Search
  • Follow NativePlanet
Share
» »చిర‌పుంజి శీతాకాల‌పు అందాలను వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మే!

చిర‌పుంజి శీతాకాల‌పు అందాలను వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మే!

చిర‌పుంజిలో శీతాకాల‌పు ప‌ర్యాట‌క‌ అందాలను వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మే!

శీతాకాలంలో మంచుదుప్పటితో ముసుగేసిన భానుడిని కిలకిలారావాలతో లే లేమ్మని మేల్కొలిపే పక్షుల సందడి చిర‌పుంజిలో స‌హ‌జమే. ప‌చ్చ‌ని అడవిని ఆక్రమించి తెల్లని మంచు ఆడే వయ్యారాల సయ్యాటలు క‌నువిందు చేస్తాయి. నిజానికి, మేఘాలయ! పేరు వినగానే ఆకాశాన్నంటే నల్లని మేఘాలు గుర్తుకొస్తాయి. అదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న చిరపుంజి పేరు వినగానే చిటపట చినుకుల సవ్వడులు వినిపిస్తాయి.

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వర్ష ప్రాంతంగా చిరపుంజిని చెప్పుకునేవారు. కానీ, పక్కనే ఉన్న మాసిన్రామ్‌ చిరపుంజికి రెండోస్థానం వచ్చేలా చేసింది. అయినా, ఇప్పటికి చిరపుంజి చాలా ప్రసిద్ధిగాంచిందే ! ఎందుకంటే, చాలా ప్రాంతాల్లో వర్షపు కొలతను మిల్లీమీటర్లలో కొలుస్తారు. కానీ, ఇక్కడ వర్షపు కొలతను మీటర్లలో కొలుస్తారు. అలాంటి ప్ర‌కృతి ప్ర‌సాదించిన చిర‌పుంజి అందాల‌ను ఆస్వాదించేందుకు మేం చేసిన ప్ర‌యాణ‌పు ముచ్చ‌ట్లు మీకోసం..

nokalikai

గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చిరపుంజికి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసిన్రామ్‌ వర్షపాతంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. షిల్లాంగ్ నగరాన్ని వీక్షించిన తర్వాత ఒకరోజు చిరపుంజిని కూడా చుట్టేయాలని ప్రణాళికలు వేసుకున్నాం. చిరపుంజినీ చూడాలని అనుకున్న వెంటనే షిల్లాంగ్ పోలీసు బజార్‌లో ఉన్న మేఘాలయ ప్రభుత్వ టూరిజం కార్యాల‌యాన్ని సంప్రదించి, ఒకరోజుకు టూర్ బస్‌ను బుక్ చేసుకున్నాం. టికెట్ ధర ఒక్కొక్కరికి నాలుగువేల‌ రూపాయలు.

అక్కడి నుంచి ప్రయివేట్ ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. షిల్లాంగ్ నుంచి చిరపుంజి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న రహదారి ప్రయాణంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ చిరపుంజికి చేరుకోవాలనే ధ్యాసే మర్చిపోతారు. షిల్లాంగ్ పట్టణం నుంచి బయటికి రాగానే పచ్చదనం పరుచుకున్న కొండ మార్గాలు మాకు తారసపడ్డాయి. అక్కడ కనిపించే ప్రతి ఒక్క చెట్టూ క్రిస్మస్ చెట్టులా కనిపించింది. ఇంకా చెప్పాలంటే మేఘాలయంతా ఒక తోటలా అనిపిస్తుంది.

cherrapunji

లోయల స్వాగతం

షిల్లాంగ్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్లు వెళ్లగానే లోతైన లోయ ఒకటి ఎదురైంది. దానిపై ఒక వంతెన కూడా ఉంది. ఆ వంతెన పేరు డ్యూవన్ సింగ్ సిమ్ బ్రిడ్జ్. ఈ వంతెన కింద పెద్ద నదులేమీ లేకపోయినా చిన్న చిన్న కాలువలు, చెరువులు కనిపించాయి. షిల్లాంగ్ నుంచి చిరపుంజి వెళ్లే దారిలో ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యమైనది. చూడదగ్గ ప్రాంతం అని చెప్పుకోవాలి. ఇక్కడికి ఏటా చాలా మంది పర్యాటకులు వస్తుంటారని అక్కడి వారు చెప్పారు. అక్కడికి కొంత దూరంలో రెండు వైపులా పచ్చదనంతో నిండిన పర్వతాలు మధ్యలో చాలా లోతైన మరో లోయ ఆహ్వానం పలికింది.

ఈ లోయ పేరు మెక్డోక్‌ లోయ. ఈ లోయ సంవత్సరంలోని ఎక్కువ నెలలు దట్టమైన మేఘాల‌తోనే నిండి ఉంటుంది. నాలుగుదిక్కులా ఆ సుందరదృశ్యాలను చూస్తే అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి మనసొప్పలేదు. ఆ లోయ నుంచి కొంత దూరం కిందికి దిగి, వ్యూపాయింట్‌ను చేరుకున్నాం. అక్కడి చల్లని స్వచ్ఛమైనగాలి శరీరాన్ని తాకుతూ ఉంటే, లోయ అందాలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

chera

సెవెన్ సిస్టర్స్ జలపాతం

మెక్డోక్ లోయ నుంచి చిరపుంజి సుమారు 20-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ, దారిపొడవునా ఇలాంటి దృశ్యాలను ఎన్నో వీక్షించవచ్చు. చిరపుంజి గురించి మీరు ముందుగా వివరాలు తెలుసుకుని ఉంటే మీ మనసులో సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ కదలాడతాయి. చిరపుంజి కంటే ముందే మాకు సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ గుర్తుకొచ్చాయి. కానీ, దీనికంటే ముందు అక్కడ ఓ పార్క్ ఉందని అక్కడివారు చెప్పారు. దాన్ని చూడాలని అనుకున్నాం. దాని పేరు ఎకో పార్కు. ఇక్కడి నుంచి చిరపుంజికి వెళ్లేమార్గంలో ప్రకృతి సోయగాలను చేరువచేసే ఎన్నో లోయలు దర్శనమిస్తాయి.

ఈ సీజ‌న్‌లో ఇక్కడి ప్రతి ఒక్క ప్రాంతం అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడినుంచి మా ప్రయాణం సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ వైపుగా సాగింది. అక్కడవున్న ఓ లోయవైపు నిలబడ్డాం. అక్కడి నుంచి ఒక్కభాగం మాత్రమే మాకు కనిపించింది. అందనంత ఎత్తున ఆ జలపాతం పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం. సెవెస్సిస్టర్స్ జలపాతం అందాలు చూడాలంటే ఈ సీజన్ సరైన సమయం అని అర్థమైంది.

chirapunji

సరిహద్దు అందాలు!

చిరపుంజి మేఘాలయ దక్షిణ భాగంలో బంగ్లాదేశ్‌ను ఆనుకొని ఉంటుంది. అందుకే, ఇక్కడి లోయల ముందు ఉండే సమతల భూభాగం కాస్త మబ్బుగా కనిపిస్తుంటుంది. అది బంగ్లాదేశ్ భూభాగం. మనదేశంలో ఉండి, ఇతర దేశాన్ని చూడ్డానికి మాలాగే చాలామంది పర్యాటకులు అక్కడికి చేరుకున్నారు. అందరూ వారి వారి కెమెరాలలో ఆ దృశ్యాన్ని బంధించసాగారు. కానీ, వాతావరణం కారణంగా అస్పష్టంగానే కనిపించాయి అక్కడి ప్రాంతాలు. చిరపుంజి పరిసరాలనుంచి చూస్తే కనిపించే బంగ్లాదేశ్ ప్రాంతాలు చాలానే ఉన్నాయని అక్కడివారు చెప్పారు. ఎకో పార్కు నుంచి బయటిరాగానే నా దృష్టి అక్కడే ఉన్న ఒక బోర్డుపై పడింది.

ఆ బోర్డులో మిస్సింగ్ ఫాల్స్ అని రాసివుంది. దానికిందే బావిలా కనిపించే జలాశయం ఒకటి కనబడింది. భూభాగం కింది నుంచి ఓ ప్రవాహం అది. భూమి అంతర్భాగం నుంచి వస్తున్న ఇలాంటి జలాధారలను మొదటిసారి చూశాం. అలా దాక్కుని ఉండటం వల్లే దీన్ని మిస్సింగ్ ఫాల్స్ లేదా రహస్య జలపాతం అని పిలుస్తారని మాకప్పుడు అర్థమైంది. అలా ముందుకు వెళ్లగానే చిరపుంజిలోని ఇంకో ముఖ్యమైన జలపాతం ఒకటి కనిపించింది. అదే నహకళికాలి జలపాతం.

ఈ జలపాతం ఆవిర్భావం వెనక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. జలపాతం దగ్గరికి వెళ్లడానికి దారి సరిగా లేదు. దూరం నుంచే చూసి తిరిగి వచ్చాం. అక్కడే ఓ చిన్న రెస్టారెంట్ లాంటిది ఉంది. అక్కడే మా మధ్యాహ్న భోజనం కానిచ్చేశాం. అక్కడినుంచే జలపాతం చూడ్డానికి ఓ వ్యూపాయింట్ ఉంది. దానినుంచి ఎగసిపడుతోన్న జలపాతాన్ని చూస్తే ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ దృశ్యాన్ని బయటి నుంచి కూడా వీక్షించవచ్చు. కానీ, చాలామంది బ‌స్ దిగ‌గానే వ్యూపాయింట్‌కి వెళ్లి మరీ చూస్తుంటారు. తిరుగు ప్రయాణానికి ముందు మళ్లీ సెవెన్సిస్టర్స్ వాటర్ ఫాల్స్ దగ్గరకి వెళ్లాం. చిరపుంజిలో రాత్రి ఉండడానికి ఎలాంటి వసతీ లేదు. అందుకే, కొండ అంచుల్లోంచి, మేఘాలను చీల్చుకుంటూ లోయల సోయగాలకు వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణ‌మ‌య్యాం.

Read more about: chirapunji meghalaya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X