» »మురుడేశ్వరలో చూడదగిన ప్రాంతాలు ఇవే

మురుడేశ్వరలో చూడదగిన ప్రాంతాలు ఇవే

Posted By: Haritha

పరమశివుడి భక్తులకు చక్కని గమ్యస్థానం మురుడేశ్వర్. ఇది కర్ణాటకలోని పోర్ట్ నగరమైన భత్కల్ లో ఉంది. హిందువులకు సంబంధించి పవిత్రమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. మురుడేశ్వర్ చరిత్ర ఈనాటిది కాదు... ఏనాడో రామాయణ కాలంలోనే దీని చరిత్ర కు బీజం పడింది. అందుకే ఈ ప్రదేశం పరమపవిత్ర ఆధ్యాత్మిక స్థానంగా వెలుగొందుతోంది. మురుడేశ్వర్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మహాశివుని విగ్రహాన్ని కలిగి ఉన్న ప్రదేశం. సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రాంతం కనుల విందు చేస్తుంది. పవిత్ర ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలే కాకుండా... అందమైన మురుడేశ్వర్ బీచ్ ను కూడా తిలకించవచ్చు. సముద్ర అలలు వచ్చి పడుతుంటే... బీచ్ లో కూర్చుని ప్రశాంతంగా సేదతీరవచ్చు. ఇవే కాకుండా మురుడేశ్వర్లో చూడదగ్గ ప్రదేశాలేంటో చూద్దాం.

1. మురుడేశ్వర్ ఆలయం

1. మురుడేశ్వర్ ఆలయం

Image source

మహాశివుడికి మరో రూపమే శ్రీ మ్రుదేశ లింగా. మురుడేశ్వర్ ఆలయంలో శ్రీ మ్రుదేశ లింగ రూపంలోని పరమ శివుడిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం కందుక కొండపై ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. మూడు వైపుల నీటితో చూడచక్కని ప్రాంతం మురుడేశ్వర ఆలయం. అంతెత్తున ఎగిసిపడుతూ అలలు కొండను తాకుతుంటే... ఆ మధ్యలో కొలువుదీరిన మహాశివుడిని దర్శించుకుని సకల పాపాల నుంచి విముక్తి పొందొచ్చు. అందంగా చెక్కిన శిల్పాలతో కూడిన గోడలు, అదనపు ఆకర్షణ ఉండే సీలింగ్... పురాతన ఆలయ గొప్పతనాన్ని మరింత ఇనుమడింప జేస్తాయి. ఆలయంలో ప్రధానభాగాలన్నీ ఆధునికీకరించబడింది. గర్భగుడిని మాత్రం ప్రాచీన కాలం నాటి గురుతులు చెరిగిపోకుండా అలాగే ఉంచేశారు.

2. మహాశివుడి విగ్రహం

2. మహాశివుడి విగ్రహం

Image source

మురుడేశ్వర ఆలయం సముదాయంలోనే పరమ శివుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతి భారీ విగ్రహం కనుల విందు చేయడంతో పాటూ ఆధ్యాత్మిక భావాన్ని గుండెల నిండా నింపుతుంది. కింద ఆధారం నుంచి పై వరకు 123 అడుగుల ఎత్తుతో ప్రపంచంలో రెండో అతి పెద్ద శివుని విగ్రహంగా రికార్డులకెక్కింది. ఒక్కసారి ఆ మూర్తిని దర్శించుకుంటే, ఎంత ఎత్తుగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. కుటుంబంతో కలిసి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి ఆహ్లాదంగా గడపాలనుకునేవారికి మురుడేశ్వర్ సరైన గమ్యస్థానం.

3. మురుడేశ్వర బీచ్

3. మురుడేశ్వర బీచ్

Image source

సముద్రమంటేనే చాలా మందికి ఇష్టం. ఏ సముద్రం బీచ్ అయినా జనాలకు మంచి ఆట విడిదే. ఇక ఒక పక్క గొప్ప ఆలయం, అతి పెద్ద శివుని విగ్రహం ఉన్న చక్కటి ప్రాంతంలోనే బీచ్ కూడా ఉంటే... మరింత ఆహ్లాదంగా ఉంటుంది. సాయం సంధ్యా సమయంలో చక్కటి వాతావరణంలో బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. బోట్ రైడ్స్ కూడా అద్భుత అనుభవాలను తప్పకుండా మిగులుస్తాయి. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ కిరణాల తాకిడి బీచ్ వెండి వెన్నెల్లా మెరుస్తుంది. ఆ సీన్ ను మాత్రం మిస్సవ్వకుండా చూడాలి.

4. రాజ గోపురం

4. రాజ గోపురం

Image source

మురుడేశ్వర ఆలయానికి స్వాగతం పలికేందుకు రాజగోపురం ముందుగా సిద్దంగా ఉంటుంది. ఇరవై అంతస్థుల ఎత్తులో ఉండే ఈ గోపురం ఆధ్యాత్మిక భావనను మరింతగా పెంచుతుంది. ఈ రాజగోపురంలో ప్రధాన ఆకర్షణ లిఫ్టు సౌకర్యం. లిఫ్టులో భక్తులు ఇరవై అంతస్థుల ఎత్తుకు వెళ్లి... అక్కణ్నించి మురుడేశ్వర ప్రాంతాన్ని వీక్షించవచ్చు. అక్కడ్నించి మహాశివుడి భారీ విగ్రహాన్ని దర్శించవచ్చు. ఇలాంటి అందమైన, ఆధ్యాత్మిక ప్రదేశాన్ని చూడకుండా ఎలా ఉండగలం.