Search
  • Follow NativePlanet
Share
» » మ‌న్యంలో మ‌రుపురాని దృశ్యాలు (రెండ‌వ భాగం) -2

మ‌న్యంలో మ‌రుపురాని దృశ్యాలు (రెండ‌వ భాగం) -2

మ‌న్యంలో మ‌రుపురాని దృశ్యాలు

eastgodavariforest

(రెండ‌వ భాగం)

మ‌రిన్ని మ‌న్యం అందాలు చూసేందుకు అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వలసంపేటకు ఆటోలో బయలుదేరాం. ఇక్కడే గాదిగుమ్మె జలపాతం ఉంది. వారాంతాలలో ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని రామరాజు చెప్పారు. మేం వెళ్లేసరికి ఎండ వేడిమి ఎక్కువగా ఉంది. బాగా నీరసించిపోయాం. అలాంటి సమయంలో నల్లని రాతిబండలపై నుంచి గలగలా జాలువారుతోన్న నీటి సవ్వడులు నీరసించిన మా ఉల్లాసానికి ఊపిరి పోసినట్లనిపించింది. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. అందరం చల్లని జలపాతంలో సేదదీరేలా ఆటలాడుకున్నాం. ఆ చ‌ల్ల‌ని స్వ‌చ్ఛ‌మైన నీరు మాలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువ‌చ్చింది. నీటి అడుగు భాగం చాలా స్ప‌ష్టంగా క‌నిపించింది. అక్క‌డి బండ‌రాళ్లు మొత్తం పాకుప‌ట్టి ఉన్నాయి. ఇటీవ‌ల వ‌ర్షాలు కుర‌వ‌డంతో జ‌ల‌పాతం ఉదృతంగా ఉంది. ఇక్క‌డి దిగువ ప్రాంతంలో చాలా ప్రమాదకరంగా ఉంటుందని అక్కడివారు చెప్పారు. ఆ ప్రాంతంలోనే పోలీసువారి హెచ్చరిక బోర్డులు కనిపించాయి. కుటుంబ స‌మేతంగా వ‌చ్చే సంద‌ర్శ‌కులు ఈ జ‌ల‌పాతం ద‌గ్గ‌ర చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏ చిన్న ప్ర‌మాదం జ‌రిగినా ఎమ‌ర్జెన్సీ స‌ర్వీస్ కోసం కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంద‌నే విష‌యాన్ని మ‌ర్చిపోవద్దు.

mangrovesanctuarypark-2

రాజ‌వొమ్మంగి పోలీస్ స్టేష‌న్‌..

అక్కడే మధ్యాహ్న భోజనం పూర్తిచేశాం. చెట్లగుంపుల మధ్య కాసింత విశ్రాంతి తీసుకుని, మళ్లీ కాసేపటికి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. అక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయ్యూరు మీదుగా రాజేంద్రపాలెం ఆటోలో చేరుకున్నాం. అల్లూరిని కాల్చి చంపిన ప్రదేశం అది. అక్కడే ఆయన జ్ఞాపకార్థం ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మ‌న్యంలో బ్రిటీష్ వారిని గ‌డ‌గ‌డ‌లాడించిన అల్లూరి చివ‌రి శ్వాస వీడిన ఆ ప్రాంతంలో అడుగుపెట్ట‌గానే మా రోమాలు నిక్క‌బొడిచాయి. అల‌నాటి చారిత్ర‌క ఘ‌ట్టం క‌ళ్ల‌ముందు మెద‌లాడిన ఫీలింగ్ క‌లిగింది. 27 ఏళ్ల వ‌య‌సులోనే ప్రాణ త్యాగం చేసిన ఆ విప్ల‌వ వీరునికి వంద‌నాలు చెప్పాం. కాసేపు అక్కడ కలియ తిరిగాక రాజవొమ్మంగి వెళ్లేందుకు బయలుదేరాం. అక్కడే అల్లూరి దాడి చేసిన పోలీస్‌స్టేషన్‌ ఉంది. అక్కడికి చేరుకున్నాక నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ కాకుండా పక్కనే పాతస్టేషన్‌ కనిపించింది. దాని లోపలకు మమ్మల్ని అనుమతించారు. ఇరవై నుంచి ముప్పై వరకూ అలనాటి చారిత్రక చిత్రపటాలను కనులారా చూశాం. మ‌న్యం ప్ర‌జ‌ల మాన‌, ప్రాణ ర‌క్ష‌ణ‌కు తెల్ల‌దొర‌ల‌ను ఎదిరించిన ఆ మ‌హా వీరుని సంగ్రామం గిరిజ‌న జాతికే కాదు, దేశానికే ఆద‌ర్శ‌ప్రాయం. అప్పటికే సాయంత్రం కావడంతో మా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం.

serenevistasofpapihills

ప్ర‌యాణంలో ఇవి గుర్తుంచుకోండి..

ఒక్కరోజులో ఇన్ని అనుభవాలను మూటగట్టుకు రావడం మా అందరికీ థ్రిల్లింగ్‌గా అనిపించింది. అయితే, చారిత్రక ప్రదేశాల మణిహారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు తుని, నర్సీపట్నం మీదుగా కూడా మార్గం ఉంది. సొంత వాహనాల్లో వస్తే సమయం ఆదా అవుతుంది. బస్సులో రావాలనుకునేవారు తిరుగు ప్రయాణంలో రాత్రి ఏడు గంటల తర్వాత బస్సు సౌకర్యం ఉండదని గుర్తుంచుకోవాలి. మంచినీటితో పాటు, స్నాక్స్‌, ఫుడ్‌ రాజవొమ్మంగి లేదా కృష్ణదేవీపేటలోనే సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు, విడిది చేసేందుకు రాజవొమ్మంగిలో చిన్న లాడ్జి సదుపాయం ఉంది. రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకూ ఛార్జ్‌ చేస్తారు. అలాగే, ఇటీవ‌లి కాలంలో ఈ ప్రాంతంలో పెద్ద‌పులి సంచ‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డికి ప్ర‌ణాళిక వేసుకునే ముందు అట‌వీ అధికారుల‌ను సంప్ర‌దించ‌డం ఎంతో ఉత్త‌మం. ప్రకృతి సోయగాల నడుమ చారిత్రక ప్రదేశాలను చుట్టేయాలి అనుకునేవారు ఆలస్యం చేయకుండా మీ జర్నీని మొదలుపెట్టండి!!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X