Search
  • Follow NativePlanet
Share
» »మ‌న‌సును బంధించే బ‌న్నెర‌ఘ‌ట్ట నేష‌న‌ల్ పార్క్‌!

మ‌న‌సును బంధించే బ‌న్నెర‌ఘ‌ట్ట నేష‌న‌ల్ పార్క్‌!

మ‌న‌సును బంధించే బ‌న్నెర‌ఘ‌ట్ట నేష‌న‌ల్ పార్క్‌!

entrancetobannerghattanationalpark

ప‌చ్చ‌ని ప్ర‌కృతి ప్ర‌పంచంలో స్వేచ్ఛ‌గా విహ‌రించే జంతుజాలాల మ‌ధ్య జ‌ర్నీ అంటే మాట‌ల్లో చెప్ప‌లేని అనుభ‌వ‌మే మ‌రి ! స‌ప్త‌వ‌ర్ణాలు అద్దుకున్న సీతాకోక చిలుక‌ల ఆత్మీయ ప‌ల‌క‌రింపులు ఇక్క‌డ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. బోనులో కూర్చోని క్రూర‌మృగాల ఆవాసంలోకి తొంగిచూసే అవ‌కాశం వ‌దులుకోలేం. బ‌న్నెర‌ఘ‌ట్ట నేష‌న‌ల్ పార్కులోని ఇలాంటి అనుభూతుల స‌మ్మేళ‌న‌మే మీకోసం..! బెంగుళూరులోని ఏదైనా ప్ర‌శాంత‌మైన ప్రాంతానికి టూర్ తీసుకెళ్ల‌మ‌ని నా స్నేహితుడిని ఫోన్‌లో అడిగాను. వాడు అప్ప‌టికే బెంగుళూరులో ఐదేళ్లుగా ప‌నిచేస్తున్నాడు. త‌ర్వాతి వారం త‌ప్ప‌కుండా ప్లాన్ చేస్తాన‌ని మాటిచ్చాడు. అన్న‌ట్లుగానే ఐదు రోజులు త‌ర్వాత ఫోన్ చేసి, వీకెండ్‌లో అక్క‌డికి వ‌చ్చేయ‌మ‌ని చెప్పి, ఫోన్ పెట్టేశాడు. ఎక్క‌డికి తీసుకువెళ‌తాడో చెప్ప‌కుండా నాకు స‌ర్‌ప్రైజ్ ఇద్దామ‌నుకున్నాడ‌ని అర్థ‌మైంది. హైద‌రాబాద్ నుంచి శుక్ర‌వారం రాత్రి బ‌య‌లుదేరి, ఉద‌యానికి బెంగుళూరు చేరుకున్నాను.మ‌నం బ‌న్నెర‌ఘ‌ట్ట నేష‌న‌ల్ పార్క్ కి వెళుతున్నాం అని చెప్పాడు. బెంగుళూరు సిటి నుంచి 22 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ జాతీయ ఉద్యాన‌వ‌నం దేశంలోనే తొలి సీతాకొక‌చిలుక పార్క్ హౌస్‌.

bannerghatta

స్వాగ‌తం ప‌లికిన ఆల‌య గోపురం..

ఉద‌యం 9.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరాం. జాతీయ పార్క్‌కు వెళ్లే మార్గంలోనే ఉన్న మీనాక్షి టెంపుల్‌ను చూడాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆల‌య ప్రాంగ‌ణం చాలాప్ర‌శాంతంగా ఉంది. దేవాల‌యంలో గోపుర శిఖ‌రాలు చాలా పెద్ద‌విగా ఉన్నాయి. అచ్చం మ‌ధురైలోని ప్ర‌సిద్ధి చెందిన మీనాక్షి ఆల‌యంలో మాదిరిగా క‌నిపించాయి. ఆల‌యం లోప‌లా సంద‌ర్శ‌కుల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ పెద్ద గోపురం ఉంది. ఆల‌య నిర్మాణ శైలి మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఆక‌ర్షించింది. కుటుంబ స‌మేతంగా వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌తో జ‌న‌క‌ళ సంత‌రించుకున్న‌ట్లు క‌నిపించింది. అక్క‌డ మాకు కోతుల బెడద కాస్త ఎక్కువ‌గా క‌నిపించింది. ఆల‌యం బ‌య‌ట ఉన్న చిన్న చిన్న షాపుల వ‌ద్ద కొన్ని అర‌టిప‌ళ్లు తీసుకుని , వాటికి అందించాం. అన్ని కోతులు ఉన్న‌ప్ప‌టికీ అవి మాతో మ‌ర్యాద‌పూర్వ‌కంగానే వ్య‌వ‌హ‌రించాయి. అక్క‌డే కాసేపు గ‌డిపాక మా త‌ర్వాతి గ‌మ్య‌స్తానాన్ని చేరుకునేందుకు ప్ర‌యాణాన్ని కొన‌సాగించాం.

butterlfypark

బోనులో ఉన్న‌ది జంతువులు కాదు!

కాసేప‌టికి బ‌న్నెర‌ఘ‌ట్ట నేష‌న‌ల్ పార్క్ ముఖద్వారం వ‌ద్ద‌కు చేరుకున్నాం. వీకెండ్ కావ‌డంతో ర‌ద్దీ ఎక్కువ‌గానే ఉంది. అప్ప‌టికే సంద‌ర్శ‌కుల‌ను ఎక్కించుకోవ‌టానికి బ‌స్సులు సిద్ధంగా ఉన్నాయి. బ‌స్సు ఎక్కిన త‌ర్వాత జంతువుల‌ను ద‌గ్గ‌ర నుంచి చూసేందుకు వీలుగా కిటికీల‌కు స‌మీపంలో కూర్చున్నాం. లోప‌ల పిల్ల‌ల కేరింత‌లు మొద‌లయ్యాయి. త‌ల, చేతులు బ‌య‌ట పెట్ట‌కుండా బస్సు కిటికీల‌కు గ్రిల్స్ ఏర్పాటు చేశారు. స‌ఫారీ స‌మ‌యంలో మేం చాలా స‌మీపంలో నుంచి సింహాలు, పులులు, జింక‌లు ఎలుగుబంట్ల‌ను చూశాం. ఆ స‌మ‌యంలో మాకు బోనులో ఉన్న‌ది జంతువులు కాదు మేమే అన్నంత ఫీలింగ్ క‌లిగింది. ఎందుకంటే అవి చాలా స్వేచ్ఛ‌గా విహ‌రిస్తూ క‌నిపించాయి మ‌రి! అలా రెండుగంటల పాటు మా స‌ఫారీ స‌ర‌దాగా గ‌డిచిపోయింది. చుట్టూ తిరిగిన త‌ర్వాత మ‌మ్మ‌ల్ని జూ ఎంట్రీ పాయింట్‌కు తిరిగి చేర్చారు.

bannerghatta-national-park

జంతు ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌..

అలా కాస్త ముందుకు వెళ్లాక జంతు ప్ర‌ద‌ర్శ‌న‌శాల ఎదురైంది. అక్క‌డ అనేక ర‌కాల జంతువులు, ప‌క్షులు, స‌రీసృపాలు క‌నిపించాయి. వాట‌న్నింటిలో న‌న్ను బాగా ఆక‌ర్షించింది మాత్రం నెమ‌లి. పురివిప్పిన నెమ‌లి అందాల‌ను చాలా ద‌గ్గ‌రి నుంచి చూశాను. ఆ క్ష‌ణాల‌ను మాటల్లో వ‌ర్ణించ‌లేను. అలా న‌డుచుకుంటూ పులులు ఉన్న స్థలం వైపు మా అడుగులు ప‌డ్డాయి. ఐదారు పులులు ఉన్నగుంపు క‌నిపించింది. ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ ప‌రుగులు తీస్తూ మ‌మ్మ‌ల్ని భ‌లే ఆక‌ట్టుకున్నాయి.

త‌ర్వాత దేశ‌, విదేశి సంత‌తికి చెందిన వివిధ ప‌క్షి జాతులు క‌నిపించాయి. రంగు రంగుల‌తో స్వేచ్ఛ‌గా విహ‌రిస్తూ మ‌మ్మ‌ల్ని స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిన అనుభూతుల‌ను పంచాయి. అక్క‌డినుంచి సీతాకోక‌చిలుక‌ల పార్క్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఈ పార్కును సుల‌భంగా గుర్తించొచ్చు. ప్ర‌వేశ ద్వారంలో ఒక రెక్క‌లు విప్పిన సీతాకోక‌చిలుక ఆకారంలో బొమ్మ ఉంటుంది. అక్క‌డ అన్ని వైపుల నుంచి సీతాకోక చిలుక‌లు చుట్టుముట్టి ఉన్నాయి. రంగు రంగుల సీతాకోక‌చిలుక‌ల తుళ్లింత‌లు మా చూపుల‌ను క‌ట్టిప‌డేశాయి. వాటిలా స్వేచ్ఛ‌గా విహ‌రించే అవ‌కాశం మ‌న‌కు ఉంటే ఎలా ఉంటుందో క‌దా! లోప‌ల అడుగుపెట్టింది మొద‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కు ఎన్నో మ‌ధుర‌జ్ఞాప‌కాల‌ను మూట‌గ‌ట్టుకుని, అయిష్టంగానే తిరుగు ప్ర‌యాణం అయ్యాం. మ‌ళ్లీ బెంగుళూరు వ‌స్తే త‌ప్ప‌నిస‌రిగా మ‌రోసారి బ‌న్నెర‌ఘ‌ట్ట నేష‌న‌ల్ పార్క్‌లో అడుగుపెట్టాల్సిందే అని నిర్ణ‌యించుకున్నాను. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రీ..!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X