్లిని సినిమా షూటింగ్‌లకు వేదికగా మార్చాయి. నిత్యం ఏదోఒక చోట షూటింగ్‌లు జ‌రుగుతూనే ఉంటాయి. ఇవి కూడా ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌న‌డంలో సందేహ‌మే లేదు. మ‌రీ ముఖ్యంగా శీతాకాలంలో ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు రెట్టింపు అవుతాయి. నిజానికి, పోచంపల్లి మూడు పేర్లతో ప్రసిద్ధి చెందింది. స్వాతంత్య్రానికి పూర్వం పోచంపల్లి నుంచి అరబ్ దేశాలకు గాజుల ఎగుమతి జరిగేది. దీంతో అప్పట్లో గాజుల పోచంపల్లిగా గుర్తింపు పొందింది. స్వాతంత్య్రం తర్వాత భూదానానికి బాటలు వేసి, దేశవ్యాప్తంగా భూదానోద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేయడం ద్వారా భూదాన్​ పోచంపల్లిగా పేరు పొందింది.

pochampalli

ప్ర‌పంచ ప్రసిద్ధి పొందిన క‌ళాకృతులు..

కాల‌క్ర‌మేనా పోచంపల్లి చేనేత దుస్తులకు పెట్టింది పేరుగా మారింది. ఇక్క‌డి చేనేత కార్మికుల చేతినుంచి జాలువారే అంద‌మైన క‌ళాకృతులు ప్ర‌పంచ ప్రసిద్ధి పొందాయంటే వారి ప్ర‌తిభ ఏపాటిదో అర్థ‌మైపోతుంది. అందుకే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందింది. అందుకే, ఇప్పుడీ గ్రామం టూరిజం విలేజ్ గానూ పేరు సంపాదించింది. చుట్టూ కొండలు.. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు.. మూసీ పరవళ్లు.. పంట పొలాలు.. అర్బన్ పార్క్.. శ్రీరామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్.. చేనేత బట్టల దుకాణాలు.. షాపింగ్ కు వచ్చే జనంతో పోచంపల్లి ఎప్పుడూ కళకళలాడుతూ క‌నువిందు చేస్తోంది. మ‌రెందుకు ఆల‌స్యం.. ఈ చారిత్ర‌క గ్రామంలో మీరూ అడుగుపెట్టండి.

ఇలా చేరుకోవాలి: యాదాద్రి నుంచి ముందుగా 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బీబీనగర్‌ చేరుకోవాలి. ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లో ఉన్న రైల్వే స్టేష‌న్ కూడా ఇదే. బీబీన‌గ‌ర్‌కు దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు అనుసంధానం ఉంది. అక్కడి నుంచి 16 కిలోమీట‌ర్లు ప్రయాణిస్తే పోచంపల్లి చేరుకోవచ్చు. ఇక్క‌డికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది.

Read more about: pochampalli telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X