» »మన భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గాలు ఇవే

మన భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గాలు ఇవే

Written By: Venkatakarunasri

ఇప్పటివరకు మనము భారతదేశంలో ఎన్నో రోడ్ ట్రిప్ లకు వెళ్ళి ఉంటాం లేక రోడ్డు ప్రయాణాలు చేసి ఉంటాం అవునా ? ఏ చిన్నపాటి లోయ వచ్చినా (ముఖ్యంగా ఘాట్ రోడ్ ప్రయాణాలు), స్పీడ్ బ్రేకర్ వచ్చినా కాస్త జాగ్రత్తగా వెళుతుంటారు ఇది మనకైతే సరిపోతుంది కానీ కొంత మంది బైక్ సాహసికులు ఇవేవి ఇష్టపడరు. వారికి కావాల్సిందల్లా డేంజర్ రూట్లు. వారికి ఆ రూట్లలోనే స్వర్గం కనిపిస్తుంది.

భారతదేశంలో రహదారుల పాత్ర కీలకం. దేశ రవాణా లో అగ్ర భాగం ఈ రహదారులదే. ఇండియాలో మొదట ప్రారంభమయ్యింది రహదారులు .. తర్వాత రైలు, విమానాలు, షిప్ లు వచ్చాయి. పూర్వం రాజులు సైతం రహదారుల గుండా ప్రయాణించేవారట. కొన్నేళ్ళకు సముద్రమార్గం కనుక్కోవడంతో ఇతర దేశాలతో వర్తకం సాగించారు మన భారతీయులు. బ్రిటీష్ వారు వచ్చాక 1853 లో మొట్టమొదట రైలు మార్గం (ముంబై -థానే) వాడుకలో వచ్చింది మరియు నేడు విమానాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మన భారతదేశంలో రోడ్డు, రైలు, విమాన మరియు జల మార్గాలు ఉన్నాయి.

భారతదేశంలో అందమైన రోడ్డు మార్గాలతో పాటు కొన్ని డేంజర్ రూట్లు ఉన్నాయి. ఇక్కడకు దేశ, విదేశాల నుంచి సాహసికులు వచ్చి బైక్ అద్దెకు తీసుకొని సాహసాలు చేస్తారు మరియు బైక్ రేసింగ్ లు నిర్వహిస్తారు. గెలిచిన వారికి ట్రోఫీలు, నగదు బహుమతులు, సన్మానాలు అందజేస్తారు.

ఇండియాలో ఆ డేంజర్ రూట్లు ఎలా ఉంటాయో ? ఎక్కడ ఉన్నాయో ? తెలుసుకుందాం పదండీ

కిల్లర్-కిష్త్వార్

కిల్లర్-కిష్త్వార్

పెద్ద కొండల మద్య చిన్న పాయగా కొండను తొలిచి ఈ కిల్లర్-కిష్త్వార్ రహదారిని నిర్మించారు. రహదారి నుండి దృష్టి కాస్త ప్రక్కకు మరళిందా బ్రతికే అవకాశాలు చాలా తక్కువ.

చిత్రకృప : Gaurav Madan

జోజిలా పాస్

జోజిలా పాస్

ఇది జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎత్తైన పర్వత మార్గం. సముద్రమట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఇరుకైన రహదారి ఇండియాలోనే అత్యంత ప్రమాదకరమైనది. ఎప్పుడు ఎటువైపునుంచి ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలీదు. జీవితం మీద విరక్తి చెందిన వారు బహుశా వెళ్ళవచ్చు !!

చిత్రకృప : Anwaraj

చాంగ్ లా చాంగ్ లా

చాంగ్ లా చాంగ్ లా

లడక్ లో ఉన్న మరో ఎత్తైన రహదారి. సముద్రమట్టానికి 17590 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దయచేసి ఈ రోడ్ మార్గం గుండా ప్రయాణించకండి లేదా వెంట మెడికల్ కిట్లు, ఉన్ని దుస్తులు తీసుకెళ్లండి.

చిత్రకృప : SlartibErtfass der bertige

శ్రీశైలం ఘాట్ రోడ్

శ్రీశైలం ఘాట్ రోడ్

శ్రీశైలం ఘాట్ రోడ్ కు దయ్యాల మలుపు అనే పేరుంది. ఇక్కడ నిత్యం ఎదో ఒక రూపంలో యాక్సిడెంట్ లు జరుగుతుంటాయి. ఈ ఘాట్ రోడ్ మలుపుల వద్దకు వస్తే మీ స్టీరింగ్ అదుపుతప్పడం ఖాయం.

నెరల్ - మథేరన్

నెరల్ - మథేరన్

నెరల్ - మథెరన్ రహదారి పామువలె మెలికలు తిరిగి ఉంటుంది. ముంబై నుండి సాహసికులు వచ్చి ఈ ఇరుకైన రోడ్డు మార్గంలో బైక్ రేసింగ్ వంటి అడ్వెంచర్స్ చేస్తుంటారు. ఈ రహదారిలో మీకు డ్రైవ్ చేయటం ఇష్టం లేకపోతే టాక్సీలు అద్దెకు దొరుకుతాయి.

చిత్రకృప : G Karunakar

జాతీయ రహదారి 22

జాతీయ రహదారి 22

నేషనల్ హైవే 22 కు భారతీయ రోడ్డు మార్గాలలో ప్రత్యేక స్థానం ఉన్నది. దీనిని కొండలను తొలిచి నిర్మించారు. మధ్యమధ్యలో గుహలు, మరోవైపు లోయలు వస్తాయి. మీ వాహనానికి ఎదురూగా మరో వాహనం వచ్చిందా ? ఇక అంతే. కాబట్టి ఈ దారి గుండా ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి.

చిత్రకృప : Biswarup Ganguly

లేహ్ - మనాలి హైవే

లేహ్ - మనాలి హైవే

లేహ్ మనాలి హై వే ఉత్తర భారతదేశంలో రెండు ప్రాంతాలను కలిపే రహదారి. సంవత్సరంలో సగం రోజులు మంచుతో, మిగితా రోజులు ఎండ వేడిమితో కప్పబడి ఉంటుంది ఈ ప్రాంతం. ముందే ఈ రోడ్డు ఇరుకుగా ఉంటుంది. ఎరురుదురుగా రెండు భారీ వాహనాలు వచ్చాయా ? ఇక అంతే సంగతులు. ఒకటి ఆగి, మరోదానికి దారి విడవాల్సిందే !

చిత్రకృప : Biswarup Ganguly

మన్నార్ రహదారి

మన్నార్ రహదారి

మున్నార్ రహదారి పొడవు 85 కి. మీ. దట్టమైన అడవులు, తేయాకు తోటలు, మెలికలు తిరిగిన రోడ్డు మార్గం ఈ రోడ్ ప్రత్యేకత. అన్నామలై హిల్స్, పళని కొండలు మరియు మూడు రక్షిత ప్రాంతాలను దాటుకొని వెళ్ళాలి. అయితే వేగంగా దూసుకొచ్చే బైక్ లతో చాలా జాగ్రత్త.

చిత్రకృప : Kamaljith K V

గటా లూప్స్

గటా లూప్స్

ఇది ఆత్మల రహదారి. లేహ్ - మనాలి మార్గంలో ఉన్నది. 21 మలుపులు ఉన్న ఈ రహదారి వద్ద అనుకోకుండా ఒక ఫారెన్ టూరిస్ట్ మరణించాడు. ఇప్పుడు అతని ఆత్మే ఈ ప్రాంతంలో సంచరిస్తుందని అంటారు. ఇక్కడికి వెళ్లేవారు సిగరెట్లు, మద్యం, సోడా, తాగునీరు, ఆహార పదార్థాలు సమర్పించుకుంటారు మరి ఎంతైనా ఫారెన్ టూరిస్ట్ ఆత్మ కదా!

చిత్రకృప : ManoharD

తిరుపతి ఘాట్ రోడ్డు

తిరుపతి ఘాట్ రోడ్డు

ప్రపంచంలో తిరుపతి కి ఎంత పేరుందో, తిరుమల ఘాట్ రోడ్ కు అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ ఘాట్ రోడ్ గుండా అత్యంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఆదమరిస్తే పెను ప్రమాదం సంభవిస్తుంది. ఇక్కడ రద్దీ ఎక్కువ కనుక వేగాన్ని నియంత్రణలో ఉంచుకొని దైవ దర్శనం చేసిరండి.

చిత్రకృప : Magentic Manifestations

నాతు లా పాస్

నాతు లా పాస్

నాతు లా పాస్ సిక్కిం - చైనా టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో కలదు. ఇది సముద్ర మట్టానికి 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాంగ్టక్ నుంచి తూర్పు దిశగా 54 కి. మీ ల దూరం వెళితే ఈ పాస్ చేరుకోవచ్చు. వింటర్ లో మంచుచే కప్పబడి ఉంటుంది. డ్రైవింగ్ చేసేవారు ముందతు అనుమతి తప్పక తీసుకోవాలి.

చిత్రకృప : Indrajit Das

కిన్నౌర్ రహదారి

కిన్నౌర్ రహదారి

కిన్నౌర్ రహదారి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఇక్కడి లోయలు, మంచుచే కప్పబడిన పర్వతాలు, పండ్ల తోటలు మొదలుగునవి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చాయి. ఈ రహదారి సముద్రమట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉంటుంది. వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉంది.

చిత్రకృప : Sanyam Bahga

రాజమాచి

రాజమాచి

రాజమాచి హై వే సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ రహదారి రాళ్ళూ, గుట్టలతో నిండి ఉంటుంది. వేసవిలో రోడ్డు ఫర్వాలేదనిపించినా .. వర్షాకాలంలో చిత్తడి చిత్తడి గా ఉంటుంది. బైక్ లు, ట్రెక్కర్లు జారిపడే అవకాశాలు ఎక్కువ.

చిత్రకృప : ptwo

కిస్త్వారా - కైలాష్

కిస్త్వారా - కైలాష్

కిస్త్వారా - కైలాష్ రహదారి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలదు. ఇదొక వన్ వే రోడ్. వాహనాలు వస్తే అటువైపునుంచైనా రావాలి లేదా ఇటువైపు నుంచైనాపోవాలి. రెండూ ఎదురెదురు పడ్డాయా ? లోయలో పడవలసిందే !

కర్దంగా లా పాస్

కర్దంగా లా పాస్

లడక్ నుంచి నుబ్రా వాలీ చేరాలంటే కర్దంగ్ లా పాస్ ఒక్కటే మార్గం. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రోడ్ మార్గం గా (18,380 అడుగులు) ప్రకటించారు. బైక్ రైడర్లు, సైక్లింగ్ చేసేవారు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ రోడ్ మీద ప్రయాణించాలని అనుకుంటారు.

చిత్రకృప : Steve Evans

త్రీ లెవల్ జిగ్ జాగ్ రోడ్

త్రీ లెవల్ జిగ్ జాగ్ రోడ్

త్రీ లెవల్ జిగ్ జాగ్ రోడ్డు, సిక్కింలో కలదు. ఈ రహాదారి ప్రపంచంలోని అమేజింగ్ రోడ్ లలో ఒకటి. దీని మొత్తం పొడవు 30 కి.మీ. మరియు 100 మలుపులు తిరిగి ఉంటుంది. కొన్ని బాలీవూడ్ చిత్రాలలో ఈ రహదారిని చూడవచ్చు.