• Follow NativePlanet
Share
» »అమర్‌ కంటక్‌ జన్మస్థానమైన పాపాలను తొలగించే నర్మదా నది

అమర్‌ కంటక్‌ జన్మస్థానమైన పాపాలను తొలగించే నర్మదా నది

Posted By: Venkata Karunasri Nalluru

నర్మదానది అత్యంత పవిత్రమైన నది. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులను కలిపి త్రివేణి సంగమం అంటారు. త్రి అనగా మూడు, వేణి అనగా సంగమం. ఈ నదులలో జీవితంలో ఒక్కసారైనా స్నానం చేస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది. నర్మద జన్మస్థానమే అమర్‌ కంటక్‌. మధ్యప్రదేశ్‌లో వున్న ఈ ప్రదేశంలో అందమైన జలపాతాలు, శిల్పకళా వైభవంతో అలరారుతున్న దేవాలయాలు, ఎన్నెన్నో ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక భావాలను కలిగివున్నాయి.

ఇక్కడ అమోఘమైన వృక్ష సంపద వుంది. ఈ వృక్షాలలో ప్రధానంగా దేవదారు, సాల్, టేకు, దుగ్గిలం, కెండు వున్నాయి. ఎత్తౖన కొండలతో ఆకట్టుకునే పచ్చటి అరణ్య సౌందర్యం మీ ముందు కదలాడుతుంది. ఈ ప్రాంతమే అమర్ కంటక్. ఇది మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం నర్మదానదికి జన్మస్థలం. ఇక్కడికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అమర్ కంటక్ సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది.

narmada mata temple in amarkantak

PC: Sonu monu

స్థల పురాణం

narmada mata temple in amarkantak

PC: Kailash Mohankar

నర్మద నదిని భూమి మీద ప్రవహింపచేయుటకు పురూరవుడు తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. ఈ ప్రవాహాన్ని తట్టుకుని అడ్డుగా నిలిచే వారెవరని అడుగుతాడు శివుడు. అప్పుడు వింధ్య పర్వత రాజు, తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని శివునికి చెప్తాడు. వెంటనే శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదానది దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ.

మరెన్నో ఇతర పురాణాలు

ఈ ఆలయంకు ఇంకా ఎన్నో పురాణ కథలు వున్నాయి. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1042-1122 సం. మధ్యకాలంలో చేది రాజ్యాన్ని పరిపాలించే రాజు కర్ణదేవుడు నిర్మించినట్లు చరిత్రను బట్టి తెలుస్తుంది. చంద్రవంశరాజైన పురూరవ చక్రవర్తి తన పాపపరిహార మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరాడు. దివిలో వున్న నర్మదా నదియే పాప ప్రక్షాళన చేయగలదని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివినుంచి భువికి దిగివచ్చింది నర్మద. అలా అమర్ కంటక్ లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసి స్వర్గప్రాప్తి పొందాడు పురూరవుడు. అంతటి మహత్యం కలిగినది ఈ నర్మదా నది.

narmada mata temple in amarkantak

PC: Harminder singh saini

నర్మదా నది స్థానికంగా వున్న మైకల్ కొండల్లో పుట్టింది. వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల వరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో నర్మదా, తపతి నదులు ముఖ్యమైనవి.

నర్మదామాత గుడి

నర్మదా ఎక్కడ పుట్టిందో అక్కడే నర్మదామాత గుడి కూడా వెలసింది. నర్మదామాత గుడి ఎదురుగా పార్వతీదేవి ఆలయం వుంది. శివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుంది. ఇదే ఇక్కడ జరిగే అతి పెద్ద జాతర. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ అనేక జాతరలు జరుగుతాయి.

narmada mata temple in amarkantak

PC: Kailash Mohankar

వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు ఈ జాతరలకు తరలివస్తుంటారు. చాలామంది భక్తులు శివరాత్రికి రాత్రంతా ఇక్కడ జాగారం కూడా చేస్తారు. శివరాత్రినాడు నర్మదానదిలో పవిత్ర స్నానం చేసి శివుడిని దర్శించుకుని తరువాత నర్మదామాతను పూజిస్తారు. ఇక్కడ నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ చూడవలసినవి

కపిలధార

narmada mata temple in amarkantak

PC: Aditya thaokar

అమర్ కంటక్‌ నుంచి కపిల ధార 6 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ కపిల ధార వద్ద నర్మదానది ఒక లోయ గుండా ప్రవహిస్తుంటుంది. ఇక్కడ జలపాతం 100 అడుగుల ఎత్తు నుంచి ఓంకార శబ్దం చేస్తూ పడుతుంది. ఈ నాదం ఎంతో ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది. ఈ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.

narmada mata temple in amarkantak

PC: youtube

ఆలయ ప్రాంగణంలో రాతితో చెక్కినటువంటి ఏనుగుబొమ్మ ఉంటుంది. ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి వెళ్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఏనుగుపైన అంబారీ ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తలలేకుండా మొండెం మాత్రమే ఉంటుంది. ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయిందని ఇక్కడ చెప్తారు.

శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికీ బగియా గా వ్యవహరించే దేవతావనం, యంత్ర మందిరం మొదలైనవి కూడా ఇక్కడ ఆలయానికి దగ్గరలో చూడవచ్చును. యంత్ర మందిరానికి దగ్గర్లో సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతాలనూ చూడవచ్చును.

ఇక్కడకు చేరుకోవటం ఎలా

విజయనగరం నుంచి కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో బిలాస్‌పూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి మరో రైల్లో పిండ్రా వరకు వెళ్లి అద్దె వాహనాల్లో అమర్ కంటక్ వెళ్లవచ్చు. బిలాస్‌పూర్ నుంచి నేరుగా ట్యాక్సీలో వెళ్తే అమర్ కంటక్ చేరుకొనుటకు 120 కిలోమీటర్ల దూరం పడుతుంది.

Read more about: నది river

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి