• Follow NativePlanet
Share
» »ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి మన రాష్ట్రంలో ..!!

ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి మన రాష్ట్రంలో ..!!

Posted By: Staff

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంటే ... అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది మెదక్ చర్చి. ఇది ఆషామాషీ చర్చి ఏం కాదు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించారు. తెలంగాణ లోని మెదక్ లో జాతీయ రహదారి 44 పై హైదరాబాద్ కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఈ చర్చి ఉన్నది. ఇదొక అద్భుత సృష్టిగా, అపూర్వ కట్టడంగా చరిత్రకెక్కింది. ఆసియాలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరం ఇది. మరి ఇన్ని విశేషాలు కలిగిఉన్న ఈ చర్చి గురించి తెలుసుకుందాం పదండి !!

మెదక్ చర్చి

                                                                  మెదక్ చర్చి

                                                            చిత్రకృప : Myrtleship

మెదక్ చర్చి చరిత్ర

చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ఫాస్నెట్. ఇంగ్లాండ్ లో జన్మించిన అయన సప్త సముద్రాలు దాటి గోల్కొండ అనే పేరుగల నావలో చెన్నై చేరుకొని అక్కడ కొన్ని రోజులు సేవలు అందించి ... అప్పట్లో సువార్త ప్రచారం ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ వచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా క్రైస్తవ మత ప్రచారాలు చేయాలనే సంకల్పంతో ఫాస్నెట్ హైదరాబాద్ కు 100 కి. మీ ల దూరంలో ఉన్న మెదక్ ఎంపిక చేసుకొని .. అక్కడ ఒక పెద్ద చర్చిని నిర్మించాలని అనుకుంటాడు. వాటికన్ సిటీ చర్చి తర్వాత అతి పెద్దయిన ఈ చర్చి కి వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్.

మెదక్ చర్చి ప్రధానగోపురం

                                                           మెదక్ చర్చి ప్రధానగోపురం

                                                             చిత్రకృప : Myrtleship

నిజాం అనుమతి

ఫాస్నెట్ 180 అడుగుల ఎత్తులో చర్చి ప్రధాన గోపురం నిర్మించాలని అనుకుంటాడు. అందుకోసం నిజాం అనుమతి కొరకు దరఖాస్తు చేసుకుంటాడు. అయితే నిజాం ప్రభువు హైదరాబాద్ లోని చార్మినార్ ఎత్తు కంటే (175 అడుగులు) ఎక్కువ ఎత్తులో చర్చి నిర్మించేందుకు వీలులేదని చెబుతాడు.

ఇండియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనే ప్రదేశాలు !!

అందుకు అంగీకరించిన ఫాస్నెట్ చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగుల ఎత్తులో నిర్మిస్తాడు. చర్చి పొడవు 200అడుగులు, వెడలు 100 అడుగులు ఉంటుంది. ఫాస్నెట్ చర్చి కోసం 1000 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి, 200 నమూనాలు సేకరించి చివరికి ఏదైతే బాగుంటుందో తెలీక ఏసు క్రీస్తు ను ప్రార్థిస్తాడు. అతను పార్థన ముగించేసరికి గాలికి నమూనా 199 నమూనాలు ఎగిరిపోయి చివరకు ఒక నమూనా మాత్రమే మిగులుతుంది. ఇది దైవసంకల్పం గా భావించి ఆ నమూనానే ఎంపిక చేసుకుంటాడు ఫాస్నెట్. ఇప్పడు మనము చూస్తున్న నిర్మాణం కూడా అదే!!

మెదక్ చర్చి లోపలి భాగంమెదక్ చర్చి లోపలి భాగం

                                                            మెదక్ చర్చి లోపలి భాగం

                                                             చిత్రకృప : Myrtleship

గోతిక్ శైలి లో నిర్మాణం

చర్చి ప్రాచీన రోమ్ నిర్మాణ శైలి అయిన గోతిక్ శైలి లో నిర్మించారు. అద్భుతమైన పైకప్పులు, ప్రవేశ ద్వారాలు, ప్రాకారాలు, ఎత్తైన స్తంభాలు, ప్రధాన వేదికలు నిపుణుల పర్యవేక్షణలో ఎంతో కళాత్మకంగా నిర్మితమయ్యాయి. చర్చి లోపలి భాగం అంతా విదేశీ ఆడంబరాలు కనిపిస్తాయి. నేలపై పరిచిన బండలు, మార్బుల్స్, పైకప్పులు అంతా ఫారెన్ నుంచి తెప్పించిన పరికరాలతోనే అద్భుతంగా నిర్మించారు. వేసవిలోనూ ఈ బండలు చల్లగా ఉంటాయి. చర్చి లోపల ఎలాంటి రీసౌండ్ లు రాకుండా ఉండేందుకు రబ్బరు, పత్తి మరియు ఇతర రసాయనాలను ఉపయోగించారు.

గోవాలో క్రిస్టమస్ ! గోవా చర్చి లు !

మెదక్ చర్చి లో చూడవలసినవి అద్దాల కిటికీ లో క్రీస్తు జన్మవృత్తాంతం. క్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఎంతో కళాత్మకంగా, వివరణాత్మకంగా కళ్ళకు కట్టినట్లు చూపడం విశేషం. అంతేకాదు కలపతో చేసిన బెంచీలు, కుర్చీలు ఇక్కడి మరో ఆకర్షణ. వారానికోసారి అద్దాలను, ఫ్లోరింగ్ ను కిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో తుడుస్తారు. ఇందులో మొదట హిందీ వాక్యాలు ఉండేవి కాదట. విజయలక్ష్మి పండిట్ ఈ చర్చిని సందర్శించి హిందీ వాక్యాలు రాసేటట్లు చొరవచూపింది.

మెదక్ చర్చి ప్రాంగణం

                                                             మెదక్ చర్చి ప్రాంగణం

                                                             చిత్రకృప : Myrtleship

అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు

1924 డిసెంబర్ 25 న ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా అవతరించిన మెదక్ చర్చి లో క్రిస్మస్ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాలా !! ఆకాశాన్ని తాకే విధంగా సంబరాలు ఉంటాయి. క్రిస్మస్ వేడుకలలో పాల్గొనటానికి దేశ, విదేశాల నుంచి క్రైస్తవ సోదరులు, మత పెద్దలు హాజరవుతుంటారు. ఇందులో సుమారు ఒకేసారి 5000 మంది కూర్చొని ప్రార్థనలు చేయవచ్చు.

క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు ...హోటల్ లీలా పాలస్!

మెదక్ చర్చి ఎలా చేరుకోవాలి ?

మెదక్ చర్చి కి అన్ని విధాలా హైదరాబాద్ ఉత్తమం. ఇక్కడ ఒక ఎయిర్ పోర్ట్, మూడు రైల్వే స్టేషన్ లు (కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి) ఉన్నాయి మరియు చక్కటి బస్సు సదుపాయం కలిగి ఉన్నది. హైదరాబాద్ నుండి మెదక్ కు నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. మెదక్ బస్ స్టాండ్ లో దిగి అక్కడి నుంచి చర్చి కి ఆటోరిక్షాలో వెళ్ళవచ్చు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి