Search
  • Follow NativePlanet
Share
» »లక్షద్వీప్ .. జలచరాలతో విహారం !!

లక్షద్వీప్ .. జలచరాలతో విహారం !!

By Mohammad

లక్షద్వీప్ లేదా లక్షద్వీపములు భారతదేశంలోని ఒక కేంద్రపాలితప్రాంతం. భారత పటము చూస్తే కేరళకు పక్కన చిన్న చిన్న ద్వీపాల మాదిరి ఇవి కనిపిస్తాయి. పేరులో ఉన్నట్టు ఇక్కడ లక్ష ద్వీపాలు ఉన్నాయనుకుంటే పొరబడినట్లే ! ఇది పేరుకే లక్షద్వీప్ ... కానీ ఉన్నది మాత్రం 36 దీవులే! ఇక్కడికి వాయు లేదా జల మార్గాల ద్వారా మాత్రమే చేరుకోగలం. లక్షద్వీప్ రాజధాని కవరత్తి. సరిగా గమనిస్తే కేవలం పది అంటే పదే దీవుల్లో జనావాసం ఉంటుంది. మిగిలినవన్నీ నిర్జనమైన దీవులు.

దీవుల్లో డైవింగ్

లక్షద్వీప్ ప్రాంతం చుట్టూ నాలుగువైపులా అరేబియా సముద్రం ఉంటుంది. ఇక్కడ చాలా మంది పర్యాటకులు ఫిషింగ్ చేస్తూ ఆనందిస్తుంటారు. స్కూబా డైవింగ్ ఇక్కడ ప్రధాన నీటి క్రీడ. ఈ క్రీడలో పాల్గొనటానికి సాహసికులు ఉత్సాహపడుతుంటారు. స్కూబా డైవింగ్ చేసేటప్పుడు మొఖానికి మాస్క్ ధరించి సముద్రంలో దిగండి. కేవలం అనుభవజ్ఞులు మాత్రమే స్కూబా డైవింగ్ చేయటానికి అర్హులు లేదా గైడ్ సహాయం తీసుకొని మీరు కూడా సముద్రంలో దిగవచ్చు.

లక్షదీవులు ప్రధాన ఆకర్షణలు ఒకసారి పరిశీలిస్తే ..

బంగారం ద్వీపం

బంగారం ద్వీపం

బంగారం ద్వీపం అనేది ఒకవిధంగా చెప్పాలంటే ఇది ఉప్పునీటి పాయ చుట్టూ ఉన్న వలయాకార భూభాగం అని చెప్పలి. ప్రస్తుతం ఈ దీవి పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తున్న ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇది హనీమూన్ ప్రియులకు స్వర్గధామం.

చిత్రకృప : Lenish Namath

ఆల్కహాలు, సాహస క్రీడలు

ఆల్కహాలు, సాహస క్రీడలు

బంగారం ద్వీపంలో అల్కహాలుకు కొదవలేదు. ఈ ప్రాంతానికి వివిధ జాతుల పక్షులు వచ్చి వెళుతుంటాయి. నీటి క్రీడలు స్కూబాడైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్, వాటర్ స్కీయింగ్, యాచ్టింగ్ మరియు ఇతర క్రీడలను ద్వీపంలో ఆచరించవచ్చు.

చిత్రకృప : Salahpoomalika

అగట్టి ద్వీపం

అగట్టి ద్వీపం

అగట్టి ద్వీపాన్ని లక్షద్వీప దీవుల ముఖద్వారం గా పిలుస్తారు. కాలి నడకన ఈ దీవి లో తిరిగినా ఎక్కువ సమయం పట్టదు. అద్భుత ప్రకృతి దృశ్యాలు తనివితీరా చూడవచ్చు. అగట్టి దీవిలో స్కూబా డైవింగ్ మరియు స్నోర్కేలింగ్ వంటి నీటి క్రీడలు టూరిస్టులు ఆచరించవచ్చు. వీటి ఖర్చు కూడా తక్కువే. ఫిషింగ్ కూడా కలదు.

చిత్రకృప : Laksh saini

ఫిషింగ్ మరియు స్థానిక రుచులు

ఫిషింగ్ మరియు స్థానిక రుచులు

మీరు ఫిషింగ్ కు వెళ్ళేటపుడు, బోటు అడుగున గ్లాస్ ఉండేలా చూసుకోండి. ఆ గ్లాస్ నుండి నీటి లోని జీవాలను చూడవచ్చు. మీరు కనుక చేపలు పట్టుకుంటే, వాటిని వేయించి మీకు తినిపిస్తారు కూడాను. మీరు అక్కడ దొరికే స్థానిక ఆహారాలు కూడా రుచి చూడవచ్చు.ఈ ప్రదేశం లో దొరికే టూనా చేప ప్రపంచ ప్రసిద్ధి.

చిత్రకృప : Samphotography

కడమట్ ద్వీపం

కడమట్ ద్వీపం

కడమట్ ద్వీపాన్ని కార్డమామ్ ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్కుబాడైవింగ్, స్నూకరీంగ్ మరియు స్విమ్మింగ్ వంటి ప్రత్యేకం. ఇక్కడ లోతులేని చెరువులో అయినట్లయితే 2500 రూపాయలతో, సముద్రంలో అయినట్లయితే 4000 రూపాయలతో స్కుబాడైవింగ్ చేయవచ్చు.

చిత్రకృప : Sankara Subramanian

కవరత్తి

కవరత్తి

లక్ష ద్వీపాలలో వినోదానికి కవరత్తి ప్రధాన కేంద్రం గా వుంది. ఇండియా నుండి బోటు లో లేదా ఆగట్టి నుండి హెలికాప్టర్ లో చేరవచ్చు. షాపింగ్ ప్రదేశాలు, కొన్ని హెరి తేజ్, మ్యూజియం, ప్రదేశాలు కలవు. మసీదులు కూడా కలవు.

చేయవలసిన పనులు : బైక్ అద్దెకు తీసుకొని తిరగవచ్చు. స్కూబా డైవింగ్, బోటింగ్ చేపట్టవచ్చు.

చిత్రకృప : Ekabhishek

కల్పేని దీవి

కల్పేని దీవి

కల్పేని ఒక టిప్ బీచ్. తెల్లని ఇసుక కలిగి ఆకుపచ్చని రంగు కల స్వచ్చమైన నీరు కల సముద్రం కలిగి వుంటుంది.కయాకింగ్, రీఫ్ వాకింగ్ వంటి వాటికి ప్రసిద్ధి. ఇక్కడ కల కాటేజ్ లను టూరిస్టులు షేరింగ్ పద్ధతి లో అద్దెకు తీసుకోవచ్చు.

చిత్రకృప : Sankara Subramanian

మాలిక్ ద్వీపం

మాలిక్ ద్వీపం

మాలిక్ ద్వీపాన్ని మినీ కాయ్ ద్వీపం లేదా మాలిక్ అటల్ అని కూడా అంటారు. ఈ ద్వీపం లక్ష ద్వీపాలలో దక్షిణ భాగం చివరలో వుంటుంది. ద్వీపం పూర్తిగా కొబ్బరి, తాటి చెట్లతో నిండి, చక్కని ప్రకృతి దృశ్యాలతో ఒక విశ్రాంత ప్రదేశంగా వుంటుంది. ఇక్కడి వాతావరణం, ఆహారం ఏ మాత్రం కలుషితం లేక ఒక నిర్మల ప్రదేశ అనుభవాలను అందిస్తాయి.

చిత్రకృప : icultist

మొయిదీన్ మసీద్

మొయిదీన్ మసీద్

ఈ మసీద్ కల్పేని ద్వీపంలో కలదు. ఇక్కడ ప్రవేశ భాగం సుమారుగా 350 సంవత్సరాల పూర్వం పునర్నిర్మించినారు. ఇక్కడ సముద్రానికి దగ్గరిలో ఏడు చెరువులు ఉన్నాయి. వీటిలోన సముద్రానికి ఏదైతే దగ్గర ఉందో దానిని త్రాగునీటి అవసరాల కోసం ఇక్కడి ప్రజలు వినియోగిస్తారు.

చిత్రకృప : Vaikoovery

అమిని ద్వీపం

అమిని ద్వీపం

ఈ ద్వీపం అసలుసిసలైన విశ్రాంతి ప్రదేశ అనుభవాలను పర్యాటకులకు కలిగిస్తుంది. ఈ దీవి చూడటానికి కోడిగుడ్డు ఆకారంలో కనిపిస్తుంది. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను ఇసుకతిన్నెల మీద కూర్చొని వీక్షించవచ్చు. రిసార్టులు అందంగా అలంకరించబడి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటాయి.

చిత్రకృప : Vaikoovery

సుహేలి పార్

సుహేలి పార్

ఈ దీవి రెండు చిన్న దీవుల సముదాయం. ఇది అగట్టి ఐలాండ్ కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టూనా చేపలకు ఈ దీవి ప్రసిద్ధి. సీజన్ లో మత్స్యకారులు తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తుంటారు. ఒంటరిగా కూర్చొని ఇసుకతిన్నెల మీద మధ్యానవేళలు టూనా చేప ను తింటూ బీచ్ అందాలను వీక్షించవచ్చు.

చిత్రకృప : Amog

ఎక్కడ ఉండాలి?

ఎక్కడ ఉండాలి?

సీషెల్సు బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్‌స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్‌మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్టు హౌస్‌ల నుంచి ఐదు వేలు చార్జి చేసే రిసార్టుల వరకు ఉన్నాయి.

చిత్రకృప : Manvendra Bhangui

భోజనం ఎలా?

భోజనం ఎలా?

ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. కేరళ నుంచి టిన్డ్ ఫుడ్ వస్తుంది.

ఎప్పుడు వెళ్లాలి?

ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది.

చిత్రకృప : Vaikoovery

లక్షదీవులకు ఎలా వెళ్ళాలి ?

లక్షదీవులకు ఎలా వెళ్ళాలి ?

విమానాశ్రయం అగట్టిలో మాత్రమే కలదు. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్‌బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు ఉంటాయి. కొచ్చిన్ నుంచి అగట్టికి విమానాలలో అయితే గంటన్నర ప్రయాణం. రైలు మార్గం... కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి విమానం లేదా షిప్‌లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది.

చిత్రకృప : Premnath Kudva

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X