బ్రైస్ కాన్యన్ నేషనల్ పార్క్ ఆ సహజ వ్యవసాయ భూమి

ప్రకృతి వైపరీత్యాల వల్లనో లేక కాలానుగుణంగా సంభవించిన పెను మార్పుల వల్లో ఏర్పడిన వింత ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా మారటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే, అలా మారిన ప్రాంతాలు ఖచ్ఛితంగా ప్రపంచ ఖ్యాతి పొందుతాయి అనేందుకు అమెరికాలోని దక్షిణ ఉతాహ్లో ఉన్న ఈ బ్రైస్ కాన్యన్ నేషనల్ పార్క్ ఉదాహరణ. మానవ నిర్మితం కాని ఓ అద్భుత సృష్టకి ఆ ప్రాంతం కేంద్రంగా మారింది. ప్రకృతి మలచిన సుందర దృశ్యం అక్కడ ఆవిష్కృతం అయింది. మరి, ఆలస్యం చేయకుండా అక్కడి విశేషాలను తెలుసుకుందామా.
ఎరుపెక్కిన సైన్యంలా

మనుషులు నిలుచున్నప్పుడు ప్రతిబింబించే ఆకారాన్ని పోలిన ఎర్రటి రంగురాళ్లతో ఈ ప్రదేశం నిండి ఉంటుంది. బౌల్ ఆకృతిలో ఏర్పడిన ఈ లోయ ప్రపంచ చిత్రపటంలో ఓ సుందర దృశ్య కావ్యమని చెప్పవచ్చు. ఎరుపు, పసుపు, గులాబి, నారింజ, బ్రౌన్ రంగుల్లో లెక్కకుమించి కనిపించే గుళ్లు, గోపురాలు, గుహలు, అంతఃపురాలను పోలిన ప్రకృతి చెక్కిన శిల్పాలు బ్రైస్ కన్యోన్ నేషనల్ పార్క్ లో సందర్శకుల మనసులను దోచేస్తాయి. వివిధ ఆకృత్తుల్లో, వినూత్నమైన శిల్పాలతో నిండి ఉండే ఈ సన్నటి లోయలో చిత్ర విచిత్రమైన రంగులతో రాళ్లన్ని గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంటుంది. కొన్ని మీటర్ల ఎత్తున్న ఇక్కడి ఆకారాలు దూర ప్రాంతాలనుంచి చూస్తే యుద్ధానికి సిద్ధమవుతోన్న భయంకరమైన ఎరుపెక్కిన సైన్యంలా కనిపిస్తుంది. ఈ పార్క్ విస్తీర్ణం అక్షరాలా 35,835 ఎకరాలు అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అరుదైన ఈ ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మంచులో తడిసిన రాళ్ల పుష్పాల వలె

ఇక్కడ ప్రభాత సమయంలో సూర్యకాంతి ప్రసరిస్తుందో లేదో తెలియదు గానీ .. సప్తవర్ణాల సమూహం ఒకే చోట ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు, మంచులో తడిసిన రాళ్ల పుష్పాల సౌందర్యం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అతి సూక్ష్మమైన కంటికి కనిపించని ఎన్నో నిక్షేపాలు దాగి ఉన్న కారణంగా ఏ మాత్రం వెలుతురు సోకినా సరే అనేక రంగులు ప్రసరిస్తూ ఆ ప్రాంతమంతా వింత శోభను కలిగిస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూడాలంటే సంధ్యా సమయం సరైనదిగా చెబుతుంటారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూక్షయం కారణంగా కొట్టుకొచ్చిన మాంగనీస్, ఐరన్ లాంటి నిక్షేపాలు రాతిపై ఒక పొరగా ఏర్పడడటం వల్ల ఈ పార్క్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడి రాతి పొరలపై నిత్యం ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏటా దేశవిదేశాల నుంచి ఈ పార్క్ సందర్శనకు పర్యాటకులు వస్తూ ఉంటారు.