
విహారయాత్రలో భాగంగా వివిధ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నీళ్లు కనిపిస్తే చాలు. మనలో ఓ కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. వెంటనే జలపాతాలైనా, బీచ్ అయినా సరదాగా ఈత కొడుతూ ఉల్లాసంగా గడపాలని ఆశపడతాం. అలాంటి సమయంలో మనకు స్విమ్మింగ్ వచ్చా? రాదా? అక్కడి లోతు ఎంటుంది? ఇలాంటి విషయాలు అస్సలు గుర్తుకురావు. అలాగే చిన్నపిల్లలకు స్విమ్మింగ్ అంటే చెప్పలేనంత ఇష్టం. పేరేంట్స్ తమ పిల్లల్ని స్విమ్మింగ్కి తీసుకెళ్లేటప్పడు ఒక్కోసారి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

నీటిలో మునిగిపోవడం, ఎక్కువ లోతు నుంచి నీటిలోకి జంప్ చేసేటప్పడు గాయాల బారినపడడం వంటి సంఘటనలు టూర్లలో నిత్యకృత్యంగా మారిపోయాయి. అలాంటి ప్రమాదాల బారినపడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. విహార యాత్ర విషాదయాత్రగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా.- బీచ్లకు, స్విమ్మింగ్ ఫూల్కి వెళ్లే సమయంలో తమ వెంట లైఫ్ జాకెట్స్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. వాటి వినియోగంపై ముందుగానే అవగాహన పెంచుకోవడం మంచిది. లైఫ్ జాకెట్స్ సహాయంతో ప్రాణాలు కాపాడుకున్న సందర్భాలు మనం చాలానే చూస్తుంటాం.

- అలాగే బీచ్లో ఎక్కువమందితో కలిసి పిల్లలు స్విమ్ చేస్తున్న సమయాల్లో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

- సముద్ర తీరప్రాంతాల్లో కెరటాలకు ఇసుక మేటలు వేస్తుంది. అలాంటి ప్రాంతాలలో గోతులు ఏర్పడతాయి. ఆ గోతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బీచ్లో స్విమ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న లోతు గురించి అవగాహనతో వ్యవహరించాలి. స్థానికుల్ని లేదా అధికారులను సంప్రదించడం ఉత్తమం.- విహార సమయంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్స్ను వెంటబెట్టుకు వెళ్లడం మర్చిపోవద్దు.

- బీచ్లలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కెరటాల తీవ్రత ఉంటుంది. అందువల్ల వాతావరణ పరిస్థితుల్ని గమనంలో ఉంచుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయాల్లో బీచ్ పర్యటన చాలా ప్రమాదకరం.

- అలాగే జలపాతాల వద్ద ఉండే బండరాళ్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం నీటిలో ఉండడం వల్ల ఎక్కువగా పాకుడు పట్టి ఉంటాయి. వాటిపై జారిపడి, గాయాలబారిన పడే అవకాశం ఉంది.- అంతేకాదు పై నుండి (ఎగువప్రాంతాల నుండి) ఒక్కసారిగా వచ్చే నీటి వల్ల ప్రవాహ వేగం పెరిగే అవకాశాలు లేకపోలేదు. జలపాతాల దగ్గర ఉండే వృక్షాలకు దూరంగా ఉండాలి. అవి కూడా నీటిలో ఎక్కువగా ఊరి ఉండడం వల్ల ధృడత్వాన్ని కోల్పోతాయి. అవి కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అలాంటి ప్రాంతాలలో స్థానిక హెచ్చరిక బోర్డులు, పోలీసుల సలహాలు, సూచనలు పాటించడం శ్రేయస్కరం.