
విశాఖ టు థాయ్‌ల్యాండ్ టూర్ ప్లాన్ చేసిన ఐఆర్‌సిటిసి
నిత్యం ప్రయాణీకులను ఆకర్షించేందుకు సరికొత్త ప్యాకేజీలు పరిచయం చేసే ఐఆర్‌సిటిసి మరో ఆఫర్‌ను ప్రకటించింది. విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్ వెళ్లి, బ్యాంకాక్, పట్టాయా లాంటి పర్యాటక ప్రదేశాలకు ప్రయాణం చేసేలా ప్లాన్ చేసింది. ఈ సరికొత్త ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పర్యాటక ప్రేమికుల విహారం కోసం చాలా ఎంపికలు ఉంటాయి. అలాంటివారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం విభాగం ఐఆర్‌సీటీసీ టూరిజం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఇప్పుడు దేశంలోని పర్యాటక ప్రాంతాలకు మాత్రమే కాకుండా విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్స్‌కి కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తూ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నానికి తెరలేపింది. థాయ్‌ల్యాండ్ వెళ్లాలనుకునేవారి కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంటి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్‌కు ఫ్యాసినేటింగ్ థాయ్‌ల్యాండ్ పేరుతో విమానయాన ప్రయాణానికి ప్యాకేజీని విడుదల చేసింది.

బ్యాంకాక్, పట్టాయాలను కూడా చుట్టేసే అవకాశం
ఈ సరికొత్త టూర్ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయాలను కూడా చుట్టేసే అవకాశం ఉంది. మొత్తం ఐదు రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీగా వెళ్లడించింది ఐఆర్‌సిటిసి. మొదటివిడతగా డిసెంబర్ 8న టూర్ ప్రారంభం కానుంది. వైజాగ్ నుంచి థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ వివరాలను పరిశీలిస్తే.. ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ ధర వివరాల ప్రకారం ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.
63,310 చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, పట్టాయాలో రెండు రాత్రులు, బ్యాంకాక్‌లో ఒక రాత్రి బస, బ్రేక్‌ఫాస్ట్, రెండు రోజులు డిన్నర్, లంచ్, అల్కజార్ షో, స్పీడ్ బోట్‌లో కోరల్ ఐల్యాండ్, సఫారీ వాల్డ్, మెరైన్ పార్క్, హాఫ్ డేబ్యాంకాక్ టెంపుల్ సిటీ టూర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పర్యాటకులు వీసా ఆన్ అరైవల్ కోసం ఒకరికి 2000 థాయ్ భట్ చెల్లించాలి.

టూర్ ఇలా సాగుతుంది..
ముందుగా విశాఖపట్నంలో ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ మొదటి రోజు ఉదయం ప్రారంభమవుతుంది. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే అర్థరాత్రి 1.55 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడ నుంచి పట్టాయా బయలుదేరాలి. రెండో రోజు మధ్యాహ్నం నాంగ్ నూచ్ గార్డెన్ టూర్ సందర్శన ఉంటుంది. సాయంత్రం అల్కజార్ షో చూడొచ్చు. రాత్రికి పట్టాయాలో విడిది చేయాలి. మూడో రోజు పట్టాయా సందర్శన ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ మీదుగా కోరల్ ఐల్యాండ్ తీసుకెళ్తారు. మధ్యాహ్నం ఇండియన్ రెస్టారెంట్‌లో లంచ్ ఉంటుంది.
సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి పట్టాయాలో బస చేయాలి. నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ వెళ్లాలి. బ్యాంకాక్ చేరుకున్న తర్వాత సఫారీ వాల్డ్ టూర్ ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్‌లో బస చేయాల్సి ఉంటుంది. ఐదో రోజు బ్యాంకాక్ హాఫ్ డే టూర్ ఉంటుంది. గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ చూడొచ్చు. సాయంత్రం షాపింగ్ కోసం సమయం ఉంటుంది. రాత్రికి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. బ్యాంకాక్‌లో అర్ధరాత్రి 2.55 గంటలకు బయల్దేరితే ఆరో రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.